ప్రస్తుతం టాలీవుడ్ సినీ ప్రేక్షకులు 'ఆదిపురుష్' నామం జపిస్తున్నారు. ఎవరినీ పలకరించినా జై శ్రీరామ్ అనే పదమే వినిపిస్తోంది. ఎందుకంటే అత్యంత ప్రతిష్ఠాత్మకమైన రామాయణం ఆధారంగా తెరకెక్కించిన చిత్రం కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. రెబల్ స్టార్ ప్రభాస్ తొలిసారి రాముడిగా నటించడంతో అభిమానులు ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అంతే స్థాయిలో చిత్రబృందం సైతం ప్రమోషన్లలో భాగంగా భారీస్థాయిలో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించిన సంగతి తెలిసిందే.
అయితే తెలుగులో రామాయణం ఆధారంగా తెరకెక్కిన చిత్రాలు గతంలో చాలానే వచ్చాయి. కానీ అప్పటి స్టార్ హీరోలు సైతం రాముడి పాత్రలో కనిపించారు. వెండితెరపై రాముడిగా మెప్పించినవారిలో నటసార్వభౌమ సీనియర్ ఎన్టీఆర్‌తో పాటు అక్కినేని నాగేశ్వరరావు, కాంతారావు, శోభన్‌బాబు సైతం రాముడి పాత్ర పోషించారు. మరీ రాముడి పాత్రలో ఎవరు చక్కగా ఒదిగిపోయారు? రాముడి వేషధారణలో అచ్చం రాముడే అనిపించేలా ఎవరు మెప్పించారు? అలా వెండితెరపై మొదటిసారి రాముడిగా ఎవరు కనిపించారు? అనే ఆసక్తికర విషయాలు తెలుసుకోవాలనుందా? అయితే ఈ స్టోరీ చదివేయండి.
(ఇది చదవండి: విడాకులు తీసుకున్న నటి.. నేను సరైన పనే చేస్తున్నా)
తొలిసారి రాముడిగా ఆయనే..
సినీరంగంలో చాలామంది అగ్రనటులు రాముడిగా కనిపించినా.. తొలిసారి తెరపై రాముడిగా కనిపించింది మాత్రం నటుడు యడవల్లి సూర్యనారాయణనే. 1932లో విడుదలైన పాదుకా పట్టాభిషేకం చిత్రంలో రాముడిగా కనిపించారు. బాదామి సర్వోత్తం దర్శకత్వం వహించిన ఈ సినిమా రెండో తెలుగు చిత్రంగా తెరకెక్కింది. ఆ తర్వాత ఇదే పేరుతో 1945లో విడుదలైన చిత్రంలో సీఎస్‌ఆర్ ఆంజనేయులు రాముడిగా కనిపించారు.
తొలి చిత్రంలోనే రాముడిగా అక్కినేని
శ్రీ సీతారామ జననం చిత్రంలో అక్కినేని నాగేశ్వరరావు రాముడిగా కనిపించారు. 1944లో వచ్చిన ఈ సినిమాలో ఆయన పూర్తిస్థాయి కథానాయకుడిగా నటించారు. తొలి సినిమా అయినా వెండితెరపై రాముడిగా అందరి ప్రశంసలు అందుకున్నారు. అంతేకాకుండా ఘంటసాలకు కూడా ఇది తొలిచిత్రం కావడం విశేషం.
రాముడంటే ఆయనే అనేలా..
తెలుగు సినిమాల్లో రాముడు అనగానే అందరికీ ఠక్కున గుర్తొచ్చే పేరు ఆయనదే. ఆయనే నట విశ్వరూపం నందమూరి తారకరామారావు. 1959లో విడుదలైన సంపూర్ణ రామాయణంలో తొలిసారి రాముడిగా కనిపించారు. ఆ తర్వాత లవకుశ, రామదాసు, శ్రీరామాంజనేయ యుద్ధం చిత్రాల్లోనూ రాముడి పాత్ర పోషించారు. ఎన్టీఆర్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన శ్రీరామ పట్టాభిషేకం సినిమాలోనూ రాముడి పాత్రలో కనిపించారు. ఎన్టీఆర్‌ను రాముడిలా తెరపై కనిపిస్తే ప్రేక్షకులు థియేటర్లలో స్క్రీన్‌కే హారతులు ఇచ్చారంటే ఆయన ఎంతలా ఒదిగిపోయాడో తెలుస్తోంది.
రావణుడిగా ఎన్టీఆర్
ఎన్టీఆర్ దర్శకత్వం వహించిన ‘సీతారామ కల్యాణం’ సినిమాలో నటుడు హరనాథ్ రాముడి పాత్ర పోషించారు. 1961లో విడుదలైన ఈ మూవీలో రావణుడిగా రామారావు నటించారు. ఆ తర్వాత 1968లో విడుదలైన ‘శ్రీరామకథ’ సినిమాలోనూ హరనాథ్ రాముడిగా కనిపించారు.
ఒక్కసారైనా ఒదిగిపోయారు..
తెలుగు సినీరంగంలో అందగాడైన హీరో శోభన్‌బాబు ఓ చిత్రంలో రాముడిగా కనిపించారు. బాపు దర్శకత్వంలో తెరకెక్కిన ‘సంపూర్ణ రామాయణంలో రాముడి పాత్ర పోషించారు. 1971లో వచ్చిన ఈ సినిమాలో రావణుడి పాత్రలో ఎస్వీ రంగారావు ఆకట్టుకున్నారు. 1968లో వచ్చిన వీరాంజనేయ చిత్రంలో కాంతారావు రాముడిగా కనిపించారు. 1976లో బాపు గారి దర్శకత్వంలో వచ్చిన సీతా కల్యాణం సినిమాలో నటుడు రవికుమార్ రాముడిగా ఒదిగిపోయారు.
(ఇది చదవండి: ప్రభాస్ ఫ్యాన్స్‌కు షాక్.. ఆ థియేటర్లలో ఆదిపురుష్ రిలీజ్ లేనట్లేనా?)
బాల రాముడిగా జూనియర్ ఎన్టీఆర్..
ఎన్టీఆర్ మనవడు, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ రాముడి పాత్రలో మెప్పించారు. గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘బాల రామాయణం’లో జూనియర్ నటించారు. 1997లో వచ్చిన ఈ సినిమా ఉత్తమ బాలల చిత్రంగా నేషనల్ అవార్డు, రెండు నంది అవార్డులను దక్కించుకుంది.
రామదాసులో సుమన్.. దేవుళ్లులో శ్రీకాంత్.. శ్రీ రామరాజ్యంలో బాలయ్య
ప్రస్తుతం టాలీవుడ్ హీరోలు కూడా రాముడి పాత్ర పోషించారు. కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన ‘శ్రీ రామదాసు’లో సుమన్ రాముడిగా ఆకట్టుకున్నారు. అలాగే కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన ‘దేవుళ్లు’ చిత్రంలోని ఓపాటలో శ్రీకాంత్ రాముడిగా కనిపించారు. నందమూరి బాలకృష్ణ సైతం ఓ చిత్రంలో రాముడిగా కనిపించారు. బాపు దర్శకత్వంలో వచ్చిన శ్రీ రామరాజ్యంలో మెప్పించారు. 2011లో వచ్చిన మూవీలో సీతగా నయనతార ఆకట్టుకుంది.
ఆదిపురుష్‌లో ప్రభాస్
అయితే ఇప్పటివరకు వచ్చిన సినిమాల్లో రాముడి పాత్రలో అలనాటి హీరోలు అభిమానులను ఆకట్టుకున్నారు. అయితే అప్పటి రామాయణానికి.. ఇప్పుడు తెరకెక్కిన రామాయణానికి చాలా తేడా ఉంది. ఎందుకంటే అప్పట్లో ఇంతలా సాంకేతికపరమైన టెక్నాలజీ లేదు. ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా రామాయణానికి ఆధునిక టెక్నాలజీతో రూపొందించారు. ఈ చిత్రాన్ని గ్రాఫిక్స్, సరికొత్త హంగులతో తీర్చిదిద్దారు. అత్యాధునిక టెక్నాలజీతో రూపొందించిన ఆదిపురుష్‌లో ప్రభాస్ రూపంలో ఉన్న రాముడు ప్రేక్షకులను ఎంతవరకు మెప్పిస్తాడో తెలియాలంటే తెరపై చూడాల్సిందే. రావణుడి పాత్రలో బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ కనిపించనుండగా.. ప్రపంచవ్యాప్తంగా జూన్ 16న ఆదిపురుష్ థియేటర్లలో సందడి చేయనుంది.
-పిన్నాపురం మధుసూదన్
Comments
Please login to add a commentAdd a comment