ప్రముఖ మలయాళ నటి, యాంకర్ కమెడియన్ సుబి సురేశ్ మరణంతో మాలీవుడ్‌లో విషాదం నెలకొంది. గతకొంతకాలంగా కాలేయ సమస్యలతో బాధపడుతున్న ఆమె ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటూనే తుదిశ్వాస విడిచారు. అయితే సమయానికి తినకపోవడం, సరైన ఆహారం తీసుకోకపోవడం వల్లే ఆమె అనారోగ్యానికి గురైనట్లు తెలుస్తోంది. ఆరు నెలల క్రితం ఆమె తన అనారోగ్యం గురించి మాట్లాడిన వీడియో ఒకటి ప్రస్తుతం వైరల్‌గా మారింది.
సుబి సురేశ్ యూట్యూబ్ ఛానల్‌లో ఉన్న ఆ వీడియోలో తను ఏమందంటే.. 'సమయానికి తినడం, మందులు వేసుకోవడం వంటి మంచి అలవాటు నాకు లేదు. దీనివల్ల ఓసారి షూటింగ్‌కు ముందు రోజు ఛాతీలో నొప్పి వచ్చింది, దీనికి గ్యాస్ట్రిక్ సమస్య కూడా తోడైంది. ఆ మరుసటి రోజు నేను ఏదీ తినలేకపోయాను. ఒకటే వాంతులు.. కొబ్బరి నీళ్లు తాగినా కూడా దాన్ని బయటకు కక్కేశాను. రెండు రోజులు ఏమీ తినలేదు. డాక్టర్ దగ్గరకు వెళ్తే పొటాషియం చాలా తక్కువగా ఉంది. సరిగా తినాలని చెప్పారు.
నిజానికి చాలామంది నాకు డబ్బు పిచ్చి అనుకుంటారు. ఫుడ్ కూడా తినకుండా డబ్బు వెంట పరుగెడుతుందనుకుంటారు. కానీ అది నిజం కాదు. చాలాకాలం తర్వాత వరుస ప్రాజెక్టులు వస్తుండటంతో కొత్త ఉత్సాహంతో వాటిని చేసుకుంటూ పోయాను. నా ఫోకస్ డబ్బు మీద కాకుండా పని మీదే ఉంది. ఈ క్రమంలో సరైన ఫుడ్ తీసుకోవడాన్ని నిర్లక్ష్యం చేశాను. ఈ విషయంలో అమ్మ, సోదరుడు నన్ను పదేపదే తిట్టేవారు. నాకు నచ్చినవి పట్టుకొచ్చినా వాటివైపు కన్నెత్తి చూసేదాన్నే కాదు. చెప్పాలంటే నాకు ఆకలిగా ఉన్నా కూడా ఏమీ తినకపోయేదాన్ని. అదే నాకున్న అత్యంత చెడ్డ లక్షణం.
రానురానూ నా శరీరంలో మాగ్నీషియం, పొటాషియం, సోడియం లెవల్స్ పడిపోవడంతో నా పరిస్థితి కొంత సీరియస్‌గా మారింది. ముందునుంచే కరెక్ట్‌గా తిని ఉండుంటే పరిస్థితి ఇంతదాకా వచ్చేది కాదు కదా అనుకున్నా. షూటింగ్‌కు వెళ్లి ఆలస్యంగా వచ్చినప్పుడు డైరెక్ట్‌గా బెడ్‌రూమ్‌కు వెళ్లి పడుకునేదాన్ని. ఏ సాయంత్రానికో లేచేదాన్ని. అప్పుడు కూడా బద్ధకంతో కేవలం నీళ్లు తాగి మళ్లీ నిద్రపోయేదాన్ని. ఇది తరచూ రిపీట్ అవడంతో హాస్పిటల్‌లో 10 రోజులు ఉండాల్సింది. కొన్నేళ్లుగా నిర్లక్ష్యంగా ఉన్న నేను ఇప్పుడు రోజుకు మూడు సార్లు తింటున్నాను. కాబట్టి అందరికీ అనుభవంతో చెప్తున్నా.. సమయానికి తినడం అలవాటు చేసుకోండి' అని చెప్పుకొచ్చింది సుబి సురేశ్. ఇది చూసిన నెటిజన్లు మీ నిర్లక్ష్యంతో ప్రాణాలే పోగొట్టుకునారు అని కామెంట్లు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment