రానా ఎంత కట్నం తీసుకున్నారు? | Tollywood Celebrities DIWALI Celebrations In Sakshi Tv | Sakshi
Sakshi News home page

దీపాలవేళ సాక్షి టీవీలో తారల సందడి

Published Fri, Nov 13 2020 3:26 AM | Last Updated on Sun, Nov 15 2020 8:31 AM

Tollywood Celebrities DIWALI Celebrations In Sakshi Tv

కొత్త వరుడు కొంటె పోరడు
 

► కొత్త పెళ్లికొడుకు రానా ఎంత కట్నం తీసుకున్నారు?
పెళ్లయ్యాక వచ్చిన తొలి దీపావళి పండగను ఎలా జరుపుకోబోతున్నారు?

► టపాసుల్లో ప్రభాస్‌ని రానా ఏ బాంబుతో పోల్చారు?
అనుష్క గురించి రానా ఏమన్నారు?

► ఇలాంటి విషయాలన్నీ భలే ఆసక్తకిరంగా ఉంటాయి.
ఇవి మాత్రమే కాదు.. రానా ఇంకొన్ని విషయాలను ఈ విధంగా షేర్‌ చేసుకున్నారు.

పెళ్లి చేసుకునే టైమ్‌ వస్తే ఎవరూ ఆపలేరు. అది ప్రభాస్‌కైనా, నాకైనా ఎవరికైనా ఒకటే. ప్రభాస్‌ స్టార్‌ రాకెట్‌ లాంటివాడు. అది పేలినప్పుడు ఆకాశమంతా కనపడుతుంది. అనుష్క కూడా ప్రభాస్‌లాంటి రాకెట్‌ కానీ, ఈమెకు ఇంకా కొన్ని కలర్స్‌ తోడవుతాయి. అనుష్క చిచ్చుబుడ్డిలాంటిది. కట్టప్ప (సత్యరాజ్‌) భూచక్రంలాంటివాడు. నేను థౌజండ్‌వాలా లాంటివాణ్ని.  

కోవిడ్‌ టైమ్‌లో పెళ్లి చేసుకోవటం మంచిదే. ఫ్యామిలీ మెంబర్స్‌ అందరితో చక్కగా ఎంజాయ్‌ చేశాను. ఇప్పుడిప్పుడే మా ఫ్రెండ్స్‌ అందర్నీ కలుస్తున్నాను.  

కట్నం ఎంత తీసుకున్నారు? అని యాంకర్‌ బిత్తరి సత్తి అడిగితే.. ‘నువ్వెంత తీసుకున్నావ్‌’ అని రానా ఎదురు ప్రశ్నించారు. సత్తి ఏం చెప్పారు? రానా తీసుకున్న కట్నం ఎంత?

ఇప్పుడు మూడు సినిమాలు చేస్తున్నాను. అందులో ‘అరణ్య’ చిత్రం ఒకటి. ఆ సినిమాలో 15 నిజమైన ఏనుగులతో కలిసి నేను పెరుగతాను. థాయ్‌ల్యాండ్‌లోని గాభి ఐల్యాండ్‌లో, కేరళ అడవుల్లో ఈ సినిమా తీశాం. ‘హిరణ్యకశ్యప’ని వచ్చే ఏడాది డిసెంబర్‌లో ప్రారంభిస్తాం. ‘విరాటపర్వం’ 1990లకు సంబంధించిన నక్సలిజం బ్యాక్‌డ్రాప్‌లో జరిగే ప్రేమకథ.
 
‘గరమ్‌ సత్తి’తో రానా పంచుకున్న మరెన్నో విషయాలను  శనివారం రాత్రి 8.30 గం‘‘లకు, తిరిగి ఆదివారం ఉదయం 8.30 గం‘‘లకు ‘సాక్షి’ టీవీలో చూడండి.

పండగ సిరి
తండ్రి ‘సిరివెన్నెల’ స్టార్‌ రైటర్‌. తనయుడు రాజా మంచి నటుడు. ఇటీవలే వెంకటలక్ష్మీ హిమబిందుతో ఏడడుగులు నడిచారు రాజా. దీపావళి సందర్భంగా సతీసమేతంగా ‘సాక్షి’ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చాలా విషయాలు పంచుకున్నారు.

పెళ్లికాకముందు తనను అందరూ బిందు అని పిలిచేవారట. నాకు ఆ విషయం తెలియక లక్ష్మీ అని పిలుస్తుంటే ఎవర్నో పిలుస్తున్నట్లు వెళ్లిపోయేది. అప్పుడు నేను ‘నీ పేరు లక్ష్మీ హిమబిందు కదా, అందుకే లక్ష్మీ’ అని పిలుస్తాను అన్నాను. మా ఇంట్లో అందరూ లక్ష్మీ అనే పిలవటంతో ఇప్పుడు అలవాటు అయ్యింది.
 

లక్ష్మీలో నాకు బాగా నచ్చింది ఆమె కలుపుగోలుతనం అని రాజా అంటే , ‘ఏ చిన్న పని చేసినా క్రిస్టల్‌ క్లియర్‌గా చేస్తారు. అలాగే ఆయన క్రమశిక్షణ చాలా నచ్చుతుంది’ అని లక్ష్మీ అన్నారు.

మా అమ్మగారికి కోడల్ని తెద్దామనుకుంటే, అత్తగారికి కూతురయ్యింది. మమ్మల్ని ఎవరు చూసినా కొత్తగా పెళ్లయినవాళ్లలా లేరు అంటున్నారు. అలాగే మా బావ త్రివిక్రమ్‌గారు ‘ఎన్నో ఏళ్లుగా ఒకరికొకరు తెలిసినవాళ్లులా ఉన్నారు మీ ఇద్దరూ’ అన్నారు. మా ఫ్యామిలీ అందరికీ లక్ష్మి నచ్చేసింది. అది అన్నిటికన్నా ఆనందం. త్రివిక్రమ్‌గారు తెలుగు సినిమా పరిశ్రమలో ఎన్‌సైక్లోపీడియా. అందుకే నేను ఏదైనా విషయంలో డైలమాలో ఉంటే బావ సలహా తీసుకుంటాను. ప్రస్తుతం ఉన్న టాప్‌టెన్‌ డైరెక్టర్స్‌తో పని చేయటంతో పాటు కొత్తగా ఏదైనా చేసి నటునిగా నిరూపించుకోవాలనుకుంటున్నా.

డబ్బు కోసం నేను నటునిగా ప్రయాణం మొదలుపెట్టలేదు. సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా బాగానే సంపాదించేవాణ్ని. కానీ, అక్కడ తృప్తిగా అనిపించకపోవటంతో జాబ్‌ క్విట్‌ చేశాను.

నాన్న ఏ సినిమాకైనా పాట రాస్తున్నప్పుడు ఒక వెర్షన్‌ రాసి దర్శకునికి వినిపిస్తే, చాలా బావుంది పాట ఇచ్చేయండి అంటారు. అప్పుడు నాన్నగారు ‘మీకు నచ్చింది కానీ నాకు కావాల్సింది ఇంకా ఏదో మిస్సయింది. అది రాగానే ఇస్తాను’ అంటారు. నేను వ్యక్తిగతంగా నాన్న దగ్గర నుండి కమిట్‌మెంట్, వృత్తిపట్ల ప్యాషన్‌ నేర్చుకుంటే అమ్మదగ్గర క్రమశిక్షణ నేర్చుకున్నాను.

నాకు యాక్టింగ్‌ తర్వాత ఫిట్‌నెస్‌ ఎంతో ఇష్టం. నాకిష్టమైన పనే చేస్తాను కాబట్టి ఎప్పుడూ సెలక్టివ్‌ గా ఉంటాను. నేను ఫిట్‌నెస్‌ ఫ్రీక్‌ కాబట్టి ఇలా ఉండాలి, అలా తినాలి అని చెప్తాను. వాటివల్ల ఇంట్లో డిబేట్‌లు, గొడవలు అన్నీ జరుగుతాయి.  

మా నాన్న లక్ష్మీని వంకాయకూర చేయటం వచ్చా అని అడిగితే వచ్చు అని చెప్పింది. వండటం కాదు, మా అమ్మ వండినట్లు వండాలి అని తనను ఆట పట్టిస్తుంటాను.  

ఇంకా ఈ జంట చెప్పిన బోలెడన్ని కబుర్లు ‘సాక్షి టీవీ’లో శనివారం రాత్రి 7.30 గం‘‘లకు తిరిగి ఆదివారం ఉదయం 11.30 గం‘‘లకు చూడండి.

శ్రీహరి కోట
ఏడేళ్ల తర్వాత శ్రీహరి ఇంట దీపావళి పండగకి దీపాలు వెలిగిస్తున్నారు. తమ జీవితంలోని చీకట్లను పారదోలి ఇప్పుడిప్పుడే వెలుగులు నింపుకుంటున్నారు దివంగత నటుడు శ్రీహరి సతీమణి, నటి, నిర్మాత శాంతీశ్రీహరి. 2013లో శ్రీహరి మరణించిన సంగతి తెలిసిందే. శ్రీహరి చిన్న కుమారుడు  మేఘాంశ్‌ హీరోగా చేస్తున్నాడు. మరో తనయుడు శశాంక్‌ దర్శకుడిగా  పరిచయం కాబోతున్నాడు. భర్త దూరం అయిన చేదు నిజం నుంచి ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్న శాంతి తన తనయుడు మేఘాంశ్‌ తో కలసి పండగ వేళ బోలెడన్ని విషయాలు చెప్పారు.    

ప్రస్తుతం నా దృష్టంతా నటనటనపైనే. లవ్, క్రష్‌లాంటివేమీ లేవు. నా వయసిప్పుడు 20 ఏళ్లే. నా దృష్టంతా నటనపైనే ఉంది. నాన్న చేసినట్లుగా సామాజిక అంశాలతో వచ్చే చిత్రాలను అప్పుడే చేయదలచుకోలేదు. మంచి ఎంటర్‌టైనర్స్‌ చేసి ప్రేక్షకులకు దగ్గర కావాలనుకుంటున్నాను. కొంచెం పరిణితి వచ్చిన తర్వాత.. ఒకవేళ నాన్న సినిమాల్లో ఏదైనా సినిమా రీమేక్‌ చేయాలనుకుంటే ‘భద్రాచలం’ సినిమా చేస్తాను.

నేను షూటింగ్‌లో ఉన్నప్పుడు మా అమ్మను సెట్స్‌ లోకి రానివ్వను. నా ఫస్ట్‌ మూవీ ‘రాజ్‌దూత్‌’ షూటింగ్‌కి ఓసారి అమ్మ సెట్‌కి వచ్చింది. నేను నటిస్తుంటే ఎదురుగా నిలబడి వెక్కిరించింది. ఆమె ఎదురుగా ఉంటే నేను నటించలేను.  

ఎప్పుడు ఎవరికి కష్టమొచ్చినా ‘నేనున్నాను’ అని ధైర్యం ఇచ్చేవారాయన. ఈ రోజు నేను, నా పిల్లలు ఏ కష్టం లేకుండా బతుకుతున్నామంటే అది ఆయన చలవే. ఆయన చేసిన పుణ్యమే.. ఆయన ఉన్నప్పుడు ఎంతోమందికి డబ్బులు ఇచ్చారు. ఆయన పోయాక వారి దగ్గరికెళ్లి మాకు రావాల్సిన డబ్బు ఇవ్వమంటే మీ ఆయనే మాకు ఇవ్వాలి అన్నారు.

ఇంకా శాంతీశ్రీహరి ఏ సందర్భంగా కన్నీటి పర్యంతం అయ్యారు? ఆమె మనసులోని బాధ ఏంటి?

ఈ తల్లీ తనయుడు మనసువిప్పి పంచుకున్న మరెన్నో విషయాలను శనివారం మధ్యాహ్నం 1.30 గం‘‘లకు తిరిగి ఆదివారం సాయంత్రం 6.30 గం‘‘లకు ‘సాక్షి’ టీవీలో చూడండి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement