Mirzapur 3: ‘మీర్జాపూర్‌ 3’ వెబ్‌సిరీస్‌ రివ్యూ | Mirzapur Season 3 Web Series Telugu Review | Sakshi
Sakshi News home page

Mirzapur 3: ‘మీర్జాపూర్‌ 3’ వెబ్‌సిరీస్‌ రివ్యూ

Published Fri, Jul 5 2024 11:14 AM | Last Updated on Mon, Jul 8 2024 5:27 PM

Mirzapur Season 3 Web Series Telugu  Review

మీర్జాపూర్‌.. ఓటీటీల్లో  సూపర్ హిట్ అయిన క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్‌ల లిస్ట్‌లో టాప్‌లో ఉంటుంది. 2018లో తొలి సీజన్‌తో మిర్జాపూర్‌ ప్రపంచాన్ని ప్రేక్షకులకు పరిచయం చేశారు. ఆ తర్వాత  2020లో రెండో సీజన్‌తో ప్రేక్షకుల అంచనాలకు మించి హిట్‌ కొట్టారు. ఇప్పుడు మీర్జాపూర్‌ సీజన్‌-3 ద్వారా ఓటీటీలో తమ సత్తా చూపించారు. క్రైమ్‌ యాక్షన్‌ జానర్‌లో వచ్చిన ఈ సిరీస్‌లు యూత్‌ ఆడియన్స్‌కు బాగా దగ్గరయ్యాయి. ఈ కథ మొత్తం ప్రధానంగా కొన్ని పాత్రల చుట్టే తిరుగుతుంది. కాలీన్‌భయ్యా (పంకజ్ త్రిపాఠి), గుడ్డు పండిత్‌ ( అలీ ఫజల్‌) బబ్లూ పండిత్‌ (విక్రాంత్ మాస్సే), మున్నా భాయ్‌ (దివ్యేందు) గోలు (శ్వేతా త్రిపాఠి), బీనా త్రిపాఠి (రసిక దుగల్) భరత్‌ త్యాగి (విజయ్‌ వర్మ) పేర్లతోనే ఎక్కువ పాపులర్‌ కావడం కాకుండా మీర్జాపూర్‌లో మెప్పించారు.

మీర్జాపూర్‌ వెబ్‌సిరీస్‌.. మొదటి రెండు సీజన్లు ఓటీటీ ప్రేక్షకులను ఎంతగానో అలరించాయి. భారీ క్రైమ్‌ యాక్షన్‌ జానర్‌లో వచ్చిన ఈ సిరీస్‌ ముఖ్యంగా యువతను విశేషంగా అలరించాయి. అందుకే ఈ సీరిస్ నుంచి మిలియన్ల కొద్ది మీమ్స్‌ వైరల్‌ అయ్యాయి. సీజన్‌-3 కోసం నాలుగేళ్లుగా ఎదురుచూస్తున్న ప్రేక్షకుల నిరీక్షణకు ఫుల్‌స్టాప్‌ పడింది. నేడు (జులై 5) నుంచి మిర్జాపూర్‌-3 అమెజాన్‌ ప్రైమ్‌లో స్ట్రీమింగ్‌ అవుతుంది. గుర్మీత్ సింగ్, ఆనంద్ అయ్యర్ దర్శకత్వం వహించారు.

మీర్జాపూర్‌ మొదటి సీజన్లో గుడ్డూ భయ్యా (అలీ ఫజల్),బబ్లూ పండిత్‌ (విక్రాంత్ మాస్సే) అనే  ఇద్దరు అన్నదమ్ములు కాలీన్ భయ్యా కోసం పనిచేయడం. ఆ సీజన్‌ చివర్లో కాలీన్ భయ్యా కుమారుడు మున్నా చేతిలో గుడ్డూ భయ్యా తన సోదరుడితో పాటు సన్నిహితులను కోల్పోతాడు. దానికి రెండో సీజన్లో గుడ్డూ భయ్యా రివేంజ్ తీర్చుకుంటాడు. సీజన్‌ చివరకు మీర్జాపూర్ గద్దెపై ఎలా కూర్చుంటాడన్నది చూపించారు. ఈ క్రమంలో కాలీన్, మున్నా భయ్యాలపై దాడి చేసి మున్నాను గుడ్డు చంపేస్తాడు. కానీ, కాలీన్ భయ్యా మాత్రం తప్పించుకొని వెళ్లిపోవడం చూపించారు. సరిగ్గా అక్కడి నుంచే సీజన్‌- 3 ప్రారంభం అవుతుంది.

సీజన్‌-3 కథ ఏంటి..?
సీజన్‌-3 మున్నా భయ్యా అంత్యక్రియలతో ప్రారంభం అవుతుంది. మున్నా సతీమణి మాధురి (ఇషా తల్వార్‌) ముఖ్యమంత్రిగా ఉండటంతో ఆమెను శరద్ శుక్లా కలుస్తాడు. మీర్జాపూర్‌ను తిరిగి దక్కించుకునేందుకు ఒకరికొకరం సాయంగా ఉండాలని కోరుతాడు. కానీ, కాలీన్‌ భయ్యాను కాపాడిన సంగతి ఆమెకు చెప్పకుండా అక్కడి నుంచి వెళ్లిపోతాడు. కాలిన్ భార్య బీనా త్రిపాఠి (రషిక దుగల్) అండతో మీర్జాపూర్‌కు కొత్త డాన్‌గా గుడ్డు భయ్యా అవుతాడు. గోలు (శ్వేతా త్రిపాఠి) అతడికి లెఫ్ట్ అండ్ రైట్ సపోర్టర్‌గా ఉంటుంది. గుడ్డు భయ్యా మిర్జాపూర్ సింహాసనంపై కూర్చున్నప్పటికీ పూర్వాంచల్‌లో అధికార పోరు కొనసాగుతోంది. 

కాలీన్‌ భయ్యాను కాపాడిన శరద్ శుక్లా, శతృఘ్న కూడా మీర్జాపూర్‌ సింహాసనంపై దృష్టి సారిస్తారు. దీంతో శరద్ శుక్లా , గుడ్డు భయ్యా మధ్య నేరుగా ఘర్షణ జరుగుతుంది. అలా కాలీన్ భయ్యా లేకుండానే మొదటి నాలుగు ఎపిసోడ్‌లు పూర్తి అవుతాయి. ఈ అధికార పోరు మధ్య, SSP మరణానికి సంబంధించి పండిట్ జీ ఆరోపణలను ఎదుర్కోవడంతో, ఒక రాజకీయ ఆట సాగుతుంది.

మరోవైపు ముఖ్యమంత్రి మాధురీ యాదవ్ కూడా శరద్ శుక్లాతో పాటు దద్దా త్యాగి (లిల్లిపుట్ ఫరూఖీ),  అతని కుమారుడు (విజయ్ వర్మ) నుంచి మద్దతు తీసుకుంటుంది. ఇలా వీరందరూ గుడ్డు భయ్యాను  బలహీనపరచేందుకు పెద్ద ఎత్తున ప్లాన్స్‌ వేస్తుంటారు. జైలులో ఉన్న గుడ్డు పండిట్ తండ్రి రమాకాంత్ పండిట్ జీవితం ఎన్నో పాఠాలు నేర్పుతుంది. కొత్త శత్రుత్వాలు, స్నేహాల ఆవిర్భావంతో, కాలీన్ భయ్యా పునర్జన్మను పొందుతారు. మిర్జాపూర్ సింహాసనం కోసం కొత్త, చివరి సరైన వారసుడి కోసం పెద్ద ఎత్తున పోరాటం జరుగుతుంది. 

బీనా త్రిపాఠి బిడ్డకు అసలు తండ్రి ఎవరనే అనుమానం ఇప్పటికీ రన్‌ అవుతూనే ఉంది. దీనికి సంబంధించిన క్లూ సీజన్‌లో వెల్లడి అవుతుంది. చివరికి, కాలీన్ భయ్యాతో కోడలు మాధురి కలిసి కథకు నిజమైన ట్విస్ట్ జోడించి మొత్తం ఆటను మలుపు తిప్పుతుంది. మొత్తం 10 ఎపిసోడ్‌లలో మీరు ఊహించని విధంగా చివరి 15 నిమిషాల్లో అద్భుతమైన  క్లైమాక్స్‌ ఉంటుంది.   మీరు ఈ కథను ఉత్తరప్రదేశ్‌లోని ఇటీవలి రాజకీయాలకు కూడా అనుబంధించవచ్చు. "భయం లేని రాష్ట్రం" అనే పదే పదే వచ్చే థీమ్ మీకు యోగి ఆదిత్యనాథ్ పరిపాలనను గుర్తు చేస్తుంది. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్‌లో అతిక్ అహ్మద్ మరణం తర్వాత గ్యాంగ్‌స్టర్లలో చట్టాన్ని అమలు చేయడం పట్ల భయం కూడా చిత్రీకరించబడింది. రాజకీయ ఫిరాయింపులు కూడా కనిపిస్తున్నాయి. ఈ అంశాలన్నీ ఈ సీజన్‌ని ఇటీవలి ఈవెంట్‌లకు సంబంధించినవిగా చేస్తాయి.

గుడ్డు భయ్యా, గోలు ఇద్దరూ  మీర్జాపూర్‌ను తమ గుప్పిట్లో ఉంచుకోగలిగారా..? గుడ్డు భయ్యాకు ప్రధాన శత్రువు ఎవరు..? జైలుకు ఎందుకు వెళ్తాడు..? మీర్జాపూర్‌ పీఠం దక్కిన సమయంలో వారికి ఎదురైన సవాళ్లు ఏంటి..?  మీర్జాపూర్ పీఠం కోసం ఎంతమంది పోరాటం చేస్తున్నారు..? కాలీన్‌ భయ్యా భార్య బీనా నిజంగానే గుడ్డు, గోలుకు అండగా నిలిచిందా..? పూర్వాంచల్ పవర్ కోసం ఎటువంటి రక్తపాతం జరిగింది..? గుడ్డు షూట్ చేశాక కాలిన్ ఎలా తిరిగొచ్చాడు..? మీర్జాపూర్ గద్దెను కూల్చేయాలనే ముఖ్యమంత్రి మాధురి (ఇషా తల్వార్) లక్ష్యం నెరవేరిందా..? ఇలా ఎన్నో ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే సీజన్ 3 చూడాల్సిందే. ముఖ్యంగా చివరి 15 నిమిషాలు అందరినీ మెప్పిస్తుంది.

సిరీస్ ఎలా ఉంది..?
'మీర్జాపూర్'కి ప్రత్యేకమైన ఫ్యాన్స్‌ ఉన్నారు, నాలుగేళ్లుగా ఈ సీజన్ కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూశారు. అయితే, ఈ సీజన్ గత వాటితో పోలిస్తే అంతగా మెప్పించకపోవచ్చు. ముఖ్యంగా  మున్నా భయ్యా లేకపోవడం, ఆపై కథలో  కాలీన్ భయ్యాకు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వకపోవడమే ఈ సీజన్‌కు బిగ్‌ మైనస్‌ అని చెప్పవచ్చు. సీజన్‌ మొత్తం చాలా నెమ్మదిగా కొనసాగుతుంది.  మూడవ ఎపిసోడ్ వరకు కథలో వేగం కనిపించదు. కథ బలహీనంగా ఉండటమే కాకుండా ప్రధాన పాత్రల నుంచి వచ్చే సీన్లు ప్రేక్షకుల అంచనాలకు దగ్గరగా కనిపిస్తాయి. 

కానీ, మీర్జాపూర్‌ అభిమానులకు మాత్రం తప్పకుండా నచ్చుతుంది. గత సీజన్లను పోల్చుకుంటూ చూస్తే మాత్రం కాస్త కష్టం. మీర్జాపూర్‌ అంటేనే వయలెన్స్‌, సీరిస్‌కు అదే ప్రధాన బలం. కానీ, ఈ సీజన్‌లో హింసను చాలా వరకు తగ్గించారు. పొలిటికల్‌ డ్రామాను ఎక్కువగా చూపించారు. ఫిమేల్ పాత్రలకు భారీగా ప్రాధాన్యత ఇచ్చారు. ఇందులోని ప్రతి ఎపిసోడ్‌ సుమారు 45 నుంచి 50 నిమిషాల పాటు ఉంటుంది. దీంతో సీన్లు సాగదీసినట్లు అనిపిస్తాయి. కథలో  నెక్స్ట్ ఏంటి..? అనే క్యూరియాసిటీ ఫ్యాక్టర్ కనిపించలేదు. ఇందులోని స్క్రీన్ ప్లే కూడా చాలా సీన్స్‌లలో ప్రేక్షకుల ఊహకు అనుగుణంగానే ఉంటాయి.

ఎవరెలా చేశారంటే..?
గుడ్డు భయ్యా పాత్రలో అలీ ఫజల్ చక్కటి నటన కనబరిచారు. ఈ సీజన్‌ మొత్తం తన తన భుజాలపై మోశారు. కానీ, ఒక్కడిపై భారం అంతా పడటంతో షో రన్ చేయడం కష్టమైంది. గోలు పాత్రలో శ్వేతా త్రిపాఠి ఎక్కడా నిరుత్సాహపరచదు. ఇందులో ఆమె పాత్ర అందరినీ మెప్పిస్తుంది. అంజుమ్ శర్మ సైతం తమ పాత్రల్లో ఒదిగిపోయారు. బీనా త్రిపాఠి పాత్రకు రషిక దుగల్ మరోసారి ప్రాణం పోశారు. ఆమె పాత్ర అండర్ రైట్‌గా అనిపిస్తుంది. సీఎంగా ఇషా తల్వార్ నటన బావుంది. 

అందరి కంటే విజయ్ వర్మ ఎక్కువ ఆకట్టుకున్నారు. పంకజ్ త్రిపాఠి కనిపించేది కొన్ని సన్నివేశాలు అయినా సరే తన మార్క్ చూపించారు. గుర్మీత్ సింగ్, ఆనంద్ అయ్యర్ ఈ సిరీస్‌ను అనుకున్నంత స్థాయిలో తెరకెక్కించారు. కానీ, అంచనాలు ఎక్కువగా ఉండటం వల్ల కాస్త రెస్పాన్స్‌ తగ్గే అవకాశం ఉంది. 'మీర్జాపూర్ సీజన్ -3' చూడదగినది.  మునుపటి సీజన్‌ల మాదిరి మెప్పంచకపోవచ్చు కానీ, మీరు ఈ సిరీస్‌కి అభిమాని అయితే, మీరు దీన్ని మిస్ చేయకండి.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement