టైటిల్: 'మార్కో'
నటీనటులు: ఉన్ని ముకుందన్, యుక్తి తరేజా, కబీర్ దుహన్ సింగ్
నిర్మాణ సంస్థ: క్యూబ్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్
నిర్మాత: షరీఫ్ ముహమ్మద్
రచన-దర్శకత్వం: హనీఫ్ అదేని
సంగీతం: రవి బస్రూర్
సినిమాటోగ్రఫీ: చంద్రు సెల్వరాజ్
ఎడిటర్: షమీర్ మహమ్మద్
విడుదల తేది: జనవరి 1, 2025
‘మార్కో’.. ఈ ఏడాది చివరిలో(డిసెంబర్ 20) వచ్చిన ఈ మలయాళ చిత్రం అక్కడ బాక్సాఫీస్‌ని షేక్ చేసింది. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి రూ.100 కోట్లకు పైగా వసూళ్లని సాధించింది. మోస్ట్ వయలెంట్ చిత్రంగా పేరు తెచ్చుకున్న ఈ చిత్రం ఇప్పుడు తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అయింది. న్యూ ఇయర్ సందర్భంగా నేడు(జనవరి 1) ఈ చిత్రం తెలుగులో రిలీజ్ అయింది. కేరళ ఆడియన్స్‌ను ఆకట్టుకున్న ‘మార్కో’ తెలుగు వాళ్లను మెప్పించాడా? రివ్యూలో చూద్దాం.
కథేంటంటే..
జార్జ్ (సిద్దిఖ్ఖీ) గోల్డ్ బిజినెస్ చేస్తుంటాడు. ఈ వ్యాపారంలో తనకు మించినవాళ్లు ఉండరు. సిండికేట్ ఏర్పాటు చేసి.. దాని లీడర్‌గా వ్యవహరిస్తుంటారు. అతని తమ్ముడు విక్టర్(ఇషాన్ షౌకాత్) అంధుడు. కానీ చాలా టాలెంటెడ్. విక్టర్ స్నేహితుడు వసీమ్‌ను ఓ ముఠా చంపేస్తుంది. దానికి సాక్షి ఉన్నాడని విక్టర్‌ను కూడా ఆ ముఠా దారుణంగా హత్య చేస్తుంది.
విదేశాలకు వెళ్లిన జార్జ్ మరో తమ్ముడు(జార్జ్ వాళ్ల నాన్న పెంచిన వ్యక్తి) మార్కో(ఉన్ని ముకుందన్)కు ఈ హత్య విషయం తెలిసి వెంటనే వచ్చేస్తాడు. తను ప్రాణంగా ఇష్టపడే సోదరుడు విక్టర్ హత్యకు కారణమైనవారిని వదిలిపెట్టనని చర్చిలోనే ప్రమాణం చేస్తాడు. అసలు విక్టర్‌ని హత్య చేసిందెవరు? ఎందుకు చేశారు? చివరకు మార్క్ వారిని ఎలా మట్టుపెట్టాడు?అనేదే మిగతా కథ.
ఎలా ఉందంటే..?
ఈ మధ్యకాలంలో యాక్షన్ సినిమాల్లో హింస మితిమీరిపోతుంది. అవసరానికి మించి వయొలెన్స్‌ని చూపిస్తున్నారు. ఆ మధ్య వచ్చిన ‘యానిమల్’, ఇటీవల వచ్చిన ‘కిల్’ సినిమాలో యాక్షన్ ఎపిసోడ్స్ దారుణంగా ఉన్నాయి. వాటిని యాక్షన్ ప్రియులు ఎంజాయ్ చేసినా.. ఫ్యామిలీ ఆడియన్స్ మాత్రం చూడలేకపోయారు. కానీ యాక్షన్ ప్రియులే భయపడిపోయి.. ‘ఈ హింసను చూడలేకపోతున్నాం.. ఆపండ్రాబాబూ..’ అనుకునే సినిమా ‘మార్కో’. సెన్సార్ బోర్డ్ ఎలా ఓకే చేసిందో తెలియదు కానీ..కొన్ని సన్నివేశాలు తెరపై చూస్తుంటే ఒళ్లు జలదరిస్తుంది. అవసరానికి మించిన హింస.. జుగుప్సాకరమైన సన్నివేశాలతో ఈ సినిమా కథనం సాగుతుంది.
వాస్తవానికి ఇదొక రోటీన్ రివైంజ్ డ్రామా చిత్రం. తన సోదరుడిని చంపినవాళ్లపై హీరో ఎలా పగతీర్చుకున్నాడనేది ఈ సినిమా కథ. ఇలాంటి కథలు తెలుగులోనూ చాలా వచ్చాయి. కానీ రివైంజ్ డ్రామాని ఫుల్ యాక్షన్ డ్రామాగా మలచడమే ‘మార్కో’ స్పెషల్.
సినిమా ప్రారంభంలోనే హంతకులు ఎవరనేది ఆడియన్స్‌కు తెలిసిపోతుంది. కానీ హీరో వారిని కనిపెట్టి ఎలా ప్రతీకారం తీర్చుకున్నాడు అనేది ఆసక్తికరం. ప్రతి యాక్షన్ సీన్‌లోనూ రక్తం ఏరులైపారుతుంది. ఇంటర్వెల్ సీన్‌లో వయొలెన్స్ మరీ ఎక్కువైపోతుంది. ఇక సెకండాఫ్‌లో వచ్చే యాక్షన్ సీన్స్ చూస్తే యాక్షన్ ప్రియులే తట్టుకోలేరు.
తలలు ఎగిరిపడడం.. కాళ్లు, చేతులు తెగిపడడం.. పొట్టలోని పేగులు బయటకు రావడం.. ఒకెత్తు అయితే.. యాసిడ్‌తో చంపడం.. గర్భిణీ స్త్రీ నోట్ల ఆయుధం దింపడం.. చిన్న పిల్లాడిని గ్యాస్ సిలిండెర్‌తో మోది చంపడం.. గుండెకాయను కోసి బయటకు తీయడం.. మరో ఎత్తు. ఆ సన్నివేశాలను తెరపై చూడాలంటే గుండె రాయి చేసుకోవాల్సిందే. ఒకనొక దశలో ఇంత వయొలెన్స్ అవసరమా? అనిపిస్తుంది. కథ మొత్తం ప్యామిలీ చుట్టే తిరిగినా.. ఫ్యామిలీ ఆడియన్స్ చూడలేని సన్నివేశాలు ఈ చిత్రంలో ఉంటాయి. చిన్న పిల్లలు, గుండెజబ్బు ఉన్నవారు ఈ సినిమాకు దూరంగా ఉంటే బెటర్. తెరపై హింసను ఆస్వాదించేవాళ్లు.. యాక్షన్ సినిమాలు ఇష్టపడేవాళ్లకు మాత్రం ‘మార్కో’ నచ్చుతుంది.
ఎవరెలా చేశారంటే..
ఉన్ని ముకుందన్ కేరళ నటుడైనా తెలుగు ఆడియన్స్‌కి సుపరిచితుడే. ‘యశోద’, ‘జనతా గ్యారేజ్’ సినిమాల్లో కీలక పాత్రలు పోషించాడు. మాలీవుడ్‌లో అతనికి మాస్ హీరో అనే ఇమేజ్ ఉంది. ఆ ఇమేజ్‌ని పెంచే చిత్రం ‘మార్కో’. టైటిల్ పాత్రలో ఆయన ఒదిగిపోయాడు. యాక్షన్ సీన్స్ అదరగొట్టేశాడు. మార్కో పాత్ర కోసం ఆయన శరీరాకృతిని మార్చుకున్నాడు. ఆ పాత్రకు ఇచ్చిన ఎలివేషన్ తగ్గట్లుగా ఉన్ని తనదైన నటనతో ఆకట్టుకున్నాడు.
ఇక సిద్ధిఖీ, కబీర్ దుహాస్ సింగ్‌ల పాత్రకు కూడా బాగా పేలాయి. వారి పాత్రల పరిచయం..యాక్షన్ సీన్స్ అదిరిపోతాయి. దర్శకుడు హనీఫ్ అదేని తన రాసుకున్న పాత్రలకు తగ్గట్లుగా క్యాస్టింగ్‌ను ఎంచుకున్నాడు. ప్రతి ఒక్కరు తమ తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు.
సాంకేతికంగా సినిమా అదిరిపోయింది. రవి బస్రూర్ నేపథ్య సంగీతం సినిమాకి ప్రధాన బలం. తనదైన బీజీఎంతో మూవీ స్థాయిని పెంచేశాడు. హీరోతో పాటు విలన్ పాత్రలకు సంబంధించిన ఎలివేషన్ సీన్లకు ఆయన అందించిన బీజీఎం నెక్ట్స్ లెవన్. పాటలు గుర్తుండవు. యాక్షన్ కొరియోగ్రాఫర్ల పనితీరు అద్భుతం. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు బాగున్నాయి.
- అంజి శెట్టె, సాక్షి వెబ్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment