
రామ్ పోతినేని హీరోగా తెరకెక్కుతున్న చిత్రం 'డబుల్ ఇస్మార్ట్'. పూరి జగన్నాథ్ దర్శకత్వం వహిస్తూ.. ఛార్మితో కలిసి పూరి కనెక్ట్స్ పతాకంపై ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఆగష్టు 15న విడుదల కానున్న ఈ చిత్రం నుంచి తాజాగా ఒక పాటను విడుదల చేశారు. 'మార్ ముంత... చోడ్ చింత' అనే పాట ఇప్పుడు వివాదంలో చిక్కుకుంది. అందులో తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వాయిస్‌ను ఉపయోగించడంతో అభ్యంతరాలు వెల్లువెత్తుతున్నాయి. పూరి జగనన్నాథ్‌పై తెలంగాణ వాదులతో పాటు కేసీఆర్ అభిమానులు మండిపడుతున్నారు.
'డబుల్ ఇస్మార్ట్' సినిమాలోని 'మార్ ముంత చోడ్ చింత..' అనే 'కల్లు కంపౌండ్' పాటలో హీరో, హీరోయిన్ కల్లు బాటిళ్లు పట్టుకొని చిందేస్తుంటారు. పాట మధ్యలో కేసీఆర్ పాపులర్ ఊతపదం 'ఏం జేద్దామంటవ్ మరీ..' పదాల్ని యథాతథంగా ఆయన వాయిస్‌నే ఉపయోగించారు. అది కూడా పాటలో రెండుసార్లు వినిపిస్తుంది. దీంతో కేసీఆర్ అభిమానులు భగ్గుమంటున్నారు. కేసీఆర్ అంటే తాగుడు.. తెలంగాణ అంటే తాగుడు అనే భావన వచ్చేలా పాట మధ్యలో ఆయన టోన్ ఉపయోగించారంటూ ఫైర్ అవుతున్నారు. తెలంగాణ కల్చర్‌ను తాగుడు సంస్కృతిగా ప్రొజెక్ట్ చేసేలా సాంగ్ ఉందంటూ కేసీఆర్ అభిమానులు తెలుపుతున్నారు. ఈ పాటలో కేసీఆర్ హుక్ లైన్ ఉపయోగించడం వెనుక ఉన్న ఉద్దేశం ఏమిటంటూ వారు మండిపడుతున్నారు.

ఓ దర్శకుడిగా తన అభిరుచితో పాటను తెరకెక్కించడంలో అభ్యంతరం లేదు. కానీ, కల్లు పంపౌండ్ పాటలో ఒక రాష్ట్రానికి పదేళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి టోన్‌ను ఉపయోగించడమంటే ఆయన్ను అవమానించడమేనని కేసీఆర్ అభిమానులు అంటున్నారు. పాట విడుదలైన కొన్ని గంటల్లోనే సోషల్ మీడియా వేదికగా తెలంగాణవాదులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ పూరీపై మండిపడుతున్నారు.
ఈ పాట రచయిత కాసర్ల శ్యామ్‌తో పాటు రాహుల్ సిప్లిగంజ్‌ల పైనా సోషల్‌మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇద్దరూ తెలంగాణ ప్రాంతం వారై ఉండి అలాంటి కేసీఆర్ హుక్‌లైన్‌ను ఎందుకు రాయాల్సి వచ్చిందని ప్రశ్నిస్తున్నారు. సొంత ప్రాంతాన్ని ఇలా కించపరచడం ఏంటి అంటూ.. పలువురు తెలంగాణ వాదులు కూడా తమ అభిప్రాయాన్ని నెట్టింట తెలుపుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment