ఓటీటీలో ‘ఇది చూడొచ్చు’ అనే ప్రాజెక్ట్స్ చాలా ఉంటాయి. ప్రస్తుతం స్ట్రీమ్ అవుతున్న వాటిలో మలయాళ చిత్రం ‘నూనక్కూళి’ ఒకటి. ఈ చిత్రం గురించి తెలుసుకుందాం.
సమస్య అన్నది ఎవ్వరికైనా, ఎప్పుడైనా రావచ్చు. కానీ దానిని ఎలా పరిష్కరించుకుంటామన్నది మాత్రం మన మీదే ఆధారపడి ఉంటుంది. గుండు సూదంత ప్రశ్నకు గుండ్రాయంత సమాధానం అనుకుంటే అంతా గందరగోళమే. ఇదే నేపథ్యంలో వచ్చిన మలయాళ సినిమా ‘నూనక్కూళి’. ఇది తెలుగులో డబ్ అయింది. ప్రముఖ దర్శకులు జీతూ జోసెఫ్ తీసిన ఈ సినిమా జీ5 ఓటీటీ వేదికగా ఆద్యంతం ఆకట్టుకుంటోంది.
(చదవండి: ఈ వీకెండ్ ఏకంగా 24 మూవీస్.. అవి ఏంటంటే?)
ఇక ఈ చిత్రం కథాంశానికొస్తే... ఓ పెద్ద వ్యాపార సంస్థకు ఎండీ అయిన పూళికున్నేల్ తన భార్యతో ఆంతరంగికంగా కలిసున్న వీడియోను తన లాప్‌టాప్‌లో దాచుకుంటాడు. ఇంతలో పూళికున్నేల్ సంస్థ పై ఐటీ రైడ్ జరిగి, ఇతని లాప్‌టాప్‌ను కూడా స్వాధీనపరుచుకుంటారు ఐటీ ప్రతినిధులు. కంపెనీ లావాదేవీల కన్నా ఇప్పుడు పూళికున్నేల్ దృష్టి తన వీడియో ఇతరుల దృష్టిలో పడకుండా చూడాలని ఆ ఐటీ ప్రతినిధి ఇంటికి తన లాప్‌టాప్ కోసం దొంగతనానికి వెళతాడు.
ఆ సమయంలో వేరే ఒకావిడ తాను ఆత్మహత్య కోసం తయారు చేసుకున్న విషాన్ని పూళికున్నేల్ పొరపాటున తాగేస్తాడు. అది కాస్త పోలీస్ కేసు అవుతుంది. చివరాఖరికి పూళికున్నేల్ తన లాప్‌టాప్ దక్కించుకున్నాడా? ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ఆమెకు, ఐటి ప్రతినిధికి, హీరో పూళికున్నేల్‌కు ఉన్న సంబంధం ఏంటి? అన్నది మాత్రం ఓటీటీలోనే చూడాలి.
పూళికున్నేల్ పాత్రలో బసిల్ జోసెఫ్ అలాగే మరో ప్రధాన పాత్రలో గ్రేస్ ఆంటోని అద్భుతంగా నటించారు. సినిమా ఆద్యంతం కితకితలు పెట్టిస్తూనే ఉంటుంది. సున్నిత సమస్యకు ఆ సరదా పరిష్కారం ఏంటో ‘నూనక్కూళి’ సినిమాలో ఈ వారం చూసేయండి.
– ఇంటూరు హరికృష్ణ
Comments
Please login to add a commentAdd a comment