మలయాళ చిత్రపరిశ్రమలో మహిళలు ఎదుర్కొంటున్న లైంగిక దాడులకు సంబంధించి కేరళ ప్రభుత్వానికి జస్టిస్ హేమా కమిటీ నివేదిక సమర్పించిన విషయం తెలిసిందే. ఇప్పటివరకు సుమారు 20 మందికి పైగానే మలయాళ సినీ ప్రముఖులపై కేసులు నమోదైనట్లుగా వార్తలు వస్తున్నాయి. దేశవ్యాప్తంగా హేమా కమిటీ రిపోర్ట్‌లోని అంశాలు సంచలనం రేపాయి. దీంతో ఇతలర చిత్రపరిశ్రమలలో కూడా చలనం వచ్చింది. తాజాగా ఈ అంశం గురించి కర్ణాటక ఫిల్మ్ ఛాంబర్ ఒక మీటింగ్ ఏర్పాటు చేసింది. కన్నడ చిత్ర పరిశ్రమలోని నటీమణులు ఎలాంటి సమస్యలను ఎదుర్కుంటున్నారో తెలుసుకునేందు ఒక మీటింగ్ ఏర్పాటు చేశారు. ఇందులో కన్నడ ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడు ఎన్.ఎం.సురేశ్ పాల్గొన్నారు. ఇండస్ట్రీకి చెందని ప్రముఖులతో కర్ణాటక ఫిల్మ్ ఛాంబర్ జరిపిన ఈ మీటింగ్ పట్ల అందరిలో ఆసక్తి నెలకొంది.
ఈ సమావేశంలో పాల్గొన్న ఎన్.ఎం సురేశ్ ఇలా చెప్పుకొచ్చారు. కర్ణాటక రాష్ట్ర మహిళా కమిషన్ ఆదేశాల మేరకు ఈ మీటింగ్ ఏర్పాటు చేశామని ఆయన తెలిపారు. కన్నడ ఇండస్ట్రీలో పనిచేస్తున్న మహిళలు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారో తెలుసుకుని, వాటిని సరిచేయడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. భవిష్యత్‌లో నటీమణులకు ఎలాంటి సమస్యలు రాకుండా వారిని సంరక్షించుకోవడం కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి..? అనే టాపిక్ గురించి చర్చించామని ఆయన అన్నారు. మహిళల రక్షణ కోసం తాము ఏం చేయబోతున్నామో త్వరలో ప్రకటిస్తామని తెలిపారు.
హేమా కమిటీ నేపథ్యం
దాదాపు ఏడేళ్ల కిందట 2017లో మలయాళనటి భావనా మీనన్‌పై కొంతమంది దుండగులు కొచ్చి శివార్లలో లైంగిక దాడి చేశారు. ఈ కేసులో సూత్రధారిగా మలయాళ సూపర్‌స్టార్ దిలీప్ పేరు రావడంతో గగ్గోలు రేగింది. ఆ సమయంలో అన్ని విధాలా వచ్చిన ఒత్తిడి మేరకు కేరళ ప్రభుత్వం మలయాళ చిత్ర పరిశ్రమలో స్త్రీల పరిస్థితిని అధ్యయనం చేయడానికి జస్టిస్ హేమా కమిషన్‌ను నియమించింది. మన సీనియర్ నటీమణి శారద కూడా ఈ కమిటీలో ఒక సభ్యురాలు.
విచారణ ముగించిన కమిషన్ 2019లో ప్రభుత్వానికి నివేదిక అందించినా అనేక కారణాల వల్ల అది బయటకు రాలేదు. కొద్దిరోజుల క్రితం ‘రైట్ టు ఇన్ఫర్మేషన్’ యాక్ట్ కింద కోరిన వారికి ఆ కమిటీ రిపోర్టు ఇవ్వొచ్చని కేరళ హైకోర్టు తెలిపింది. దాంతో 295 పేజీలతో కమిటీ నివేదికను రూపొందిస్తే.. చాలా సున్నితమైన అంశాలు, వ్యక్తిగత వివరాలు ఉన్న కారణంగా 63 పేజీలను మినహాయించి మిగతా నివేదికను బహిర్గతం చేశారు. ఈ నివేదికపై పినరయి విజయన్ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందా అని మాలీవుడ్‌తో పాటు భారతీయ సినీ పరిశ్రమ ఆసక్తిగా ఎదురు చూస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment