టైటిల్ : గని
జానర్ : స్పోర్ట్స్ డ్రామా
నటీనటులు : వరుణ్ తేజ్, సాయి మంజ్రేకర్, ఉపేంద్ర, సునీల్ శెట్టి, జగపతి బాబు, నదియ, నవీన్ చంద్ర, నరేశ్ తదితరులు
నిర్మాతలు : అల్లు బాబీ, సిద్దు ముద్ద
దర్శకత్వం : కిరణ్ కొర్రపాటి
సంగీతం : తమన్
ఎడిటింగ్: మార్తాండ్ కె.వెంకటేష్
సినిమాటోగ్రఫీ : జార్జ్ సి. విలియమ్స్
విడుదల తేది : ఏప్రిల్ 8, 2022
మెగా కుటుంబం నుంచి వచ్చి తనదైన స్టైల్లో నటిస్తూ..టాలీవుడ్‌లో ప్రత్యేక ఇమేజ్ తెచ్చుకున్నాడు యంగ్ హీరో వరుణ్ తేజ్. కెరీర్ స్టార్టింగ్‌లో కథల ఎంపిక విషయంలో కాస్త తడపడినా.. ఆ తర్వాత ఢిఫరెంట్ స్టోరీలను ఎంచుకుంటూ వరుస విజయాలతో దూసుకెళ్తున్నాడు. తాజాగా వరుణ్ చేసిన మరో ప్రయోగం ‘గని’. ఇందులో తొలిసారి బాక్సర్‌గా తెరపై కనించబోతున్నాడీ హీరో. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్‌కు మంచి స్పందన రావడంతో పాటు సినిమాపై హైప్ క్రియేట్ చేశాయి. భారీ అంచనాల మధ్య శుక్రవారం (ఏప్రిల్ 8) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఏ మేరకు ఆదరించారో రివ్యూలో చూద్దాం.
‘గని’ కథేంటంటే
‘గని’(వరుణ్ తేజ్)కి చిన్నప్పటి నుంచి బాక్సింగ్ అంటే చాలా ఇష్టం. వాళ్ల నాన్న విక్రమాదిత్య(ఉపేంద్ర) విషయంలో జరిగిన ఓ ఇన్సిడెంట్ వల్ల ‘గని’ బాక్సింగ్‌కు దూరమవుతాడు. దీంతో గనికి తండ్రి మీద విపరీతమైన ద్వేషం ఏర్పడుతుంది. మరోవైపు జీవితంలో ఎప్పుడూ బాక్సింగ్ జోలికి వెళ్లొద్దని గని అమ్మ(నదియ) ఒట్టు వేయించుకుంటుంది. గని మాత్రం తల్లికి తెలియకుండా బాక్సింగ్ పోటీల్లో పాల్గొంటూనే ఉంటాడు. ఎప్పటికైనా నేషనల్ చాంపియన్‌గా నిలవాలనేదే అతని ఆశయం. అసలు గని బాక్సింగ్‌లో నేషనల్ చాంపియన్ కావాలని ఎందుకు అనుకుంటున్నాడు? వాళ్ల నాన్న విషయంలో జరిగిన ఆ ఇన్సిడెంట్ ఏంటి? తండ్రి గురించి అసలు విషయం తెలుసుకున్న తర్వాత గని ఏం చేశాడు? తన తండ్రికి ఈశ్వర్(జగపతి బాబు)చేసిన అన్యాయం ఏంటి? ఈశ్వర్ అసలు రూపాన్ని గని ఎలా బయటపెట్టాడు? గని చివరకు నేషనల్ చాంపియన్‌గా నిలిచాడా? లేదా? అనేదే మిగతా కథ.
ఎలా ఉందంటే..
సాధారణంగా స్పోర్ట్స్ డ్రామా సినిమాల్లో జీరోలో ఉన్న ఓ వ్యక్తి హీరో కావడం అన్నట్లుగా కథ ఉంటుంది. ‘గని’ చిత్రంలోనూ ఇదే పాయింట్. కానీ ‘గని’ క్యారెక్టర్ ఏంటి? అతని ప్రయాణంలో ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కొన్నాడు? అనే అంశాలను చూపిస్తూ కథను ముందుకు నడిపించాడు దర్శకుడు కిరణ్ కొర్రపాటి. దర్శకుడు ఎంచుకున్న పాయింట్ బాగున్నప్పటికీ.. తెరపై చూపించడంలో తడబడ్డాడు. ఫస్టాఫ్ అంతా సాదాసీదాగా నడిపించి, అసలు కథను సెకండాఫ్‌లో చూపించాడు.
