Best Heroines Action Movies With Female Leads In The Tollywood And Bollywood, Deets Inside - Sakshi
Sakshi News home page

Heroines Action Movies: హీరోయిన్లా మజాకా.. యాక్షన్ తగ్గేదే లే!

Published Tue, Aug 8 2023 5:55 AM | Last Updated on Tue, Aug 8 2023 10:20 AM

Heroines Action Movies With Female Leads in the Tollywood and Bollywood - Sakshi

ఒకరు తుపాకీ పట్టుకున్నారు.. ఇంకొకరు ఫ్లయిట్‌ ఎక్కారు...  ఫైట్‌ చేయడానికి రెడీ అయ్యారు. ‘యాక్షన్‌కి సై’ అంటూ బరిలోకి దిగారు. ప్రత్యర్థులను రఫ్ఫాడారు. సుకుమారంగా కనిపించే కథానాయికలు రఫ్‌గా మారిపోయి, విలన్లను ఇరగదీశారు. సమంత, త్రిష, కీర్తీ సురేశ్, దీపికా పదుకోన్, కత్రినా కైఫ్, ఆలియా భట్, కృతీ సనన్‌ వంటి నాయికలు సినిమాల్లో, వెబ్‌ సిరీస్‌ల్లో యాక్షన్‌ రోల్స్‌ చేస్తున్నారు. ఆ విశేషాలు తెలుసుకుందాం.

పవర్‌ఫుల్‌ రీటా
ఓ వైపు హీరోయిన్‌గా అగ్రహీరోల సరసన నటిస్తూనే మరోవైపు కథానాయిక ప్రాధాన్యం ఉన్న చిత్రాలతో మెప్పిస్తున్నారు కీర్తీ సురేశ్‌. ప్రస్తుతం ఆమె లీడ్‌ రోల్‌లో నటిస్తున్న తమిళ చిత్రం ‘రివాల్వర్‌ రీటా’. చంద్రు దర్శకత్వం వహిస్తున్నారు. కామెడీ, థ్రిల్, యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో కీర్తీ సురేశ్‌ యాక్షన్‌ సీన్స్‌ చేస్తున్నారు.

ఈ చిత్రం ఫస్ట్‌ లుక్‌లో రెండు చేతుల్లో రెండు రివాల్వర్స్‌ పట్టుకుని ఉన్న కీర్తి పోస్టర్‌కి మంచి స్పందన వచ్చింది. ఈ సినిమా తెలుగులోనూ విడుదలకానుంది. కాగా ‘సైరన్, రఘు తాత, కన్ని వెడి’ వంటి చిత్రాలతో ఫుల్‌ బిజీగా ఉన్నారు కీర్తీ సురేశ్‌. వీటిలో ‘కన్ని వెడి’ లేడీ ఓరియంటెడ్‌ మూవీ. ‘రఘు తాత’ కూడా దాదాపు ఇలాంటి సినిమానే. ఇక చిరంజీవి చెల్లెలిగా కీర్తి నటించిన ‘భోళా శంకర్‌’ ఈ 11న విడుదల కానున్న విషయం తెలిసిందే.

బాలీ టు హాలీవుడ్‌
బాలీవుడ్‌ బ్యూటీ దీపికా పదుకోన్‌ ఈ మధ్య ఎక్కువగా యాక్షన్‌ సినిమాలకు పచ్చజెండా ఊపుతున్నారు. ఈ ఏడాది జనవరిలో విడుదలైన షారుక్‌ ఖాన్‌ ‘పఠాన్‌’ మూవీలో యాక్షన్‌ సీన్స్‌లో అదరగొట్టిన దీపిక ప్రస్తుతం ‘ఫైటర్‌’, ‘సింగం 3’ వంటి చిత్రాల్లో యాక్షన్‌ రోల్స్‌కి సై అన్నారు. సిద్ధార్థ్‌ ఆనంద్‌ దర్శకత్వం వహిస్తున్న ‘ఫైటర్‌’ కోసం ప్రత్యేకంగా స్టంట్స్‌లో  శిక్షణ తీసుకున్నారు దీపిక. అలాగే ‘సింగం’ ఫ్రాంచైజీలో భాగంగా ‘సింగం 3’ రూపొందనుంది.

‘సింగం’, ‘సింగం 2’ చిత్రాలు తెరకెక్కించిన రోహిత్‌ శెట్టి దర్శకత్వంలోనే ‘సింగం 3’ తెరకెక్కనుంది. ఈ మూడో భాగం హీరోయిన్‌ ఓరియంటెడ్‌గా సాగనుందట. ఇందులో దీపికా పవర్‌ఫుల్‌ పోలీస్‌గా కనిపించనున్నారు. ఈ చిత్రం త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లనుంది. అలాగే ఓ హాలీవుడ్‌ మూవీలో ఏజెంట్‌గా కనిపించనున్నారట దీపిక. ఈ చిత్రంలోనూ ఆమె యాక్షన్‌ సీన్స్‌ చేయనున్నారని భోగట్టా. ఇలా బాలీవుడ్‌ టు హాలీవుడ్‌ యాక్షన్‌ రోల్స్‌ సైన్‌ చేసి జోరుగా దూçసుకెళుతున్నారు దీపికా పదుకోన్‌.

టైగర్‌తో యాక్షన్‌
సల్మాన్‌  ఖాన్‌కి సమానంగా కాకపోయినా తనదైన శైలిలో ఫైట్స్‌ చేశారు కత్రినా కైఫ్‌. ‘టైగర్‌’ ఫ్రాంచైజీలో భాగంగా సల్మాన్‌ ఖాన్‌ టైటిల్‌ రోల్‌లో దర్శకుడు మనీష్‌ శర్మ తెరకెక్కిస్తోన్న చిత్రం ‘టైగర్‌ 3’. ఇందులో కత్రినా కైఫ్‌ హీరోయిన్‌. హీరో హీరోయిన్లు ఇద్దరూ గూఢ చారుల పాత్రల్లో నటిస్తున్నారట. ఐఎస్‌ఐ ఏజెంట్‌ జోయా పాత్రలో కత్రినా కనిపించనున్నారని సమాచారం. ఈ హై ఓల్టేజ్‌ యాక్షన్‌ మూవీలో జోయాగా కత్రినా చేసిన ఫైట్స్‌ హైలైట్‌గా ఉంటాయని ట్రైలర్‌ స్పష్టం చేస్తోంది. ఈ ఫైట్స్‌ కోసం ప్రత్యేకించి సౌత్‌ కొరియాకు చెందిన స్టంట్‌ మాస్టర్ల దగ్గర 14 రోజులు శిక్షణ తీసుకున్నారట కత్రినా. ఈ చిత్రం నవంబర్‌ 10న రిలీజ్‌ కానుంది.  



యుద్ధ విమానం ఎక్కి..
దాదాపు లేడీ ఓరియంటెండ్‌ సినిమాలకే పరిమితమయ్యారు కంగనా రనౌత్‌. సర్వేష్‌ మేవారా దర్శకత్వంలో ఆమె లీడ్‌ రోల్‌లో నటించిన తాజా చిత్రం ‘తేజస్‌’. ఈ చిత్రంలో ఆమె యుద్ధ విమానాలు నడిపే పైలెట్‌ పాత్ర చేశారు. కంప్లీట్‌ యాక్షన్‌ ఓరియంటెడ్‌గా రూపొందిన ఈ చిత్రం కోసం పలు యుద్ధ విద్యలు కూడా నేర్చుకున్నారు కంగన. ఇందుకోసం దాదాపు నాలుగు నెలల పాటు ఆమె శిక్షణ తీసుకున్నారు. ఈ చిత్రం అక్టోబర్‌ 20న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇదిలా ఉంచితే.. కంగనా రనౌత్‌ లీడ్‌ రోల్‌లో నటిస్తూ,  స్వీయ దర్శకత్వంలో ‘ఎమర్జెన్సీ’ చిత్రం నిర్మించారు. భారత ప్రధాని ఇందిరా గాంధీ హయాంలో ఎమర్జెన్సీ (1975–1977) ఎందుకు విధించారు? ఆ పరిస్థితి ఎందుకు ఏర్పడింది? అనే అంశంతో ‘ఎమర్జెన్సీ’ని తెరకెక్కించారు. ఇందిరా గాంధీగా కంగన నటించిన ఈ చిత్రం నవంబరు 24న విడుదల కానుంది. అలాగే పి. వాసు దర్శకత్వంలో లారెన్స్‌ హీరోగా కంగన టైటిల్‌ రోల్‌లో రూపొందిన ‘చంద్రముఖి 2’ సెప్టెంబరు 19న విడుదల కానుంది.



హాలీవుడ్‌లో యాక్షన్‌
అందం, అభినయంతో ప్రేక్షకులను అలరిస్తున్న హీరోయిన్‌ ఆలియా భట్‌ కూడా యాక్షన్‌కి సై అన్నారు. టామ్‌ హార్పర్‌ దర్శకత్వం వహించిన హాలీవుడ్‌ చిత్రం ‘హార్ట్‌ ఆఫ్‌ స్టోన్‌’లో ఆలియా కీలక పాత్ర చేశారు. స్పై యాక్షన్‌ మూవీగా రూపొందిన ఈ సినిమాలో యాక్షన్‌ సీక్వెన్స్‌ కోసం ప్రత్యేకంగా శిక్షణ తీసుకున్నారు ఆలియా భట్‌. ఈ నెల 11న ఈ సినిమా విడుదల కానుంది.  



బైక్‌పై దూసుకెళుతూ...
ఇటీవల విడుదలైన ‘ఆది పురుష్‌’లో సుకుమారి సీతగా కనిపించిన కృతీ సనన్‌ ఇప్పుడు అందుకు పూర్తి విభిన్నంగా రూడ్‌గా మారిపోయారు. వికాస్‌ బాల్‌ దర్శకత్వం వహించిన ‘గణ్‌పథ్‌: పార్ట్‌ 1’లో ఆమె పవర్‌ఫుల్‌ రోల్‌ చేశారు. ఈ సినిమా కోసం కృతి అద్భుతమైన బైక్‌ స్టంట్స్‌ చేశారు. ఇందుకోసం బైక్‌ స్టంట్స్‌ నేర్చుకున్నారామె. అమితాబ్‌ బచ్చన్, టైగర్‌ ష్రాఫ్‌ నటించిన ఈ చిత్రం అక్టోబర్‌ 20న విడుదల కానుంది. ఇంతేనా.. ఇంకొందరు కథానాయికలు యాక్షన్‌ రోల్స్‌కి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చి, తామేంటో నిరూపించుకోవడానికి రెడీ అవుతున్నారు.

వెబ్‌లో యాక్షన్‌
కొందరు కథానాయికలు వెండితెరపై యాక్షన్‌ రోల్స్‌ చేస్తుంటే త్రిష, సమంత వంటి తారలు వెబ్‌ సిరీస్‌లో ఈ తరహా పాత్రలు చేస్తున్నారు. రెండు దశాబ్దాల కెరీర్‌లో ఎన్నో గుర్తుండిపోయే పాత్రలను పోషించిన త్రిష తొలిసారి ‘బృందా’ అనే వెబ్‌ సిరీస్‌లో నటించారు. సూర్య వంగల్‌ దర్శకత్వం వహించిన ఈ వెబ్‌ సిరీస్‌లో త్రిష ఓ పవర్‌ పోలీసాఫీసర్‌ పాత్ర చేశారు. త్రిషలోని మాస్‌ ఇమేజ్‌ని బలంగా చూపించే పాత్ర ఇది. త్వరలో ఈ సిరీస్‌ స్ట్రీమింగ్‌ కానుంది. మరోవైపు ఆ మధ్య వరుసగా హీరోల సరసన నటించిన సమంత ఇటీవల లేడీ ఓరియంటెడ్‌ చిత్రాలు ఎక్కువగా చేస్తున్నారు.

ఈ బ్యూటీ నటించిన తొలి వెబ్‌ సిరీస్‌ ‘ది ఫ్యామిలీ మేన్‌ 2’. దర్శక ద్వయం రాజ్‌–డీకే తెరకెక్కించిన ఈ సిరీస్‌లో సమంత యాక్షన్‌ రోల్‌లో అదరగొట్టారు. ప్రస్తుతం సమంతతోనే ఈ దర్శక–ద్వయం ‘సిటాడెల్‌’ అనే మరో వెబ్‌ సిరీస్‌ రూపొందిస్తున్నారు. ప్రియాంకా చో్రపా నటించిన అమెరికన్‌ సైన్స్‌  ఫిక్షన్‌ హిట్‌ డ్రామా ‘సిటాడెల్‌’ ఆధారంగా ఈ వెబ్‌ సిరీస్‌ తెరకెక్కుతోంది. గూఢచారి సాహసాల నేపథ్యంలో పూర్తి స్థాయి యాక్షన్‌ సిరీస్‌గా రూపొందుతోంది. ఇందులో సమంత యాక్షన్‌ సీన్స్‌లో అలరించనున్నారు. సెప్టెంబర్‌ నుంచి ఈ సిరీస్‌ స్ట్రీమింగ్‌ అయ్యే అవకాశం ఉంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement