
‘‘కె.విశ్వనాథ్‌గారి సినిమాలంటే నాకు ఇష్టం. కానీ, ఇప్పుడు అలాంటి కథలు రావడం లేదు. అయితే ‘సత్యం సుందరం’ కథ చదివినప్పుడు ఆనందంతో కన్నీళ్లు వచ్చాయి. ఇలాంటి స్క్రిప్ట్ ఎలా రాస్తారా? అనిపించింది. ఈ సినిమా తప్పకుండా కె.విశ్వనాథ్‌గారి తరహా లాంటి ఒక మంచి చిత్రం అవుతుందనిపించింది’’ అని కార్తీ అన్నారు. ‘96’ మూవీ ఫేమ్ సి.ప్రేమ్ కుమార్ దర్శకత్వంలో కార్తీ, అరవింద్ స్వామి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘సత్యం సుందరం’. 2డి ఎంటర్‌టైన్ మెంట్‌పై సూర్య, జ్యోతిక నిర్మించిన ఈ సినిమా తెలుగులో ఈ నెల 28న విడుదల కానుంది. ఏషియన్ సురేష్ ఎంటర్‌టైన్ మెంట్స్ ఎల్‌ఎల్‌పీ సంస్థ ఈ చిత్రాన్ని తెలుగులో రిలీజ్ చేస్తోంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో కార్తీ విలేకరులతో పంచుకున్న విశేషాలు...
⇒ మనలోని చాలా ప్రశ్నలకు సమాధానం ఇచ్చే కథ ‘సత్యం సుందరం’. నాకు కథ బాగా నచ్చడంతో అన్నయ్యకి(హీరో సూర్య) చె΄్పాను. ఆయనకు కూడా చాలా బాగా నచ్చింది. ఆ తర్వాత అన్నయ్య, వదిన(జ్యోతిక) నిర్మించారు. ఇలాంటి మంచి సినిమాకి పారితోషికం ఎక్కువ అడగొద్దు అంటూ నా మార్కెట్ కంటే కొంచెం తగ్గించి ఇచ్చారు(నవ్వుతూ). నా తొలి చిత్రం ‘పరుత్తి వీరన్’ సినిమా చూసి ఆ΄్యాయంగా హత్తుకున్న అన్నయ్య మళ్లీ ఇన్నేళ్లకు ‘సత్యం సుందరం’ లో చాలా బాగా నటించానంటూ గర్వంగా హత్తుకున్నారు.
⇒ బ్రదర్స్ లాంటి రెండు క్యారెక్టర్స్ మధ్య నడిచే కథ ఇది.‘సాగర సంగమం’ సినిమా చూసినప్పుడు ఎలాంటి అద్భుతమైన అనుభూతి కలిగిందో ‘సత్యం సుందరం’ చూస్తున్నప్పుడు కూడా అలాంటి ఓ మంచి అనుభూతిని ప్రేక్షకులు ఆస్వాదిస్తారు. అయితే కె.విశ్వనాథ్‌గారి సినిమాలు కమర్షియల్ బ్లాక్ బస్టర్సే. మా సినిమా కూడా అలాంటిదే. ఈ చిత్రం చూశాక అందరికీ తమ బాల్యం గుర్తొస్తుంది.
⇒ చిన్న పల్లెటూరిలో చీరల దుకాణం నడిపే అమాయకమైన వ్యక్తిత్వం ఉండే పాత్ర నాది. ఈ మూవీలో అరవింద్ స్వామిగారు కాకుండా ఆయన పాత్రలో మరొకర్ని ఊహించలేం. ‘ఊపిరి’ సినిమాలో ఉన్నట్లు సంతోషకరమైన భావోద్వేగాలున్న కథ ఇది. మా సినిమా తమిళంలో ఈ నెల 27న విడుదలవుతోంది.అయితే అదేరోజు తెలుగులో ‘దేవర’ లాంటి పెద్ద సినిమా ఉంది. అందుకే మా సినిమాని 28న రిలీజ్ చేస్తున్నాం. ‘దేవర’ ఒక యుద్ధంలా ఉంటుంది. మాది ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ లాంటి సినిమా(నవ్వుతూ).
⇒ ‘సత్యం సుందరం’ కి గోవింద్ వసంత్ పాటలు, నేపథ్య సంగీతం బాగుంటాయి. సునీల్, సురేశ్ బాబుగార్లు మా సినిమా రిలీజ్ చేయడం హ్యాపీ. ‘ఊపిరి’ తర్వాత తెలుగులో నేరుగా సినిమా చేయలేదు. కథలు వింటున్నాను. తప్పకుండా చేస్తాను. ప్రస్తుతం ‘సర్దార్ 2’ షూటింగ్ జరుగుతోంది. అలాగే ‘వా వాతియారే’ సినిమా ఉంది. ‘ఖైదీ 2’ సినిమా 2025లో ప్రేక్షకుల ముందుకు వస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment