‘‘రామ్‌కు తమిళ భాష తెలియదనుకున్నాను. అయితే ఆయన ఇక్కడ పక్కా తమిళంలో మాట్లాడడం చూసి ఆశ్చర్యపోయాను. కొన్ని రోజుల క్రితం దర్శకుడు లింగుసామి ‘ది వారియర్’ ఆడియో ఫంక్షన్‌లో పాల్గొనాల్సిందిగా కోరారు. అయితే అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయన్నాను. అవి పూర్తయ్యాకే చేద్దాం అని చెప్పి, 21న జరగాల్సిన ఈ కార్యక్రమాన్ని 22కి మార్చారు’’ అని తమిళనాడు ఎమ్మెల్యే, నటుడు ఉదయనిధి స్టాలిన్ అన్నారు.
రామ్ హీరోగా నటిస్తున్న తొలి ద్విభాషా చిత్రం (తెలుగు, తమిళం) ‘ది వారియర్’లోని ‘బుల్లెట్..’ పాట ఆవిష్కరణ కార్యక్రమం శుక్రవారం చెన్నైలో జరిగింది. పవన్‌కుమార్ సమర్పణలో శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్న చిత్రం ఇది. లింగుసామి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం జూలై 14న విడుదలకు సిద్ధమవుతోంది. కాగా, దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించిన ఈ చిత్రంలోని ‘బుల్లెట్...’ అనే పాటను తమిళ హీరో శింబు తెలుగు, తమిళ భాషల్లో పాడటం విశేషం.
ఈ పాట ఆవిష్కరణ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఉదయనిధి స్టాలిన్ ఆడియోను ఆవిష్కరించి, మాట్లాడుతూ– ‘‘లింగుసామి దర్శకత్వంలో ఇంతకు ముందు నేనో సినిమా చేయాల్సింది. త్వరలో చేయనున్నాను. ఇక రామ్ నటించిన ‘ది వారియర్’ ఆయన ఇంతకు ముందు నటించిన విజయవంతమైన చిత్రాల్లో ఒకటిగా నిలిచిపోవాలని కోరుకుంటున్నాను’’ అన్నారు. రామ్ మాట్లాడుతూ– ‘‘లింగుసామి ప్రతి సన్నివేశాన్ని ఎంతో కేర్ తీసుకుని రూపొందించారు.
ఆయన ఈ కథ చెప్పినప్పుడే ఇందులో విలన్‌గా నటుడు ఆది పినిశెట్టి నటిస్తున్నట్లు చెప్పడంతో నేను చాలా హ్యాపీ ఫీలయ్యాను. దేవిశ్రీప్రసాద్ అద్భుతమైన సంగీతం ఇచ్చారు’’ అన్నారు. ‘‘ఒక్క ‘బుల్లెట్..’ పాట కోసమే నిర్మాత మూడు కోట్లు ఖర్చుపెట్టారు’’ అన్నారు లింగుసామి. దేవిశ్రీప్రసాద్ మాట్లాడుతూ– ‘‘లింగుసామితో సినిమా చేయాలనే ఆకాంక్ష ఈ ద్విభాషా చిత్రంతో నెరవేరింది. ‘బుల్లెట్..’ పాట పాడిన శింబుకు థ్యాంక్స్’’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment