
యశవంతపుర: తన ఆస్తుల నకిలీ పత్రాలతో రూ.కోట్లకు రుణ బాగోతం, హోటల్ సప్లయర్‌పై దాడి, పలువురు సినీ ప్రముఖులతో వాగ్వాదాలతో సతమతమవుతున్న నటుడు దర్శన్ మైసూరు వద్ద తన ఫాంహౌస్ నుంచి బెంగళూరుకు చేరుకున్నారు. మరోవైపు దర్శక నిర్మాత ఇంద్రజిత్ లంకేష్‌తో మాటల యుద్ధం సాగుతోంది. హోటల్‌లో దాడి ఘటనలో సత్తా ఉంటే ఆడియోను ఇంద్రజిత్ విడుదల చేయాలని దర్శన్ సవాల్ చేయగా, సత్తా నిరూపించుకునే అవసరం తనకు లేదని ఇంద్రజిత్ చెప్పారు. హోటల్లో దాడి చేయలేదని ధర్మస్థల మంజునాథస్వామిపై దర్శన్ ప్రమాణం చేయాలని ఇంద్రజిత్ సవాల్ చేశారు.
దర్శన్‌పై ప్రేమ్ అసహనం
దర్శన్ విషయంలో సినిమా పెద్దలు పెద్ద మనస్సుతో రాజీ చేసి వివాదాలకు చరమగీతం పాడాలని నటుడు జగ్గేశ్ పేర్కొన్నారు. ఇక అనవసరంగా దర్శన్ తన పేరును ప్రస్తావించడం సరికాదని దర్శకుడు ప్రేమ్ అసహనం వ్యక్తం చేశారు. దర్శన్ మా కుటుంబానికీ స్నేహితుడన్నారు. తమ గురించి ఎందుకు అలా మాట్లాడారో తెలియదన్నారు.