
Manchu Vishnu Talks In Press Meet Over MAA Bylaws: చాలా విషయాల్లో బైలాస్ మార్చాలని అనుకుంటున్నట్లు తాజా ‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణు అన్నారు. ఎవరు పడితే వాళ్లు ‘మా’ సభ్యత్వం తీసుకోకుండా చర్యలు తీసుకుంటానని ఆయన పేర్కొన్నారు. ‘మా’ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం తన ప్యానల్ సభ్యులతో కలిసి మంచు విష్ణు సోమవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సంగతి తెలిసిందే. అనంతరం శ్రీవిద్యానికేతన్‌లో విష్ణు తన ప్యానల్‌తో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చాలా విషయాల్లో అసోసియేషన్‌లోని బైలాస్‌ను మార్చాలనుకుంటున్నానన్నారు.
చదవండి: ఆవేశం తగ్గించుకోండి, మరో రెండేళ్లు కూడా విష్ణునే అధ్యక్షుడు: బాబూ మోహన్
బైలాస్ మార్చడమంటే అంత ఈజీ కాదని, దీనిపై సినీ పెద్దలతో చర్చించాకే నిర్ణయం తీసుకుంటానన్నారు. ఎవరంటే వాళ్లు ‘మా’ సభ్యులు కాకూడదనేదని తాను భావిస్తున్నానని మంచు విష్ణు పేర్కొన్నారు. ప్రకాశ్ రాజ్, తన సమక్షంలోనే ఎన్నికల అధికారి పోస్టల్ బ్యాలెట్లు ఓపెన్ చేయించారని, అందులో మూడో వ్యక్తి ప్రవేశించలేదన్నారు. ఆ రోజు రాత్రి లేట్ అవ్వడంతో మరునాడు కౌంటింగ్ కొనసాగించారని తెలిపారు. అక్కడ ఎలాంటి గొడవ జరగలేదన్నారు. సీసీ టీవీ ఫుటేజ్ అడగడం ‘మా’ సభ్యుల హక్కని విష్ణు చెప్పారు. ప్రకాశ్‌రాజ్, నాగబాబు ‘మా’ సభ్యత్వానికి రాజీనామా చేశారని, అయితే వారి రాజీనామాను ఆమోదించలేదన్నారు. త్వరలోనే దీనిపై ప్రకాశ్ రాజ్‌కు మెయిల్ ద్వారా సమాచారం అందిస్తానని మంచు విష్ణు తెలిపారు.