చిత్రం: ది టుమారో వార్
విడుదల: జులై 02,2021
నటీనటులు: క్రిస్ ప్రాట్, వైవోన్నే స్ట్రాహోవ్స్కీ, సిమన్స్, గిల్పిన్, సామ్ రిచర్డ్సన్, ఎడ్విన్ హాడ్జ్, జాస్మిన్ మాథ్యూస్, ర్యాన్ కీరా ఆర్మ్‌స్ట్రాంగ్, కీత్ పవర్స్ తదితరులు
దర్శకుడు : క్రిస్ మెక్‌కే
సంగీతం: లోర్మీ బ్లాఫీ
సినిమాటోగ్రఫీ: ల్యారీ ఫాంగ్
నిర్మాతలు: డేవిడ్ ఎల్లిసన్, డానా గోల్డ్‌బెర్గ్, డాన్ గ్రాంజెర్, జులెస్ డాలీ, డేవిడ్ ఎస్.గోయర్, ఆడమ్ కోల్‌బెర్నర్
ఓటీటీ భాగస్వామి: అమెజాన్ ప్రైమ్ వీడియో (తెలుగు)
స్ట్రీమింగ్ భాషలు: తెలుగు,ఇంగ్లీష్,హిందీ,తమిళ్,కన్నడ,మలయాళం
హాలీవుడ్ చిత్రాలను తెలుగు ప్రేక్షకులు భారీగానే ఆదరిస్తారు. అందుకే అవన్నీ తెలుగులో కూడా డబ్ అవుతుంటాయి. సైన్స్ ఫిక్షన్ చిత్రాలతో పాటు యాక్షన్ అడ్వెంచర్ చిత్రాలను టాలీవుడ్ ప్రేక్షకులు ఎక్కువగా ఇష్టపడుతుంటారు. మార్వెల్ చిత్రాలతో పాటు ఏలియన్స్ సబ్జెక్ట్‌తో వచ్చిన సినిమాలు ఎన్నో థియేటర్‌లలో సందడి చేశాయి. ఈ క్రమంలో తెరకెక్కిన మిలటరీ సైన్స్ ఫిక్షన్ సినిమానే 'ది టుమారో వార్'. 2021 కోవిడ్ సమయంలో డైరెక్ట్‌గా అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదలైన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. హలీవుడ్‌లో తెరకెక్కిన ఈ సినిమా అమెజాన్‌లో తెలుగులో కూడా అందుబాటులో ఉంది. ఈ సినిమా కథేంటో తెలుసుకుందాం. భవిష్యత్ కాలంలో భూమి మీద ఎలాంటి ఇబ్బందులు రావచ్చేనే కాన్సెప్ట్‌తో 'ది టుమారో వార్' కథ ఉంటుంది. గ్రహాంతర వాసులకు.. జీవరాశులకు మధ్య జరిగే భారీ యాక్షన్ వార్‌గా చాలా ఉత్కంఠతో కూడుకొని కథ ఉంటుంది.
కథ ఎంటి..?
డాన్ ఫారెస్టర్ (క్రిస్ ప్రాట్) మాజీ ఇరాక్ సైనికాధికారి. రిటైర్డ్ అయ్యాక స్కూల్ పిల్లలకు బయాలజీ చెబుతూ తన భార్య (బెట్టీ గ్లిపిన్), కూతురు (రియాన్ కైరా)తో కలిసి జీవితం గడుపుతుంటాడు. ఒకరోజు ఆకాశం నుంచి ఓ ఆర్మీ యూనిట్ ఆయనముందు ప్రత్యక్షమవుతుంది. తామందరం భవిష్యత్ కాలం నుంచి వచ్చామని చెబుతూ ఎలియన్స్‌తో యుద్ధం చేసేందుకు సైన్యం అవసరం ఉందని చెబుతారు. ఆయనొక ఆర్మీ అధికారి కాబట్టి ఎలియన్స్ మీద పోరాటం చేసేందుకు తీసుకెళ్తారు. భవిష్యత్తు యుద్ధం కోసం అతను చేసిన త్యాగం ఏమిటి? ఒక బృందంగా వెళ్లిన డాన్ ఫారెస్టర్ ఏం చేశాడు..? ఏలియన్స్ ఎలా అంతమయ్యాయి..? డాన్ ఫారెస్టర్ కోసమే భవిష్యత్ కాలం నుంచి వారు ఎందుకు వచ్చారు..? ఇవన్నీ తెలియాలంటే అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతున్న 'ది టుమారో వార్' చూడాల్సిందే.
ఎలా ఉందంటే..?
గ్రహాంతర వాసులకు.. జీవరాశులకు మధ్య జరిగే యుద్ద నేపథ్యంలో వచ్చిన ఈ యాక్షన్ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ చాలా అంశాల్లో ప్రేక్షకులను మెప్పిస్తుంది. ఏలియన్స్ కాన్సెప్ట్‌తో వచ్చిన ప్రతి సినిమా బాక్సాఫీస్ వద్ద విజయాన్ని అందుకుంది. అన్నీ సినిమాల మాదిరి కాకుండా ది టామారో వార్ సినిమాను చాలా ప్రత్యేకంగా తెరకెక్కించారు. దర్శకుడు ఎంచుకున్న పాయింట్ భిన్నమైనది. ఎలియన్స్‌ను ఎదుర్కొనేందుకు భవిష్యత్ తరం వారు సాయం కోసం వర్తమాన కాలానికి చెందిన వారిని కలవడం అనేది చాలా ఆసక్తి తెప్పించే అంశం. ఈ పాయింట్‌తో సినిమాను తెరకెక్కించిన డైరెక్టర్ క్రిస్ మెకే భారీ విజయం సాధించారు.
డాన్ ఫారెస్టర్ ఆర్మీ నుంచి వచ్చిన తర్వాత ఎలా భవిష్యత్ కాలంలో అడుగుపెట్టాడో చూపించిన విధానం బాగుంది. అక్కడ ఎలియన్స్ మీద రీసెర్చ్ చేస్తున్న ఆ యూనిట్‌లో డాన్ ఫారెస్టర్ ఎలా కీలకం అయ్యాడో చూపించిన తీరు ప్రేక్షకులను మెప్పిస్తుంది. అప్పటికే చాలామంది ఏలియన్స్ మరణించి ఉంటారు. అలాంటి సమయంలో ఎంట్రీ ఇచ్చిన డాన్ ఫారెస్టర్ యూనిట్ మీద ఏలియన్స్ ఎటాక్ చేస్తాయి. చాలా ఉత్కంఠతతో ఆ సీన్స్ ఉంటాయి.
ఈ క్రమంలో ఓ ఏలియన్‌ను డాన్ ఫారెస్టర్ యూనిట్ పట్టుకుంటుంది. ఆ సమయంలో ప్రతి ప్రేక్షకుడిని చూపుతిప్పనివ్వకుండా దర్శకుడు చిత్రీకరించాడు. సరిగ్గా ఈ సమయంలోనే మరో ఆర్మీ యూనిట్‌కు నాయకత్వం వహిస్తున్న మ్యూరి ఫారెస్టర్ తన కుమార్తె అని తెలుసుకుని డాన్ ఫారెస్టర్ చాలా సంతోషిస్తాడు. చాలా ఎమెషనల్‌గా కొన్ని సీన్లు వారి మధ్య ఉంటాయి. భవిష్యత్ కాలానికి వెళ్లి తన కుమార్తెను కలుసుకున్న ఒక తండ్రి కాన్సెప్ట్ అందరినీ మెప్పిస్తుంది. ఎలియన్స్‌ను అంతం చేయాలంటే దానితోనే వాటిని చంపాలని డాన్ ఫారెస్టర్ ఒక వ్యూహం వేస్తాడు.
వారి చేతికి చిక్కిన ఎలియన్ శరీరం నెంచి టాక్సిన్‌ను తయారు చేసి దానితోనే వాటిని అంతం చేయాలని స్కెచ్ వేస్తాడు. అయితే, వారి చేతికి చిక్కిన ఏలియన్‌ను కాపాడుకునేందుకు మిగిలిన ఏలియన్స్ చేసిన పోరాటంతో ప్లాన్ ఫెయిల్ అవుతుంది. అలాంటి సమయంలో డాన్ ఫారెస్టర్ వేసిన మరో అద్భుతమైన ప్లాన్ ఎంటి..? అనేది చాలా ఆసక్తిని పెంచుతుంది. యాక్షన్ చిత్రాలను ఆదరించేవారికి ఈ సినిమా మంచి థ్రిల్‌ను తప్పకుండా ఇస్తుంది.
ఎవరెలా చేశారంటే..?
డాన్ ఫారెస్టర్ పాత్రలో క్రిస్ ప్రాట్ అదరగొట్టేశాడు. ఆయన కూతురి పాత్రలో స్ట్రావోస్కీ కూడా మెప్పించింది. సిమన్స్, సామ్ రిచర్డ్‌సన్ వారి పాత్రలకు సరైన న్యాయం చేశారు. 'ది టుమారో వార్' చిత్రానికి ప్రధాన బలం విజువల్స్ అని చెప్పవచ్చు. ల్యారీ ఫాంగ్ సినిమాటోగ్రఫీ సినిమాను మరో రేంజ్‌కు చేర్చుతుంది. ఇలాంటి సినిమాలు బిగ్ స్క్రీన్ మీద చూస్తే ఆ మజానే వేరు అనేలా ఉంటుంది. ముఖ్యంగా యాక్షన్ సీన్స్‌లను ఎలివేట్ చేయడానికి అద్భుతమైన విఎఫెక్స్, క్వాలిటీ సీజిఐను ఉపయోగించడంతో ఈ సినిమా విజువల్ వండర్‌గా తెరకెక్కింది.
అయితే దర్శకుడు కథ చెప్పే తీరు కాస్త నెమ్మదిగా ఉంటుంది. ముఖ్చంగా తండ్రీ, కూతుళ్ల మధ్య వచ్చే సన్నివేశాలు కాస్త సాగదీతగా అనిపిస్తాయి. స్క్రీన్ ప్లే విషయంలో ఇంకాస్త బలంగా ఉండాల్సింది. ఫైనల్‌గా ‘ది టుమారో వార్’ అద్భుతాన్ని చూడాల్సిందే. అమెజాన్ ప్రైమ్‌లో తెలుగులో కూడా అందుబాటులో ఉంది.
Comments
Please login to add a commentAdd a comment