టైటిల్: మహావీరుడు
నటీనటులు: శివకార్తికేయన్, అదితి శంకర్, మిస్కిన్, సరిత, సునీల్, యోగిబాబు
నిర్మాత:అరుణ్ విశ్వ
దర్శకత్వం:మడోన్ అశ్విన్
సంగీతం: భరత్ శంకర్
సినిమాటోగ్రఫీ: విషు అయ్యన్న
విడుదల తేది: జులై 14, 2023
మహావీరుడు కథేంటంటే..
సత్య(శివకార్తికేయన్) ఓ కార్టూనిస్ట్. మహావీరుడు పేరుతో కామిక్ కథలు రాస్తుంటాడు. నిజ జీవితంలో భయస్తుడు. కానీ తన కథలు మాత్రం సమాజం కోసం పోరాడే ఓ మహావీరుడి గురించే ఉంటాయి. తను ఉండే స్లమ్ ఏరియా నుంచి అందరిని వేరే ప్రాంతానికి తరలిస్తుంది ప్రభుత్వం. ఆ ఏరియా ప్రజలందరికి ఓ అపార్ట్‌మెంట్‌కి తరలిస్తారు. మంత్రి ఎమ్ ఎమ్ సూర్య(మిస్కిన్) మనుషులు నాసిరకం సిమెంట్‌తో ఆ అపార్ట్‌మెంట్‌ని నిర్మిస్తారు.
పైకి అందంగా, అద్భుతంగా కనిపించినప్పటికీ.. ఇంట్లోకి వెళ్లిన తొలిరోజు నుంచి కిటికీలు పడిపోవడం, గోడలకు పగుళ్లు రావడం జరుగుతుంటాయి. ఇదేంటని ప్రశ్నిస్తే మంత్రి మనుషులు బెదిరిస్తారు. తన తల్లిని, సోదరిని అవమానించినా..సత్య ఎదురు తిరగడు. అయితే ఓ సందర్భంలో చనిపోవాలని అపార్ట్‌మెంట్ పైకి దూకేందుకు ప్రయత్నిస్తాడు సత్య. దెబ్బలు తగిలినా ప్రాణాలతో భయటపడతాడు.
(చదవండి: ‘బేబీ’ మూవీ రివ్యూ)
అప్పటి నుంచి అతనికి మాత్రమే ఓ అజ్ఞాత వ్యక్తి వాయిస్ వినిస్తుంది(హీరో రవితేజ వాయిస్ ఓవర్ ఇచ్చాడు). అతను సత్యని ఓ మహావీరుడిగా, మంత్రి సూర్యని యముడిగా వర్ణిస్తుంటాడు. అంతేకాదు మంత్రి నాసిరకంగా కట్టించిన ప్రజా భవనం కూలిపోతుందనే విషయాన్ని ఆ గొంతు అతనికి తెలియజేస్తుంది. అప్పుడు సత్య ఏం చేశాడు? ఆ అజ్ఞాత గొంతు కారణంగా సత్య జీవితంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి? అతని ప్రయాణంలో జర్నలిస్ట్ చంద్ర(అదితి శంకర్) పాత్ర ఏంటి? చివరకు మంత్రిని ఎదురించి ప్రజల ప్రాణాలకు ఎలా కాపాడాడు? అనేదే ‘మహావీరుడు’ కథ.
ఎలా ఉందంటే..
ఓ రాజకీయ నాయకుడు ప్రజలను మోసం చేయడం.. హీరో వారికి అండగా నిలిచి, ఆ రాజకీయ నాయకుడి అవినీతిని భయటపెట్టడం, ప్రాణాలకు తెగించి ప్రజలను కాపాడడం.. ఇలాంటి కాన్సెప్ట్‌తో తెలుగులో చాలా సినిమాలు వచ్చాయి. మహావీరుడు కథ కూడా ఇదే. కానీ ఇక్కడ హీరో భయస్తుడు. ఓ పిరికివాడు ప్రజల కోసం ఎలా ధైర్యవంతుడిగా మారడనేదే ఈ మూవీ కథ.
