తొలిరోజు రూ. 294 కోట్ల వసూళ్లు సాధించిన ‘పుష్ప 2’
బాలీవుడ్‌లో రూ. 72 కోట్లతో తొలి స్థానం
నైజాంలో రూ. 30 కోట్లతో ఫస్ట్ ప్లేస్
‘‘ఆ బిడ్డ మీద ఒక్క చిన్న గీత పడాలా... గంగమ్మ తల్లి జాతరలో యాటను నరికినట్లు రప్పా రప్పా నరుకుతా.. ఒక్కొక్కడిని రప్పా రప్పా రప్పా...’’ అంటూ విలన్లకి వార్నింగ్ ఇస్తాడు పుష్పరాజ్. ‘పుష్ప 2: ది రూల్’ చిత్రంలో హీరో అల్లు అర్జున్ చెప్పిన బోలెడన్ని పవర్‌ఫుల్ డైలాగ్స్‌లో ఇదొకటి. ఇక ఇక్కడ పేర్కొన్న డైలాగ్‌లానే రప్పా రప్పా అంటూ ఇప్పటివరకూ ఉన్న రికార్డులను చెరిపేసి, సరికొత్త రికార్డులను సృష్టించారు అల్లు అర్జున్.
ఇప్పటివరకూ ఏ భారతీయ సినిమా సాధించని విధంగా తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా రూ. 294 కోట్ల గ్రాస్ రాబట్టి సరికొత్త రికార్డులను సెట్ చేసింది ‘పుష్ప2: ది రూల్’ సినిమా.అల్లు అర్జున్, రష్మికా మందన్నా జోడీగా నటించిన చిత్రం ‘పుష్ప 2: ది రూల్’. సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో శ్రీలీల ప్రత్యేక పాటలో నటించారు. సుకుమార్ రైటింగ్స్‌తో కలిసి మైత్రీ మూవీ మేకర్స్‌పై నవీన్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్ నిర్మించిన ఈ సినిమా గురువారం (డిసెంబరు 5)న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. అయితే డిసెంబరు 4న రాత్రి 9:30 గంటల నుంచి ప్రారంభమైన ప్రీమియర్స్‌కి అనూహ్యమైన స్పందన వచ్చిన సంగతి తెలిసిందే.
తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ, బెంగాలీ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా 12,500 స్క్రీన్స్‌లో ఈ చిత్రం విడుదలైంది. భారతీయ సినీ చరిత్రలో ఇప్పటివరకూ ఏ సినిమా సాధించని విధంగా మొదటి రోజు రూ. 294 కోట్ల గ్రాస్‌తో ఆల్ టైమ్ రికార్డ్ సృష్టించినట్లు మైత్రీ మూవీ మేకర్స్ ప్రకటించింది. ఇండియాలో ఇప్పటివరకు మొదటి రోజు భారీ వసూళ్లు సాధించిన చిత్రాల్లో ‘ఆర్‌ఆర్‌ఆర్’ (2022) రూ. 233 కోట్ల గ్రాస్‌తో ప్రథమ స్థానంలో ఉంది. ఎన్టీఆర్, రామ్‌చరణ్ హీరోలుగా నటించిన ఈ చిత్రానికి రాజమౌళి దర్శకత్వం వహించారు. అయితే రూ. 294 కోట్ల గ్రాస్ వసూళ్లతో ‘ఆర్‌ఆర్‌ఆర్’ రికార్డును బ్రేక్ చేసింది ‘పుష్ప 2: ది రూల్’.
అదే విధంగా నైజాంలోనూ రికార్డులను తిరగ రాసింది ‘పుష్ప 2’. ఇప్పటివరకూ మొదటి రోజు వసూళ్లలో రూ. 23కోట్ల గ్రాస్‌తో ‘ఆర్‌ఆర్‌ఆర్’ చిత్రం మొదటి స్థానంలో ఉండగా, రూ. 30 కోట్ల గ్రాస్ వసూళ్లతో సరికొత్త రికార్డుని సృష్టించి, మొదటి స్థానంలో నిలిచింది ‘పుష్ప 2: ది రూల్’. హిందీలోనూ తొలి రోజు రూ. 72 కోట్ల వసూళ్లతో ‘పుష్ప 2’ రికార్డు సృష్టించింది. ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. బాలీవుడ్‌లో ఇప్పటివరకు మొదటిరోజు అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా షారుక్ ఖాన్ నటించిన ‘జవాన్’ రూ. 65.5 కోట్లతో మొదటి స్థానంలో ఉంది.
అయితే, తాజాగా ‘పుష్ప 2’ రూ. 72 కోట్ల వసూళ్లతో ‘జవాన్’ని రెండో స్థానానికి పరిమితం చేసింది. హిందీలో షారుక్ ఖాన్, ఆమిర్ ఖాన్, సల్మాన్ ఖాన్ వంటి స్టార్స్‌కు కూడా సాధ్యం కాని రికార్డులను అల్లు అర్జున్ క్రియేట్ చేశారు. ‘పుష్ప: ది రైజ్’ (2021) చిత్రంలో తన అద్భుతమైన నటనకుగానూ జాతీయ అవార్డు అందుకున్నారు అల్లు అర్జున్. ఆ సినిమా బ్లాక్‌బస్టర్ కావడం, ఆయనకి జాతీయ అవార్డు రావడంతో ఉత్తరాదిలోనూ అల్లు అర్జున్‌కి స్టార్‌డమ్, ఫ్యాన్ బేస్ పెరిగిపోయింది. ఈ కారణంగానే హిందీలో ‘పుష్ప 2’కి భారీ ఓపెనింగ్స్ వచ్చాయని ట్రేడ్ విశ్లేషకులు అంటున్నారు. మరి... రానున్న రోజుల్లో రప్పా రప్పా అంటూ ‘పుష్ప 2’ ఇంకెన్ని రికార్డులు సాధిస్తుందో వేచి చూడాల్సిందే.
Comments
Please login to add a commentAdd a comment