నవీన్, నాని, పవన్ కల్యాణ్, నజ్రియా, వివేక్ ఆత్రేయ, రవిశంకర్
‘‘తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఏ ఒక్కరి సొత్తు కాదు.. ఒక కుటుంబానిది కాదు.. ఇది మనందరిది. మా సినిమా బాగుండాలని ఎక్కువగా కోరుకుంటాం.. అది సహజం. అంతేకానీ ఎదుటివారి సినిమా బాగుండకూడదని కోరుకోం. ఇండస్ట్రీలో రాజకీయపరంగా విభిన్నమైన ఆలోచనలు ఉండొచ్చు.. అయినప్పటికీ సినిమా వేరు.. రాజకీయం వేరు. ఆ స్పష్టత నాకుంది’’ అని హీరో పవన్ కల్యాణ్ అన్నారు.
నాని, నజ్రియా నజీమ్ జంటగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘అంటే.. సుందరానికీ’. నవీన్ యెర్నేని, రవిశంకర్ వై. నిర్మించిన ఈ చిత్రం నేడు విడుదలవుతోంది. ఈ సందర్భంగా గురువారం జరిగిన ప్రీ రిలీజ్ వేడుకలో ముఖ్య అతిథి పవన్ కల్యాణ్ మాట్లాడుతూ– ‘‘నాని విలక్షణమైన నటుడు.. తన నటనే కాదు.. వ్యక్తిత్వం అంటే నాకు ఇష్టం.. గౌరవం. తనకు మరిన్ని హిట్ సినిమాలు ఇవ్వాలని దేవుణ్ణి కోరుకుంటున్నాను. వివేక్ ఆత్రేయ ఈ సినిమాని అద్భుతంగా తీసి ఉంటాడని నమ్ముతున్నాను.
భవిష్యత్‌లో నవీన్ యెర్నేని, రవిశంకర్‌గార్ల నిర్మాణంలో హరీష్ శంకర్ దర్శకత్వంలో నేను హీరోగా ‘భవదీయుడు భగత్‌సింగ్’ సినిమా చేయబోతున్నాం’’ అన్నారు. నాని మాట్లాడుతూ– ‘‘నేను ఇండస్ట్రీకి వచ్చిన 14 ఏళ్లలో అందరి హీరోలను కలిశాను. కానీ పవన్ కల్యాణ్‌గారిని కలిసే సందర్భం రాలేదు. ఇప్పుడు కలిశాక చిన్నప్పటి నుంచి కలిసి ఉన్న ఫీలింగ్ కలుగుతోంది. ఈ సినిమా చేసినందుకు గర్వపడుతున్నాను.
‘అంటే.. సుందరానికీ’ నాట్ ఎంటర్‌టైన్‌మెంట్.. ఇట్స్ ఎంజాయ్‌మెంట్’’ అన్నారు. నవీన్ యెర్నేని మాట్లాడుతూ– ‘‘అంటే.. సుందరానికీ’ సినిమా బ్లాక్ బస్టర్ అవుతుందనే నమ్మకం ఉంది. కుటుంబమంతా ఎంజాయ్ చేసే చిత్రమిది’’ అన్నారు. సుకుమార్ మాట్లాడుతూ– ‘‘అంటే.. సుందరానికీ’ ప్రివ్యూ చూశా. ఫస్టాఫ్ చూసి ‘పర్లేదమ్మా.. బాగుంది’ అని వివేక్ ఆత్రేయకి చెప్పా. సెకండాఫ్ చూశాక నా అహం పోయింది.. మనస్ఫూర్తిగా ఆత్రేయని హత్తుకుని మంచి సినిమా తీశావని అభినందించాను’’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment