Kanmani Rambo Khatija Movie Review And Rating In Telugu | Vijay Sethupathi | Samantha | Nayanthara - Sakshi
Sakshi News home page

Kanmani Rambo Khatija Review: 'కణ్మనీ రాంబో ఖతీజా' సినిమా ఎలా ఉందంటే ?

Published Thu, Apr 28 2022 3:37 PM | Last Updated on Thu, Apr 28 2022 5:04 PM

Kanmani Rambo Khatija Movie Review And Rating In Telugu - Sakshi

టైటిల్‌ : కణ్మనీ రాంబో ఖతీజా
నటీనటులు : విజయ్ సేతుపతి, నయనతార, సమంత, ప్రభు, శ్రీశాంత్‌ తదితరులు
నిర్మాణ సంస్థ: రౌడీ పిక్చర్స్ - సెవెన్ స్క్రీన్ స్టూడియోస్ 
నిర్మాతలు: విగ్నేశ్‌ శివన్ - నయనతార - ఎస్.ఎస్.లలిత్ కుమార్
దర్శకుడు: విగ్నేశ్‌ 
సంగీతం: అనిరుథ్‌
సినిమాటోగ్ర‌ఫి:ఎస్.ఆర్.కధిర్ - విజయ్ కార్తీక్ కణ్ణన్
విడుదల తేది: ఏప్రిల్‌ 28,2022

టాలీవుడ్‌ స్టార్ హీరోయిన్‌ సమంత, లేడీ సూపర్‌ స్టార్‌ నయన తార, విలక్షణ నటుడు, కోలీవుడ్‌ స్టార్‌ హీరో విజయ్ సేతుపతి కలిసి నటించిన చిత్రం 'కాతు వాకుల రెండు కాదల్‌'. రొమాంటిక్‌, కామెడీ ట్రయాంగిల్‌ లవ్‌స్టోరీగా తెరకెక్కిన ఈ చిత్రానికి విఘ్నేష్‌ శివన్‌ దర్శకత్వం వహించారు. కోలీవుడ్‌ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్‌ రవిచందర్‌ సంగీతం అందించిన ఈ సినిమాను రౌడీ పిక్చర్స్‌, సెవెన్‌ స్క్రీన్‌ స్టూడియోస్‌ సంయుక్తంగా నిర్మించాయి. నేడు (ఏప్రిల్‌ 28) సమంత పుట్టినరోజు సందర్భంగా తెలుగులో 'కణ్మనీ రాంబో ఖతీజా' పేరుతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ మూవీ. మరీ ఈ మూవీ ఎలా ఉంది ? ఇద్దరు అమ్మాయిలైన కణ్మనీ, ఖతీజాల మధ్య రాంబో ఎలా నలిగిపోయాడు ? అనేది మూవీ రివ్యూలో చూద్దాం.

కథేంటంటే..?
రాంబో(విజయ్‌ సేతుపతి) పుట్టుకతోనే దురదృష్టవంతుడిగా పేరు తెచ్చుకుంటాడు. అతను పుట్టగానే తండ్రి చనిపోతాడు. తల్లి అనారోగ్యం పాలవుతుంది. దీంతో రాంబో కూడా నిజంగానే తాను దురదృష్టవంతుడినని,  తన వల్లనే తల్లి అనారోగ్యపాలైందని భావించి చిన్నప్పుడే ఇంటి నుంచి పారిపోతాడు. తను ఇష్టపడిన వాళ్లకు కీడు జరుగుతుందని భావించి, మూడు పదుల వయసు వచ్చినా.. ప్రేమ, పెళ్లి జోలికి వెళ్లడు. అదే సమయంలో అతనికి పరిచయమవుతారు కన్మణి(నయనతార), ఖతీజా(సమంత). ఇద్దరిని సమానంగా ప్రేమిస్తాడు రాంబో. ఒకరితో పగలంతా గడిపితే.. మరొకరికి రాత్రి సమయం కేటాయిస్తాడు. అయితే ఓ రోజు కన్మణి, ఖతీజాలకు నిజం తెలుస్తుంది. ఆ తర్వాత ఏం జరిగింది? ఈ ట్రయాంగిల్‌ లవ్‌ స్టోరీ పెళ్లి దాకా వెళ్లిందా? చివరకు రాంబో ఎవరిని పెళ్లి చేసుకున్నాడు. అనేదే మిగతా కథ. 

Kanmani Rambo Khatija Movie Review In Telugu

ఎలా ఉందంటే.. 
విజయ్‌ సేతుపతి లాంటి గొప్ప నటుడితో సమంత, నయనతార లాంటి స్టార్‌ హీరోయిన్స్‌ కలిసి నటిస్తున్నారంటే.. ఆ సినిమాపై కచ్చితంగా భారీ అంచనాలే ఉంటాయి. దర్శకుడు కూడా అదే స్థాయిలో మంచి కథని ఎంచుకొని సినిమాను తెరకెక్కించే ప్రయత్నం చేస్తాడు. కానీ విగ్నేశ్‌ శివన్‌ మాత్రం పేలవమైన కథతో ‘కాతు వాకుల రెండు కాదల్‌’చిత్రాన్ని తెరకెక్కించాడు. స్టోరీని పక్కకు పెట్టి.. కేవలం స్టార్‌ క్యాస్ట్‌ మీదే ఎక్కువ ఆధారపడ్డాడు. కథ, కథనాల్లో పసలేకపోవడం వల్ల ఈ సినిమా పేలవంగా సాగుతుంది.

హీరోని ఇద్దరు హీరోయిన్లు ప్రేమించడం.. అతన్ని దక్కించుకునేందుకు ఇద్దరు పోటీపడడం, వాళ్ల వల్ల హీరోకు సమస్యలు రావడం..చివరకు ఇద్దరితో హీరో కలిసి ఉండడం.. ఈ తరహా ట్రయాంగిల్‌ లవ్‌స్టోరీలు తెలుగు, తమిళ బాషలో చాలానే వచ్చాయి. ‘కణ్మనీ రాంబో ఖతీజా'లో కొత్తదనం ఏమీ లేకపోవడం.. కథనం చాలా నెమ్మదిగా సాగడంతో ఫస్టాఫ్‌ అంతో బోర్‌ కొడుతుంది. ఇంటర్వెల్‌ ముందు హీరో చెప్పే డైలాగ్‌ ఆకట్టుకుంటుంది. 

ఇక సెకండాఫ్‌లో అక్కడక్కడ కామెడీ, కొన్ని డైలాగ్స్‌ అలరించినా.. అంత ఆసక్తిగా మాత్రం కథనం సాగదు. ఎలాంటి ట్విస్టులు లేకుండా.. చాలా సింపుల్‌గా సినిమా ఉంటుంది. ప్రేక్షకులకు తెరపై స్టార్‌ క్యాస్ట్‌ తప్ప కథలో కొత్తదనం కనిపించదు. ఎమోషనల్‌ సీన్స్‌ కూడా వర్కౌట్‌ కాలేదు. రొటీన్‌ స్క్రీన్‌ప్లే. పాన్‌ ఇండియా సినిమాలు సందడి చేస్తున్న ఈ సమయంలో ఇలాంటి మూవీని ప్రేక్షకులు ఆదరించడం కాస్త కష్టమే. 

ఎవరెలా చేశారంటే..
విజయ్‌ సేతుపతి, నయనతార, సమంత తమ తమ పాత్రలకు న్యాయం చేశారు. రాంబోగా విజయ్‌ అలరించాడు. సినిమాతో అతనికి పాత్రకే సరైన జస్టిఫికేషన్‌ ఉంది. అందువల్ల ఆడియన్స్‌ ఎక్కువగా రాంబో పాత్రకు కనెక్ట్‌ అవుతారు. ఇక కన్మణిగా నయనతార తనదైన నటనతో అదగొడితే.. ఖతీజాగా సమంత తన అందంతో ఆకట్టుకుంది. టీవీ షో వ్యాఖ్యాతగా ప్రభు, ఖతీజా తొలి బాయ్‌ప్రెండ్‌ మహ్మద్‌ మోబీగా శ్రీశాంత్‌ తమ, తమ పాత్రలకు న్యాయం చేశారు.

(చదవండి: అర్థరాత్రి 12 గంటలకు.. సమంతకు విషెస్‌ చెప్పిన హీరో)

ఇక సాంకేతిక విషయానికొస్తే.. ఈ సినిమాకు ప్రధాన బలం అనిరుథ్‌ సంగీతం. సినిమాలో మ్యాటర్‌ లేకున్నా.. తనదైన నేపథ్య సంగీతంతో లాక్కొచ్చాడు. ఎస్.ఆర్.కధిర్ - విజయ్ కార్తీక్ కణ్ణన్ ఫర్వాలేదు. ఎడిటర్‌ శ్రీకర్‌ ప్రసాద్‌ తన కత్తెరకు ఇంకాస్త పనిచెప్పాల్సింది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్లుగా ఉన్నాయి. 

- అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement