దమ్మారో దమ్.. పాటను ఆస్వాదించిన వాళ్లంతా జీనత్ అమాన్ అభినయ మాయలో పడిపోయినవాళ్లే! హిందీ తారే అయినా అన్ని భాషల ప్రేక్షకులూ ఆమెను ఆరాధించారు.. అభిమాన మత్తులో తూలిపోయారు! తెర మీది ఆ వెలుగు జీనత్ జీవితాన్ని జన్నత్ (స్వర్గం)గా మార్చలేదు లవ్ లైఫ్‌ను నీడలా వెంటాడింది... అవమానాలు, చేదు అనుభవాలను మిగిల్చింది.. ఈ కథలో ఆమె ప్రేమించిన హీరో.. ఆమెకు విషాదాన్ని పంచిన విలన్ సంజయ్ ఖాన్!!
జర్నలిస్ట్, మోడల్‌గా ఉన్న జీనత్ అమాన్ 1970లో ‘హల్‌చల్’తో నటిగా పరిచయం అయినా ‘హరే రామ హరే కృష్ణ’తోనే స్టార్‌డమ్ తెచ్చుకుంది. గ్లామర్‌కు గ్రామర్ నేర్పింది.. నటనను జోడించింది. 1977లో ‘అబ్దుల్లా’ సినిమా అవకాశంతో జీనత్ జీవితంలోకి ప్రవేశించాడు సంజయ్ ఖాన్. కథానాయకుడిగా సూపర్ హిట్స్ కన్నా ప్రముఖ హీరో ఫిరోజ్ ఖాన్ తమ్ముడిగానే గుర్తింపు అతనికి. ఆర్టిస్ట్‌గా కన్నా అందగాడిగానే ఫాలోయింగ్ ఎక్కువ. అతను హీరోగా నిలదొక్కుకుంటున్న నాటికే జీనత్ అత్యధిక పారితోషికం పొందుతున్న మేటి కథానాయిక. ఆమె అందం సంజయ్‌ఖాన్‌ను కలవరపెట్టింది. నిద్రలేకుండా చేసింది. చెప్పొద్దూ.. జీనత్‌కూ సంజయ్ ఖాన్ అంటే ఇష్టం మొదలైంది. కుర్రకారంతా ఆమె పేరు జపిస్తుంటే ఆమె సంజయ్ కోసం తపించింది. ‘అబ్దుల్లా’ లో హీరోయిన్‌గా చేయాలని సంజయ్ కోరగానే మారుమాట లేకుండా ఒప్పేసుకుంది. ఆ సినిమాకు పెట్టుబడీ పెట్టింది.‘అబ్దుల్లా’ షూటింగ్‌తోపాటే జీనత్, సంజయ్‌ల ప్రేమ కథా ప్రారంభమైంది.
చిత్రీకరణ కోసం జైసల్మేర్ వెళ్లారు. అక్కడి ఇసుకతిన్నెలన్నీ వీళ్ల బాసలకు సాక్ష్యాలయ్యాయి. ఒకరిని విడిచి ఒకరు ఉండలేని పరిస్థితి వచ్చింది. మీడియా ద్వారా ఈ జంట అఫైర్ తెలుసుకున్న జీనత్ స్నేహితులు, శ్రేయోభిలాషులు ఆమెను హెచ్చరించారు. కారణం.. అతను అప్పటికే ముగ్గురు పిల్లల తండ్రి, ముక్కోపి కావడం. ‘కోపంలో ఉన్నప్పుడు సంజయ్ విచక్షణ కోల్పోతాడు. అతనివల్ల నీకు సమస్యలే కాని సంతోషం ఉండదు’ అని ఆమె పాత్రికేయ మిత్రులూ చెప్పారు. జీనత్ వినిపించుకోలేదు. అతని ప్రేమలో పిచ్చిదైంది. జైసల్మేర్‌లో.. వాళ్లు బస చేస్తున్న హోటల్లోనే ఆమెను నిఖా చేసుకున్నాడు సంజయ్ ఖాన్. ఆ రోజు గుండెనిండా ఊపిరి తీసుకుంది జీనత్. తన ఆప్తులకు ఫోన్ చేసి చెప్పింది.. ‘మీరు సంజయ్‌ను అనవసరంగా అనుమానించారు నన్ను నిఖా చేసుకున్నాడు’ అని. విన్న మిత్రులు ఏడ్వలేక నవ్వారు. అబ్దుల్లా షూటింగ్ అయిపోయింది. అందమైన జ్ఞాపకాలను మూటగట్టుకొని జీనత్ ముంబై వచ్చేసింది.
లెక్కచేయలేదు.. పెడచెవినా పెట్టలేదు
ఆ జంట ముంబైలో ల్యాండ్ అయ్యేలోపే వాళ్ల పెళ్లి వార్త బాలీవుడ్‌లో షికారు మొదలెట్టేసింది. సంజయ్ ఖాన్ భార్య జరీనానూ చేరింది. జీనత్‌తో తెగతెంపులు చేసుకోకపోతే పిల్లలను తీసుకొని ఇల్లు వదిలివెళ్లిపోతానని భర్తను బెదిరించింది జరీనా. ఆ మాటను అతను లెక్కచేయలేదు. అలాగని పెడచెవినా పెట్టలేదు. ఇటు జీనత్ నుంచీ ఒత్తిడి పెరిగింది. తమ నిఖాను బహిర్గతం చేయమని. జీనత్ అడిగింది చేయకపోగా ఆమెను వేధించడం మొదలుపెట్టాడు సంజయ్‌ఖాన్. ప్రతిసారి ఆమె పనిచేస్తున్న సినిమాల నిర్మాతదర్శకులు, పారిశ్రామిక వేత్తలతో సన్నిహితంగా ప్రవర్తిస్తున్నావంటూ ఆమెను దుర్భాషలాడ్డం.. జీనత్ ఎదురుతిరిగితే చేయిచేసుకోవడం.. ఆ ప్రేమలో సాధారణమైంది. ఈ సంగతి తెలిసిన జీతన్ ఫ్రెండ్స్ సంజయ్ మీద పోలీస్ కంప్లయింట్ ఇవ్వమని చెప్పారట. ‘నేను అతణ్ణి ప్రేమిస్తున్నాను.. కాబట్టి సహిస్తాను’ అంటూ ఆమె ఘాటుగా సమాధానమివ్వడంతో మిన్నకుండిపోయారట వాళ్లు.
ఒకరోజు..
షెడ్యూల్ ప్రకారం షూటింగ్‌కి లోనావాలా వెళ్లింది జీనత్. అక్కడికి ఫోన్ చేశాడు సంజయ్ ‘అబ్దుల్లా కోసం ఓ పాటను రీషూట్ చేయాలి.. వెంటనే వచ్చేయ్’ అంటూ. హతాశురాలైన జీనత్ ‘అబ్దుల్లా పూర్తయిన తర్వాతే కదా ఈ సినిమా ఒప్పుకుంది. ఇప్పుడు సడెన్‌గా డేట్స్ కావాలంటే ఎట్లా?’ అని ఆందోళనగానే అడిగిందట. అంతే మళ్లీ ఆమె శీలాన్ని కించపరిచేలా మాట్లాడి ఫోన్ పెట్టేసేడట అతను. తట్టుకోలేకపోయిన జీనత్ తన డేట్స్ గురించి వివరణ ఇచ్చేందుకు అప్పటికప్పుడే కారులో ముంబైకి బయలుదేరింది. తను ముంబై చేరుకునేటప్పటికి సంజయ్ హోటల్ తాజ్‌లో పార్టీలో ఉన్నాడని తెలిసేసరికి హోటల్ తాజ్‌కు వెళ్లింది జీనత్. అక్కడ జీనత్‌ను చూసిన సంజయ్ వెర్రి ఆవేశంతో ఆమె రెక్క పుచ్చుకొని పక్క గదిలోకి లాక్కెళ్లి చెంప మీద కొట్టాడట.
ఆ విసురుకి జీనత్ కిందపడిపోతే ఆమె జుట్టు పట్టుకొని పైకి లేపి మళ్లీ కొట్టాడట. ‘నేను నా డేట్స్ గురించే మాట్లాడ్డానికి వచ్చాను’ అని ఆమె చెబుతున్నా వినకుండా. ఆ దెబ్బలకు తట్టుకోలేక జీనత్ అరిచేసరికి పార్టీలోని వాళ్లంతా చుట్టూ చేరి చోద్యం చూశారట కాని ఎవరూ సంజయ్‌ను ఆపలేదట. ఆ పార్టీలో సంజయ్ భార్య కూడా ఉందని చెప్తారు. తన ఆవేశం తగ్గేవరకు జీనత్‌ను కొడ్తునే ఉన్నాడట సంజయ్. చివరకు పార్టీలో సర్వ్ చేస్తున్న ఓ బాయ్ అడ్డుపడి జీనత్‌ను పక్కకు తప్పించాడట. ఆ గాయాలకు జీనత్ దవడ ఎముక విరిగింది. కుడికన్ను చూపూ మందగించింది శాశ్వతంగా. ఆ సంఘటనతో సంజయ్ జీవితంలోంచి తప్పుకుంది జీనత్. మూడేళ్ల ఆ ప్రేమ హింసాత్మాకంగా ముగిసిపోయింది.
-ఎస్సార్
- ‘ది బెస్ట్ మిస్టేక్స్ ఆఫ్ మై లైఫ్’ అని సంజయ్ ఖాన్ ఆత్మకథ రాసుకున్నాడు. అందులో తన దుష్ప్రవర్తన తాలూకు పశ్చాత్తాపం కాదుకదా కనీసం జీనత్ జిక్రీ కూడా లేదు. పైగా తానొక విధేయతగల భర్తనని, తండ్రినని చెప్పుకున్నాడు. ఇది చాలా వివాదాస్పదమైంది కూడా.
- ‘సంజయ్‌ను నా ప్రాణంకంటే ఎక్కువ ఇష్టపడ్డా. అందుకే భరించా. అప్పుడు నా మనసు నా మెదడు అధీనంలో లేదు’ అంటుంది జీనత్ జీవంలేని నవ్వుతో.
Comments
Please login to add a commentAdd a comment