
దేవరపై తన ప్రేమనంతా పాట రూపంలో చూపించేసింది తంగమ్. ‘చుట్టమల్లె చుట్టేస్తావె తుంటరి చూపు... ఊరికే ఉండదు కాసేపు... అస్తమానం నీ లోకమే నా మైమరపు... చేతనైతే నువ్వే నన్నాపు...’ అంటూ తన ప్రేమను వ్యక్తపరిచింది. దేవరగా ఎన్టీఆర్, తంగమ్‌గా జాన్వీ కపూర్ నటిస్తున్న ‘దేవర’ చిత్రంలోని పాట ఇది. కొరటాల శివ దర్శకత్వంలో నందమూరి కల్యాణ్ రామ్ సమర్పణలో మిక్కిలినేని సుధాకర్, హరికృష్ణ .కె ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
తొలి భాగం సెప్టెంబర్ 27న తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మ్యూజికల్ ప్రమోషన్స్ ఆరంభించి, ఒక్కో పాట విడుదల చేస్తున్నారు. సోమవారం ‘చుట్టమల్లె చుట్టేస్తావె...’ అంటూ సాగే ఈ సినిమాలోని రెండో పాటను రిలీజ్ చేశారు. అనిరుధ్ రవిచందర్ స్వరపరచిన ఈ రొమాంటిక్ మెలోడీ సాంగ్‌కు రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించగా శిల్పా రావ్ పాడారు. బాస్కో మార్టిస్ కొరియోగ్రఫీ చేశారు.హై యాక్షన్ మాస్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ‘దేవర’ చిత్రానికి కెమెరా: ఆర్. రత్నవేలు.