‘‘గామి’ సినిమా షూటింగ్‌ని వారణాసిలోని కుంభమేళాలో జరిపినప్పుడు నేను నిజమైన అఘోరా అనుకొని కొందరు ధర్మం చేశారు. అక్కడ చలికి వణుకుతూ ఓ మూలన కూర్చున్నప్పుడు ఓ వృద్ధురాలు భోజనం పెట్టి, టీ ఇచ్చింది. ‘గామి’ ట్రైలర్ అత్యద్భుతంగా ఉంది. ఈ చిత్రం ప్రేక్షకులకు మునుపెన్నడూ కలిగించని సరికొత్త అనుభూతిని పంచుతుందనే నమ్మకం ఉంది’’ అని విశ్వక్ సేన్ అన్నారు. ఆయన హీరోగా విద్యాధర్ కాగిత దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘గామి’. చాందినీ చౌదరి కథానాయిక.
వి సెల్యులాయిడ్ సమర్పణలో కార్తీక్ శబరీష్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని మార్చి 8న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. విశ్వక్ సేన్ మాట్లాడుతూ– ‘‘గామి’ కోసం దాదాపు నాలుగున్నరేళ్లు పని చేశాం. ఇంత సమయం పట్టింది కాబట్టే మంచి గ్రాఫిక్స్‌ని రాబట్టుకున్నాం’’ అన్నారు. ‘‘మానవ స్పర్శ లేని జీవితాన్ని ఊహించలేం. అలాంటి సమస్య ఎదుర్కొంటున్న అఘోరా శంకర్ (విశ్వక్ సేన్) హిమాలయాల్లో చేసే సాహసోపేత ప్రయాణమే ఈ చిత్రం. ఈ సినిమా కోసం వారణాసిలో కుంభమేళా షూటింగ్ చేశాం. మైనస్ 40 డిగ్రీల్లో కూడా గ్లౌజులు లేకుండా నటించాడు విశ్వక్’’ అన్నారు విద్యాధర్ కాగిత. ‘‘2018లో ‘గామి’ మొదలుపెట్టాం. క్రౌడ్ ఫండ్ మోడల్‌లో చేశాం’’ అన్నారు కార్తీక్ శబరీష్.
∙విశ్వక్ సేన్,
చాందినీ చౌదరి
Comments
Please login to add a commentAdd a comment