అయితే ఇదంతా సీరియస్ కాకుండా.. సెటిల్డ్ కామెడీతో ఎంటర్‌టైన్‌గా సాగుతుంది. రవితేజ వాయిస్ ఓవర్ సినిమాకు చాలా ప్లస్ అయింది. అలాగే యోగిబాబు కామెడీ కూడా బాగా వర్కౌట్ అయింది. హీరో క్యారెక్టర్, వాయిస్ ఓవర్.. కొన్ని చోట్ల మర్యాద రామన్న సినిమాను గుర్తు చేస్తుంది. అలాగే హీరో భయస్తుడు అని చెప్పించడానికి వచ్చే కొన్ని సన్నివేశాలు సాగదీతగా అనిపిస్తాయి.
సినిమా ప్రారంభంలోనే హీరో క్యారెక్టర్ ఎలా ఉండబోతుందో చూపించాడు. హీరోకి అజ్ఞాత గొంతు వినిపించేంత వరకు కథంతా సోసోగా సాగుతుంది. ఆ తర్వాత సినిమా మొత్తం కామెడీ ట్రాక్ ఎక్కుతుంది. ఇంటర్వెల్ ట్విస్ట్ ఆసక్తికరంగా ఉంటుంది. అయితే సెకండాఫ్ మాత్రం కథ సాగదీతగా అనిపిస్తుంది. హీరో విలన్ దగ్గరకి వెళ్లి లొంగిపోయిన తర్వాత వచ్చే సన్నివేశాలు బోర్ కొట్టిస్తాయి.
అలాగే హీరో హీరోయిన్ల లవ్ ట్రాక్ కూడా అంతగా ఆకట్టుకోలేవు. సినిమా నిడివి కూడా ప్రేక్షకులకు ఇబ్బంది కలిగిస్తుంది. సింపుల్‌గా చెప్పాల్సిన విషయాలను కూడా డీటైల్డ్‌గా చూపించి నిడివి పెంచేశారు. అలాగే నాసిరకంగా కట్టించిన బిల్డింగుల కారణంగా ప్రజలు పడే ఇబ్బందులను కూడా బలంగా చూపించలేకపోయారు. వాటిని మరింత ఎమోషనల్‌గా తీర్చిదిద్దింటే బాగుండేది. ఫస్టాఫ్ మాదిరే సెకండాఫ్ కామెడీ కూడా వర్కౌట్ అయితే సినిమా ఫలితం మరోలా ఉండేది. ఎలాంటి అంచనాలు పెట్టుకోకుండా వెళితే ఈ మహావీరుడు కాస్త నవ్విస్తాడు.
ఎవరెలా చేశారంటే..
మధ్యతరగతి కుటుంబానికి చెందిన సత్య పాత్రలో శివకార్తికేయన్ ఒదిగిపోయాడు. ఇలాంటి పాత్రలు చేయడం అతనికి కొత్తేమి కాదు. భయస్తుడిగా ఆయన చేసే కామెడీ నవ్వులు పూయిస్తుంది. జర్నలిస్ట్ చంద్రగా అదితి శంకర్ తన పాత్ర పరిధిమేర చక్కగా నటించింది. ఈ చిత్రంలో ఆమె నిడివి చాలా తక్కువనే చెప్పాలి. భవన కార్మికుడిగా యోగిబాబు చేసే కామెడీ సినిమాకు చాలా ప్లస్ అయింది. మంత్రిగా మిస్కిన్ , అతని సహాయకుడిగా సునీల్‌తో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. ఇక సాంకేతిక విషయాలకొస్తే.. భరత్ శంకర్ సంగీతం జస్ట్ ఓకే. పాటలకు తెలుగు ప్రేక్షకులను నచ్చవు. నేపథ్య సంగీతం పర్వాలేదు. సినిమాటోగ్రాఫర్ పనితీరు బాగుంది. ఎడిటర్ తన కత్తెరకు ఇంకాస్త పని చెప్పాల్సింది. ముఖ్యంగా సెకండాఫ్‌లో కొన్ని సన్నివేశాలను మరింత క్రిస్పీగా కట్ చేయాల్సింది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లుగా ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment