తమిళ సినిమా: లియో చిత్రం ఘన విజయం సాధించాలని సూపర్‌స్టార్ రజనీకాంత్ కాంక్షించారు. వివరాలు.. హీరో విజయ్ నటించిన లియో చిత్రం చుట్టూ పలు వివాదాలు నెలకొంటున్నాయి. లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో 7 స్క్రీన్ స్టూడియోస్ పతాకంపై ఎస్‌ఎస్ లలిత్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మించారు. కాగా ఈ చిత్ర ట్రైలర్‌లో అనుచిత పదాలు చోటుచేసుకున్నాయనే విమర్శలను, అదేవిధంగా చిత్రానికి సెన్సార్ బోర్డు అధిక కట్స్ ఇచ్చినట్లు వివాదం చెలరేగింది. విజయ్ చిత్రానికే ఇలాంటి సమస్యలు ఎందుకు ఎదురవుతున్నాయి అంటూ నామ్ తమిళర్ పార్టీ అధినేత సీమాన్ ప్రశ్నించడంతో లియో చిత్రం వ్యవహారం రాజకీయ రంగు పులుముకుంది.
అంతకు ముందు చిత్రంలో విజయ్ సిగరెట్ తాగే సన్నివేశాలను పీఎంకే నేత అన్బుమణి రామదాస్ విమర్శించారు. తాజాగా లియో చిత్రం థియేటర్లో ప్రత్యేక ప్రదర్శనలు విషయం వివాదంగా మారింది. ప్రభుత్వం ఈ చిత్రం విడుదలయ్యే 19వ తేదీన వేకువ జామున 4 గంటల ఆటతో కలిపి ఆరు షోలకు, 20వ తేదీ నుంచి 24 వరకు రోజుకు ఐదు ఆటల ప్రదర్శనకు ప్రభుత్వం అనుమతించినట్లు తొలుత ప్రచారం జరిగింది. అయితే తాజాగా రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయ ప్రధాన కార్యదర్శి.. ఈ చిత్రానికి 5 ఆటలకే అనుమతి అంటూ పోలీస్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
దీంతో చిత్ర నిర్మాత ఎస్‌ఎస్ లలిత్ కుమార్ చైన్నె హైకోర్టును ఆశ్రయించారు. ఈమేరకు సోమవారం అత్యవసర పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటీషన్‌ను న్యాయమూర్తి అనితా సుమంత్ సమక్షంలో విచారణకు వచ్చింది. కాగా మరోపక్క లియో చిత్ర నిర్మాతకు, థియేటర్ యాజమాన్యానికి మధ్య కూడా తీవ్ర చర్చలు జరుగుతున్నాయి. చిత్ర నిర్మాత లియో తొలివారం కలెక్షన్లలో 75 శాతం తమకు ఇవ్వాలంటూ కండిషన్ పెట్టడం కూడా చర్చనీయాంశంగా మారింది. ఇదిలా ఉండగా.. తన 171 చిత్రంలో నటిస్తున్న రజనీకాంత్ కన్యాకుమారి, నెల్‌లై జిల్లాలో షూటింగ్ పూర్తిచేసుకుని సోమవారం తూత్తుకుడి నుంచి చైన్నెకి బయలుదేరారు. ఈ సందర్భంగా ఆయన తూత్తుకుడి విమానాశ్రయంలో మీడియాతో మాట్లాడుతూ.. తాను 47 ఏళ్ల క్రితం భువనా ఒరు కేళ్వికురి చిత్రం షూటింగ్ కోసం తూత్తుకుడి జిల్లాకు వచ్చానన్నారు. కాగా విజయ్ నటించిన లియో చిత్రం ఎదుర్కొంటున్న సమస్యల గురించి ప్రశ్నించగా లియో చిత్రం ఘనవిజయం సాధించిందాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment