పిల్లలు ఉన్న చోట పెద్దలు ఉండక తప్పదు. కాని ఆ పెద్దలకు ఒక బాల్యం ఉంటుంది. బతికిన ఒక ఊరు ఉంటుంది. ఏదో ఒక స్థలంతో, ఆవాసంతో బంధం ఉంటుంది. తమ చివరి రోజుల్లో వాటిని ఒకసారి చూసుకోవాలని వారికి ఉంటుంది. పిల్లలకు అది పట్టదు. కాని వారిని అర్థం చేసుకుంటే ఆ కోరిక నెరవేరుస్తే వారు పొందే ఆనందం చాలా విలువైనది. ‘సర్దార్ కా గ్రాండ్‌సన్’లో ఒక నానమ్మ చివరి సందర్శనను మనవడు నెరవేరుస్తాడు. ఆదివారం సినిమా పరిచయం.
వృద్ధాప్యంలో జ్ఞాపకం పెద్ద ఊతంగా ఉంటుంది. గతం ఒక ఓదార్పుగా ఉంటుంది. ఎన్నో చేదు అనుభవాలు కూడా వాటిలో ఉంటాయి. కాని వాటి గాఢత, ఆ సందర్భాలను దాటి రావడం వల్ల పూర్తిగా తగ్గి, ఆ అనుభవాల పునఃసందర్శనకు కూడా శక్తి ఉంటుంది. ఇక మంచి జ్ఞాపకాలనైతే వెతుక్కుంటూ వెళ్లాలని ఉంటుంది.
వృద్ధాప్యంలో ఉన్నవారి మనసుల్లో ఏం కోరిక ఉందో పిల్లలకు పెద్దగా పట్టదు. వారిని బాగా చూసుకుంటున్నాం కదా అనుకుంటారు. మహా అయితే పుణ్యక్షేత్రాలకు తీసుకువెళతారు. కాని ఇవాళ్టి వృద్ధులు ఒకప్పటి యవ్వనవంతులు, యువతీ యువకులు, భార్యాభర్తలు, ఉద్యోగులు, సంసారులు. వారి జీవనంతో పెనవేసుకున్న విషయాలు ఎన్నో ఉంటాయి. వాటిలో కొన్నింటిని వారు ఆఖరిశ్వాస వరకూ పూర్తిగా అంటి పెట్టుకుని ఉంటారు. తాము పోయేలోపు ఆ ఫలానా స్థలాన్నో, వ్యక్తినో, ఊరినో తిరిగి చూడాలనుకుంటారు. ఆ కోరిక తీరిస్తే వారికి కలిగే
ఆనందం అనంతం.
‘సర్దార్ కా గ్రాండ్’ ఇటీవల నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన సినిమా. అమృత్‌సర్‌లో స్థిరపడిన శ్రీమంతురాలైన 90 ఏళ్ల వృద్ధురాలి కథ అది. ఆమె పిల్లలు బాగా స్థిరపడ్డారు. ఆమె కూడా ఇక హాయిగా చివరి శ్వాస తీసుకోవచ్చు. కాని ఆమె మనసులో ఒక కోరిక. తాను మరణించేలోపు తను ఇష్టపడి కట్టుకున్న ఇంటిని చూడాలనేది. అదేం పెద్ద కోరిక అనుకోవచ్చు. కాని ఆ ఇల్లు లాహోర్‌లో ఉంది. దేశ విభజన సమయంలో దానిని ఆమె విడిచి వచ్చేసింది. అక్కడ ఉండగా భర్తతో ఎంతో ఇష్టపడి ఆ ఇంటిని కట్టుకుంది. అందులోనే తొలి బిడ్డకు జన్మనిచ్చింది. అందులోనే నాటి అల్లర్లలో భర్త ప్రాణం విడిచాడు. ఆ ఇంటిని చూసుకోవాలని ఉంటుంది. కాని ఆమె ఆరోగ్యరీత్యా వేరే కారణాల రీత్యా ఎవరూ ఆ కోరికను మన్నించరు. కాని ఆమె మనవడు ఆమె కోరికను అర్థం చేసుకుంటాడు. దానిని నెరవేర్చాలనుకుంటాడు. అక్కడే సమస్య వస్తుంది.
ఇంటినే కదిలించి
అమృత్‌సర్‌లో ఉన్నవారు పాకిస్తాన్‌కు వెళ్లిరావడం పెద్ద సమస్య కాదు. కాని మనవడికి వీసా వస్తుంది కాని నానమ్మకు రాదు. దానికి కారణం గతంలో ఒక క్రికెట్ మేచ్‌లో ఆమె చేసిన అల్లరే కారణం. అందుకని మనవడు లాహోర్ వెళతాడు. ఏ ఇంటికైతే తన నానమ్మ రాలేదో ఆ ఇంటినే అమృత్‌సర్‌కు తీసుకువస్తాడు. అంటే దానిని పునాదులతో సహా పెకలించి ట్రక్కు మీద పెట్టి అమృత్‌సర్ తీసుకువస్తాడు. అయితే అదంత సులువు కాదు. దాని కోసం అతడు ఏమేమి తిప్పలు పడ్డాడనేది కథ. కొంచెం హాస్యం, కొంచెం సెంటిమెంట్‌తో సినిమా మొదటి పదిహేను నిమిషాలు స్లోగా ఉన్నా తర్వాత అందుకుంటుంది.
నీనా గుప్తా సర్వమై
ఈ సినిమా గత నెల విడుదలైంది. ఆశించినంత స్పందన రాలేదు. దానికి కారణం ఈ స్క్రిప్ట్ ఇంకా బాగుండొచ్చు. అయితే ఈ సినిమా ఒకసారి చూసేంతగా ఆకట్టుకోవడానికి కారణం వృద్ధురాలిగా నటించిన నీనా గుప్తా నటన. ఆమె మన మనసులోని భావాలను, నాటి అనుభవాల గాఢతను తెర మీద వ్యక్తం చేయడంలో గొప్ప నటన చూపించింది. ఈ సినిమా చూసినంత సేపు మన ఇంట్లో నానమ్మో, తాతయ్యో, ఇరువురో ఉంటే ‘మీకేం కావాలి... మీరేం చూడాలనుకుంటున్నారు... మీరెవరిని కలవాలనుకుంటున్నారు’ అని అడిగేలా ఉంటుంది. మిగిలిన పాత్రల్లో అర్జున్ కపూర్, రకుల్‌ప్రీత్ సింగ్ నటించారు. లాహోర్ ఫ్లాష్‌బ్యాక్‌లో జాన్ అబ్రహామ్, అదితి రావ్ హైదరీ మెప్పిస్తారు. జాన్ అబ్రహామ్ దీని నిర్మాత.
Comments
Please login to add a commentAdd a comment