Tollywood, South Hero And Heroine Who Got Married In Real Life - Sakshi
Sakshi News home page

టాలీవుడ్‌లో ప్రేమ పెళ్లి చేసుకున్న హీరోహీరోయిన్లు వీళ్లే!

Published Fri, Jun 9 2023 9:45 AM | Last Updated on Fri, Jun 9 2023 2:42 PM

Tollywood And South Hero, Heroine Who got Married in Real Life - Sakshi

ఏదైనా సినిమా జనాల్లో క్లిక్‌ అయిందంటే చాలు అందులో నటించిన హీరోహీరోయిన్ల పెయిర్‌ బాగుందని మెచ్చుకుంటారంతా! వాళ్లిద్దరూ మళ్లీ కలిసి నటిస్తే చూడాలని తహతహలాడుతారు అభిమానులు. అయితే ఆన్‌స్క్రీన్‌పై కలిసి ఉండే సెలబ్రిటీలు ఆఫ్‌స్క్రీన్‌లోనూ అదే విధంగా ఉంటారనుకుంటే పొరపాటే! చాలామటుకు ఇండస్ట్రీకి సంబంధం లేని వ్యక్తులనే పెళ్లి చేసుకుంటారు. అయితే కొందరు మాత్రం షూటింగ్‌లో ప్రేమలో పడి నెక్స్ట్‌ సినిమాకు పెళ్లితో ఒక్కటవుతారు. అలా ప్రేమించి పెళ్లి చేసుకున్న తారలు చాలామందే ఉన్నారు. వరుణ్‌ తేజ్‌- లావణ్య త్రిపాఠి కూడా త్వరలో ఈ జాబితాలో చేరనున్నారు. ఈ సందర్భంగా  ప్రేమపెళ్లి చేసుకున్న జంటలను, వారి ప్రేమాయణాలను పారాయణం చేద్దాం..

కృష్ణ-విజయ నిర్మల
సూపర్‌ స్టార్‌ కృష్ణ అందగాడు. ఎంతోమంది హీరోయిన్లతో ఆడిపాడిన ఆయన 1961లో మరదలు ఇందిరను పెళ్లాడారు. ఆ తర్వాత బాపు దర్శకత్వంలో వచ్చిన ‘సాక్షి’ సినిమాలో విజయ నిర్మలతో జోడీ కట్టారు. షూటింగ్‌లో మనసారా ఆమెను ప్రేమించారు. ఆమె కూడా కృష్ణను ప్రేమించారు. దీంతో 1969లో విజయ నిర్మలను కృష్ణ రెండో వివాహం చేసుకున్నారు. ఇద్దరికి ఇది రెండో పెళ్లే అయినప్పటికి ఎటువంటి గొడవలు లేకుండా అన్యోన్య దంపతులగా గుర్తింపు తెచ్చుకున్నారు.

శ్రీకాంత్‌-ఊహ
‘ఆమె’ సినిమా షూటింగ్‌ సమయంలో శ్రీకాంత్‌, ఊహల మధ్య పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత వీరిద్దరూ కలిసి నాలుగు సినిమాల్లో కలిసి నటించారు. అలా మరింత క్లోజ్‌ అయ్యారు. తన ఇంట్లో జరిగే ప్రతి ఫంక్షన్‌కు ఊహను పిలిచేవాడు శ్రీకాంత్‌. దీంతో శ్రీకాంత్‌ కుటుంబసభ్యులకు ఊహ అలవాటయ్యారు. ఆ తరువాత ఇరువురి ఇంట్లో ఒప్పుకోవడంతో శ్రీకాంత్‌ - ఊహ 1997లో పెళ్లి చేసుకున్నారు. వీరికి రోషన్, మేధా, రోహన్‌ అనే ముగ్గురు పిల్లలు ఉన్నారు.

జీవిత-రాజశేఖర్‌
ఎప్పుడూ వార్తల్లో ఉండే ఈ జంట ప్రేమ, పెళ్లి అంతా విచిత్రంగానే జరిగింది. ఓ తమిళ నిర్మాత తన సినిమాకోసం రాజశేఖర్‌కు జోడీగా జీవితను తీసుకున్నారు. మొదటిసారి జీవితను చూసిన రాజశేఖర్ ‘ఈమెను తీసేయండి అని చెప్పారు. కానీ దర్శకనిర్మాతలు రాజశేఖర్‌కు షాకిస్తూ అతడినే తొలగించారు. తరువాత ఈ ఇద్దరూ కలిసి ‘తలంబ్రాలు’  సినిమాలో కలిసి నటించగా అప్పుడే ఇద్దరి మధ్య పరిచయం పెరిగి ప్రేమించుకున్నారు.

‘ఆహుతి’ సినిమాలోను కలిసి నటించారు. ఆ సినిమా షూటింగ్‌లో రాజశేఖర్ గాయపడగా జీవిత ఆయనను కంటికి రెప్పలా చూసుకున్నారు. రాజశేఖర్‌పై జీవితకి ఉన్న ప్రేమని అర్థం చేసుకున్న ఆయన కుటుంబ సభ్యులు వీరిద్దరి పెళ్ళికి అంగీకరించారు. 1991 జూలై 10 చెన్నైలో వివాహం చేసుకున్న ఈ జంట‌కి శివానీ, శివాత్మిక అనే ఇద్ద‌రు అమ్మాయిలున్నారు. ప్రస్తుతం వీరిద్దరూ హీరోయిన్లుగా రాణిస్తున్నారు.

నాగార్జున- అమల
తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ యాక్టర్స్‌గా వెలుగొందుతున్న సమయంలో నాగార్జున, అమల ప్రేమలో పడ్డారు. ఒకరినొకరు అర్థం చేసుకొని వివాహ బంధంతో ఒకటయ్యారు. నాగార్జున - అమల జంట'ప్రేమయుద్ధం', 'కిరాయి దాదా', 'శివ', 'నిర్ణయం' సినిమాలలో కలిసి నటించి ప్రేక్షకులను అలరించారు. కాగా 1992 జూన్ 11న వివాహం చేసుకున్నారు. అయితే అంతకు ముందే నాగార్జునకు వెంకటేశ్‌ సోదరితో వివాహం జరగ్గా విడాకులు తీసుకున్నారు.

మహేశ్‌బాబు-నమ్రత
అమ్మాయిల కలల రాకుమారుడు ప్రిన్స్‌ మహేశ్‌ బాబు. కానీ ఆయనకు మాత్రం భార్య నమ్రత అంటే వల్లమాలిన ప్రేమ. 2000 సంవత్సరంలో వచ్చిన వంశీ చిత్రంలో వీరిద్దరూ కలిసి నటించారు. అప్పుడే ప్రేమలో పడ్డారు. ఐదేళ్ల ప్రేమాయణం తర్వాత 2005లో వివాహ బంధంతో భార్యాభర్తలుగా మారారు. వీరికి గౌతమ్, సితార అని ఇద్దరు పిల్లలు ఉన్నారు. 

షాలిని- అజిత్‌
చిన్నప్పుడే సినిమాల్లోకి వచ్చారు షాలిని. బేబీ షాలినిగా ఫుల్‌ క్రేజ్‌ సంపాదించుకున్నారు. తరువాత హీరోయిన్‌గానూ నటించారు. 2000 సంవత్సరంలో కోలీవుడ్‌ స్టార్‌ అజిత్‌ని వివాహం చేసుకున్నారు షాలిని. వీరిది కూడా అన్యోన్య దాంపత్యం.

సూర్య- జ్యోతిక
తమిళంలోనే కాకుండా సౌత్ మొత్తం మీద పాపులారిటీ ఉన్న హీరోలలో సూర్య ఒకరు. సమయం దొరికితే చాలు ఆయన కుటుంబంతో గడిపేందుకు ఆసక్తి చూపిస్తారు. ఇక సూర్య కూడా హీరోయిన్‌ జ్యోతికని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. 2006 లో వివాహం చేసుకున్న ఈ జంటకు ఒక పాప ఒక బాబు సంతానం.  పాప పేరు దియా కాగా బాబు పేరు దేవ్.

నయనతార- విఘ్నేశ్‌ శివన్‌
లేడీ సూపర్‌స్టార్‌గా పేరు తెచ్చుకుంది నయనతార. డైరెక్టర్‌ విఘ్నేశ్‌ శివన్‌తో ప్రేమలో పడ్డ ఆమె ప్రియుడితో సహజీవనం చేస్తున్నట్లు ప్రచారం జరిగింది. ఏళ్లు గడిచినా నోరు విప్పని నయన్‌ 2022, జూన్‌ 7న విఘ్నేశ్‌తో ఏడడుగులు వేసింది. మహాబలిపురంలోని ఓ హోటల్‌లో గ్రాండ్‌గా వీరి పెళ్లి జరిగింది.

ఆది పినిశెట్టి- నిక్కీ గల్రానీ
కొన్ని ప్రేమకథలు గొడవలతో మొదలువతాయంటారు కదా! ఆ జాబితాలోకే వీరి లవ్‌ స్టోరీ కూడా వస్తుంది. ఆది-నిక్కీ మలుపు సినిమాలో కలిసి నటించారు. మొదట్లో స్నేహితులుగా ఉన్న వీరికి ఈ సినిమా షూటింగ్‌ సమయంలో గొడవలు, మనస్పర్థలు వచ్చాయి. కొంతకాలం పాటు మాట్లాడుకోలేదు కూడా! షూటింగ్‌ చివర్లో మళ్లీ కలిసిపోయిన వీరిద్దరూ ఆ తర్వాత పలు సినిమాలు చేశారు. ఈ ప్రయాణంలోనే ప్రేమలో పడ్డారు. గతేడాది మే 18న మూడుముళ్ల బంధంతో ఆఫ్‌స్క్రీన్‌ జంటగా స్థిరపడిపోయారు.

ఇక వీరే కాక శివ బాలాజీ - మధుమిత, వరుణ్‌ సందేశ్‌-వితిక, రాధిక-శరత్‌ కుమార్‌, ఆర్య-సాయేషా సైగల్‌ ఉండగా ఇక బాలీవుడ్‌లో బిగ్‌ బీ- జయా బచ్చన్‌, అభిషేక్‌- ఐశ్వర్య, కరీనా-సైఫ్‌ అలీ ఖాన్‌, దీపికా- రణ్‌వీర్‌ దంపతులు కూడా ప్రేమించి పెళ్లిచేసుకున్న జంటలే! ఇప్పటికీ వీరంతా కొత్త జంటగా ఎంతో అన్యోన్యంగా ఉంటూ ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తున్నారు. 

చదవండి: కోలీవుడ్‌ నుంచి పిలుపు, నో చెప్పిన శ్రీలీల

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement