సినీ పితామహుడుగా పేరు గాంచిన సినీ పంపిణీదారుడు డి.రామానుజన్ శత జయంతి వేడుకను మంగళవారం సాయంత్రం చెన్నై లోని ఏవీఎం రాజేశ్వరి కల్యాణ మండపంలో ఘనంగా నిర్వహించారు. ప్రముఖ సినీ నిర్మాత కలైపులి ఎస్.థాను ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి కమల్ హాసన్ ముఖ్య అతిథిగా విచ్చేశారు.
ఆయన కృషి మరువలేనిది
ఈ సందర్భంగా కమల్ హాసన్ మాట్లాడుతూ.. డి.రామానుజన్‌తో, ఆయన కుటుంబంతో తనకున్న అనుభవాన్ని పంచుకున్నారు. ఆధునికతకు పెద్దపీట వేసిన ఆయన తమిళ సినిమా ఉన్నతికి అవసరం అయిన వాటిని సమకూర్చారన్నారు. అలాంటి వ్యక్తికి శతజయంతి వేడుకలను నిర్వహించడం గొప్ప విషయం అని ప్రశంసించారు.
వ్యక్తిగత దూషణలెందుకు?
ఇటీవల సినిమా ఇండస్ట్రీలో విభేదాలు ఎక్కువ అవుతున్నాయని, దీంతో ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారన్నారు. విభేదాలు కలగడం సహజమేనని, అయితే వాటిని వ్యక్తిగత దూషణల వరకు తీసుకువెళ్లరాదన్నారు. అప్పట్లో తనకు డి రామానుజన్‌కు మధ్య కూడా చిన్న వివాదం తలెత్తిందని, కానీ దాన్ని తాము తీవ్రంగా తీసుకోలేదని చెప్పారు.
సమైక్యతా భావం ముఖ్యం
ఇక్కడ ఎవరి అభిప్రాయాలు వారికి ఉంటాయని, అయితే సమైక్యతా భావం చాలా ముఖ్యమని కమల్ హాసన్ పేర్కొన్నారు. డి.రామానుజన్ శత జయంతి వేడుకలను నిర్మాత కలైపులి ఎస్.థాను చక్కగా నిర్వహించారని ప్రశంసిస్తూ ఈ సాంప్రదాయం కొనసాగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పన్నీర్ సెల్వన్, దర్శకుడు నటుడు కె.భాగ్యరాజ్, నిర్మాత కేఆర్ వీసీ గుహనాథన్, ఆర్‌వీ ఉదయకుమార్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment