చిన్న పిల్లలకు గీతలు గీయడమన్నా, బొమ్మలు వేయడమన్నా ఎంతో ఇష్టం. పూర్వం బలపాలు, పెన్సిళ్లు వాడేవాళ్ళు. ఇప్పటి జెనరేషన్ క్రేయాన్స్ వాడుతున్నారు. పిల్లలు ఒక్కోసారి పిచ్చి గీతలు గీస్తారు. ఒక్కోసారి పేరు లేని ఆకారాలను వేస్తారు. ఏది గీసినా, రాసినా వాటికి జీవమొస్తే..? అన్న చిలిపి ఆలోచన హాలీవుడ్ దర్శకుడు కార్లోస్‌కు వచ్చింది. ఇంకేముంది ‘హెరాల్డ్ అండ్ ది పర్పుల్ క్రేయాన్‘ అనే సినిమాను రూపొందించాడు.
కథాపరంగా ‘హెరాల్డ్ అండ్ ది పర్పుల్ క్రేయాన్’లో హెరాల్డ్ అనే బాలుడు ఓ పుస్తకంలోని పాత్ర. అతనితో పాటు మూస్, పోర్క్‌పైన్ అనే మరో రెండు పాత్రలు ఉంటాయి. హెరాల్డ్ తన మానాన తాను ఉండగా బయటి ప్రపంచంలో అతనికి తెలిసిన ఓ వృద్ధుడు కనిపించకుండా పోతాడు. దాంతో హెరాల్డ్ ఆ వృద్ధుణ్ణి వెతకడానికి పర్పుల్ క్రేయాన్‌తో ఓ తలుపు బొమ్మ గీసి పుస్తకంలో నుంచి మానవ ప్రపంచంలోకి అడుగుపెడతాడు. అతనితో పాటు తోడుగా మూస్, పోర్క్‌పైన్ కూడా బయటకు వస్తాయి. ఇక అక్కడ నుండి మానవ ప్రపంచంలో అతడు ఏది గీస్తే అది నిజమైపోయి కథను నడిపిస్తుంది.
హెరాల్డ్ ఆ ముసలివాడిని కనుగొంటాడా, మానవ ప్రపంచంలో తన మాయాజాలంతో ఎదుర్కోన్న ఇబ్బందులేంటి అన్నది మాత్రం సినిమా చూస్తేనే తెలుస్తుంది. ఈ సినిమాలో కారు బొమ్మ, హెలికాప్టర్ బొమ్మ ఇలా ఏది క్రేయాన్‌తో గీసినా అది నిజంగా అయిపోవడం పిల్లలకు బాగా నచ్చుతుంది. విజువల్‌గా గ్రాఫిక్స్ పిల్లలకే కాదు పెద్దవాళ్ళను ఆకట్టుకుంటాయి. పండుగ సెలవలకు పిల్లలతో పాటు పెద్దలు కూడా సరదాగా చూడగలిగిన సినిమా ‘హెరాల్డ్ అండ్ ది పర్పుల్ క్రేయాన్‘. వర్త్ టు వాచ్ ఇట్. అమెజాన్ ప్రైమ్‌తో పాటు జీ5లో స్ట్రీమింగ్ అవుతుంది.
– ఇంటూరు హరికృష్ణ
Comments
Please login to add a commentAdd a comment