ఇండస్ట్రీలో తీవ్ర విషాదం.. నదిలో డైరెక్టర్‌ ఆచూకీ లభ్యం! | Kollywood Director Vetri Duraisamy Body Found At Sutlej River- Sakshi
Sakshi News home page

Vetri Duraisamy: ఇండస్ట్రీలో తీవ్ర విషాదం.. డైరెక్టర్‌ మృతదేహం లభ్యం!

Feb 13 2024 6:43 PM | Updated on Feb 13 2024 6:58 PM

Kollywood Director Vetri Duraisamy body Found At Sutlej river on Monday - Sakshi

కోలీవుడ్‌లో తీవ్ర విషాదం నెలకొంది. ఇటీవల హిమాచల్ ప్రదేశ్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో గల్లంతైన డైరెక్టర్‌ వెట్రి దురైస్వామి(45) మృతదేహం లభించింది. ఈ ప్రమాదంలో కారు డ్రైవర్‌ అక్కడికక్కడే మృతి చెందగా, మరొకరు తీవ్రగాయాలతో బయట పడిన సంగతి తెలిసిందే. తిరుప్పూర్‌కి చెందిన స్నేహితుడు గోపీనాథ్‌తో కలిసి కొద్దిరోజుల కిందట హిమాచల్‌ప్రదేశ్‌ సందర్శనకు వెళ్లిన ఆయన ప్రమాదం తర్వాత అదృశ్యమయ్యారు. గత 9 రోజులుగా కనిపించకుండాపోయిన వెట్రి దురైస్వామి మృతదేహాన్ని సోమవారం గుర్తించారు. ఈ విషాద వార్త తెలుసుకున్న కోలీవుడ్ ప్రముఖులు సంతాపం ప్రకటించారు.

అసలే జరిగిందంటే... 
 
చెన్నై మాజీ మేయర్‌, మనిదనేయ మక్కల్‌ ఫౌండేషన్‌ వ్యవస్థాపకుడు సైదై దురైస్వామి కుమారుడు వెట్రి దురైస్వామి తిరుప్పూర్‌కి చెందిన స్నేహితుడు గోపీనాథ్‌తో కలిసి ఇటీవలే హిమాచల్‌ప్రదేశ్‌ పర్యటనకు వెళ్లారు. ఫిబ్రవరి 4వ తేదీ సాయంత్రం కసాంగ్‌ నలా ప్రాంతంలో జాతీయహైవేపై వెళ్తుండగా వారు ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి సట్లెజ్‌ నదిలో పడిపోయింది. వాళ్లు కాజా ప్రాంతం నుంచి సిమ్లా వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో కారు డ్రైవరు అక్కడిక్కడే మృతి చెందాడు. గోపీనాథ్‌ తీవ్రగాయాలతో బయటపడ్డారు.

కానీ ఘటనాస్థలిలో డైరెక్టర్‌ వెట్రి దురైస్వామి ఆచూకీ మాత్రం లభించలేదు. దీంతో తొమ్మిది రోజులుగా ఆయన కోసం గాలింపు చేపట్టారు. హిమాచల్‌ప్రదేశ్‌ పోలీసులు, ఎన్‌డీఆర్‌ఎఫ్‌, స్కూబా డైవర్ల బృందం తీవ్రంగా  గాలించారు. ఈ నేపథ్యంలో ప్రమాద స్థలానికి 6 కిలోమీటర్ల దూరంలో స్కూబా డైవర్లు వెట్రి దురైస్వామి మృతదేహాన్ని గుర్తించారు. 

హిమాచల్ ప్రదేశ్‌లోని కిన్నౌర్ జిల్లాలోని సట్లెజ్ నదిలో డైరెక్టర్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం మృతదేహాన్ని చెన్నైకి తరలించారు. కాగా.. వెట్రి దురైస్వామికి సంబంధించిన సమాచారం ఇస్తే రూ.కోటి రివార్డు అందిస్తామని సైదై దురైస్వామి ప్రకటించిన విషయం తెలిసిందే. కానీ ఆయన చనిపోయాడన్న వార్త తెలియడంతో సినీ, రాజకీయ ప్రముఖులు నివాళులర్పిస్తున్నారు. స్టార్ హీరోలు అజిత్, కమల్ హాసన్, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి కే పళనిస్వామి, మాజీ సీఎం పన్నీర్ సెల్వం సంతాపం తెలిపారు.

కాగా.. వెట్రి దురైస్వామి కోలీవుడ్‌లో పలు చిత్రాలకు దర్శకత్వం వహించారు. రమ్య నంబీషన్, విధార్థ్ జంటగా నటించిన 'ఎంద్రావతు ఒరు నాల్ (2021) అనే చిత్రాన్ని తెరకెక్కించారు.  ప్రస్తుతం ఆయన ఓ  క్రైమ్‌ థ్రిల్లర్‌ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement