ప్రయోగం, పరిశోధన, భవిష్యత్ కాల ప్రయాణం, మరమనిషి, ఇలా సైంటిఫిక్ ఎలిమెంట్స్‌తో ముడిపడిపోయారు కొందరు నటీనటులు. సైన్స్‌ఫిక్షన్ చిత్రాలకు సై అంటూ సైన్ చేశారు. ఈ స్టార్స్ చేస్తున్న వెండితెర సైన్స్ ప్రాజెక్ట్ వివరాలు తెలుసుకుందాం..
28వ శతాబ్దంలో...
ఉన్నట్లుండి కొన్ని వందల సంవత్సరాలు ముందుకు వెళితే ఎలా ఉంటుంది? అసలు.. 28వ శతాబ్దంలో ప్రపంచం ఎలా ఉంటుంది? అనే ఓ ఊహాత్మక కథ వెండితెరపైకి వస్తే అదే ‘కల్కి 2898 ఏడీ’ చిత్రమట. ప్రభాస్, కమల్‌హాసన్, అమితాబ్ బచ్చన్, దీపికా పదుకోన్, దిశా పటానీ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సైన్స్ ఫిక్షన్ అండ్ టైమ్ ట్రావెల్ ఫిల్మ్ ‘కల్కి 2898 ఏడీ’. ‘మహానటి’ ఫేమ్ నాగ్ అశ్విన్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. 18వ శతాబ్దంలో మొదలై 28వ శతాబ్దంలోకి ఈ కథ వెళ్తుందని ఫిల్మ్‌నగర్ సర్కిల్స్‌లో వినిపి స్తోంది. ఈ సినిమా రెండు భాగాలుగా రిలీజయ్యే చాన్స్ ఉందని టాక్. అశ్వనీదత్ నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది విడుదల కానుంది.
చారిత్రాత్మక కంగువా
ఇటీవల విడుదలైన ‘కంగువా’ సినిమా వీడియో గ్లింప్స్‌ను బట్టి ఇది పూర్తి చారిత్రాత్మక నేపథ్యం ఉన్న సినిమా అనేది కొందరి ఊహ. కానీ చారిత్రాత్మక భాగం కొంతవరకే ఉంటుందని, ఎక్కువ శాతం సమకాలీన కాలంలోనే జరుగుతుందని తెలిసింది. అలాగే కొంత భాగం 18వ శతాబ్దంలో ఉంటుందని, పరాక్రమవంతుడైన ఓ యోధుడు అంతు చిక్కని వ్యాధితో మరణించి, అతనే మళ్లీ జన్మించి, గత జన్మలో తాను ఎలా మరణించాడో తెలుసుకునే అంశాల సమాహారంగా సైన్స్ ఫిక్షన్ ఎలిమెంట్స్‌తో ‘కంగువా’ కథనం ఉంటుందని భోగట్టా. సూర్య హీరోగా శివ దర్శకత్వంలో స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో దిశా పటానీ హీరోయిన్. కాగా ‘కంగువా’ సినిమాలోని తొలి భాగం 2024 ఏప్రిల్ 12న విడుదల కానున్నట్లు సమాచారం.
ఫిక్షనల్ గ్యాంగ్‌స్టర్
సాధారణంగా సైన్స్ ఫిక్షన్ సినిమాలంటే.. విభిన్నమైన పేర్లతో ఆపరేషన్స్ చేయడం, పరిశోధనలు, ఆవిష్కరణలు వంటి అంశాలు మిళితమై ఉంటాయి. కానీ గ్యాంగ్‌స్టర్ యాక్షన్‌కు సైన్స్ ఫిక్షన్, టైమ్ ట్రావెల్ అంశాలను జోడించి ఓ కొత్త ప్రయత్నం చేశారు అధిక్ రవిచంద్రన్. విశాల్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘మార్క్ ఆంటోనీ’ టైమ్‌ట్రావెల్ బేస్డ్ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ డ్రామాగా రూపొందింది. అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో విశాల్ డిఫరెంట్ గెటప్స్‌లో కనిపిస్తారు. విశాల్‌కు జోడీగా రీతూ వర్మ నటించిన ఈ చిత్రం సెప్టెంబరు 15న రిలీజ్ కానుంది.
ఓ గ్రహాంతరవాసి కథ
ఓ గ్రహాంతరవాసి భూగ్రహంపై నివాసం ఉండాల్సి వస్తే ఏం జరుగుతుంది? అనే అంశం నేపథ్యంలో బాలీవుడ్‌లో గతంలో హృతిక్ రోషన్ ‘కోయీ.. మిల్ గయా’, ఆమిర్ ఖాన్ ‘పీకే’ వంటి సినిమాలు వచ్చిన సంగతి గుర్తుండే ఉంటుంది. కాస్త అటూ ఇటూగా ఈ చిత్రాల తరహాలోనే తమిళ సైన్స్ ఫిక్షన్ మూవీ ‘అయలాన్’ ఉంటుందట. శివ కార్తికేయన్ హీరోగా ఆర్. రవికుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో రకుల్ ప్రీత్‌సింగ్ హీరోయిన్. ఈ సినిమాలో ఓ ఏలియన్ పాత్ర ఉన్నట్లు పోస్టర్స్ స్పష్టం చేస్తున్నాయి. ఈ ఏడాది దీపావళికి ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలనుకుంటున్నారు.
ఇండియాలో ఏలియన్స్ ఉంటే..
ఇండియాలో ఏలియన్స్ నివాసం ఏర్పాటు చేసుకోవాలను కుంటే ఏం జరుగుతుంది? అనే పాయింట్‌తో తమిళ చిత్రం ‘ఏలియన్’ రూపొందుతోందట. తాప్సీ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ఇది. భరత్ నీలకంఠన్ దర్శకత్వం వహిస్తున్నారని తెలిసింది. ఆల్రెడీ షూటింగ్ జరుగుతోంది.
రోబోలుగా హీరోయిన్లు
ఓ మనిషిని రోబో ప్రేమిస్తే ఎలా ఉంటుంది? అనే పాయింట్ రజనీకాంత్ ‘రోబో’లో చూశాం. అయితే ఓ రోబోటిక్స్ ఎక్స్‌పర్ట్ రోబోతో ప్రేమలో పడితే, రోబోలు ప్రేమించుకుంటే.. అనే అంశాలతో హిందీలో ఓ సినిమా తెరకెక్కుతోందని టాక్. షాహిద్ కపూర్, కృతీ సనన్ జంటగా నటిస్తున్న ఓ సైన్స్ ఫిక్షన్ ఫిల్మ్ కథ ఇది అని సమాచారం. అమిత్ జోషి, ఆరాధన షా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో రోబోగా కృతీ సనన్, రోబోటిక్ ఎక్స్‌పర్ట్ పాత్రలో షాహిద్ కపూర్ నటిస్తున్నారట. మరోవైపు ‘ఎంవై 3’ అనే సైన్స్ ఫిక్షన్ వెబ్ సిరీస్‌లో నటిస్తున్నారు హన్సిక. ఇందులో హన్సిక చేస్తున్న రెండు పాత్రల్లో రోబో పాత్ర ఒకటి.
- శ్రీశ్రీ
Comments
Please login to add a commentAdd a comment