ఫస్టాఫ్‌లో వచ్చే కాలేజీ సీన్స్, తల్లి కొడుకుల సెంటిమెంట్ అంతగా వర్కౌట్ కాలేదు. ఇక హీరోయిన్‌తో ప్రేమాయాణం అయితే అతికినట్లే ఉంది తప్ప వారి లవ్‌కి ప్రేక్షకుడు ఎక్కడా కనెక్ట్ కాలేడు. కమర్షియల్ సినిమా అన్నాక ఓ హీరోయిన్ ఉండాలి అనే కోణంలో ఆమె క్యారెక్ట్‌ని సృష్టించారు తప్ప.. ఈ కథకి అసలు ఆ పాత్రే అవసరం లేదనిపిస్తుంది. ఇక తల్లి కొడుకుల మధ్య వచ్చే ఎమోషనల్ సీన్స్ కూడా అంతగా పండలేదు. నవీన్‌చంద్ర, వరుణ్‌ల మధ్య వచ్చే ఫైట్ సీన్స్ ఆకట్టుకుంటాయి.
ఎలాంటి సర్‌ప్రైజ్ లేకుండా ఫస్టాఫ్ అంతా చాలా చప్పగా సాగినప్పటికీ.. ఇంటర్వెల్ ట్విస్ట్ మాత్రం అదిరిపోతుంది. ఉపేంద్ర ప్లాష్‌బ్యాక్ సీన్‌తో సెకండాఫ్ స్టార్ట్ అవుతుంది. అది కాస్త ఆసక్తిగా అనిపిస్తుంది. ఆ తర్వాత కథంతా మళ్లీ రొటీన్‌గానే సాగుతుంది. తండ్రికి అన్యాయం చేసిన ఈశ్వర్ ఇండియన్ బాక్సింగ్ లీగ్(ఐబీఎల్) నెలకొల్పడం.. ఆ ముసుగులో కోట్ల రూపాయలను అక్రమంగా సంపాదించడం..దానిని గని అరికట్టడంతో కథ ముగుస్తుంది. అయితే ఇక్కడ వచ్చే ప్రతి సీన్ గతంలో స్టోర్ట్స్ నేపథ్యంలో వచ్చిన చిత్రాలను గుర్తుకు చేస్తాయి. ప్రేక్షకుడి ఊహకి తగ్గట్టుగా కథనం సాగుతుంది. అన్ని స్పోర్ట్స్ డ్రామాల్లో ఎలాంటి క్లైమాక్స్ ఉంటుందో, గనిలోనూ అదే ఉంది. కాకపోతే ఎమోషన్ మిస్సయిందనిపిస్తుంది. ప్రతి పాత్రకు పేరున్న నటులను తీసుకోవడం సినిమాకు కలిసొచ్చింది.
ఎవరెలా చేశారంటే..
బాక్సర్ గనిగా వరుణ్ తేజ్ మెప్పించాడు. ఈ పాత్ర కోసం వరుణ్ పడిన కష్టమంతా తెరపై కనిపిస్తుంది. రింగ్‌లోకి దిగే నిజమైన బాక్సర్‌లాగే కనిపించాడు. మాయ పాత్రలో సాయీ మంజ్రేకర్ పర్వాలేదనిపించింది. ఆమె పాత్ర నిడివి చాలా తక్కువే అయినా.. ఉన్నంతలో బాగానే నటించింది. ఇక హీరో తండ్రి విక్రమాదిత్యగా ఉపేంద్ర తన అనుభవాన్ని మరోసారి తెరపై చూపించాడు. కథను మలుపు తిప్పే పాత్ర అతనిది. గని కోచ్ పాత్రకు సునీల్ శెట్టి న్యాయం చేశాడు. నెగెటివ్ షేడ్స్ ఉన్న ఈశ్వర్ పాత్రలో జగపతిబాబు పరకాయ ప్రవేశం చేశాడు. హీరో తల్లిగా నదియా, బాక్సర్‌గా నవీన్ చంద్రతో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు.
ఇక సాంకేతిక విషయాలకొస్తే.. ఈ సినిమాకు ప్రధాన బలం తమన్ సంగీతం. పాటలు యావరేజ్‌గానే ఉన్నప్పటికీ.. నేపథ్య సంగీతం మాత్రం అదిరిపోయింది. స్పోర్ట్స్ డ్రామా చిత్రంలో ప్రేక్షకుడిని విలీనం చేయడంలో నేపథ్య సంగీతానిది కీలక పాత్ర.. ఆ విషయంలో తమన్‌కి నూటికి నూరు మార్కులు ఇవ్వొచ్చు. జార్జ్ సి. విలియమ్స్ సినిమాటోగ్రఫి బాగుంది. ఎడిటర్ మార్తాండ్ కె.వెంకటేష్ తన కత్తెరకు ఇంకాస్త పని చెప్పాల్సింది. ఫస్టాఫ్‌లో చాలా సన్నివేశాలను మరింత క్రిస్పీగా కట్ చేయాల్సింది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. బాక్సాఫీస్‌పై ‘గని’ పంచ్ ఎలా ఉంటుందో ఈ వీకెండ్‌లో తెలిసిపోతుంది.
- అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్
Comments
Please login to add a commentAdd a comment