విచారణలో జాప్యం చేయొద్దు
భూపాలపల్లి: కేసుల విచారణలో జాప్యం వహిస్తే సహించేది లేదని ఎస్పీ కిరణ్ ఖరే అన్నారు. జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ మంగళవారం జిల్లాలోని పోలీస్ అఽధికారులతో క్రైమ్ సమీక్షా సమావేశం నిర్వహించి మాట్లాడారు. ప్రతీ కేసులో ‘క్వాలిటీ ఆఫ్ ఇన్వెస్టిగేషన్’ ద్వారా నేరస్తులకు శిక్షపడే విధంగా చేసి బాధితులకు న్యాయం చేకూర్చాలని సూచించారు. పోలీసు అధికారులంతా బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. పెట్రోలింగ్, బ్లూ కోర్ట్ వాహనాలతో అధికారులు, విజుబుల్ పోలీసింగ్ నిర్వహించాలన్నారు. ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు. మహిళలకు వ్యతిరేకంగా జరిగే నేరాలను అదుపుచేస్తూ, సత్వరమే స్పందించాలని, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పారు. జిల్లాలోని ప్రతి పోలీస్‌స్టేషన్ పరిధిలోని అన్ని ప్రదేశాలలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకునే విధంగా చర్యలు చేపట్టాలని తెలిపారు. దొంగతనం కేసుల్లో అధునాతన సాంకేతికతను ఉపయోగించి నేరస్తులను పట్టుకుని సొత్తును రికవరీ చేసి బాధితులకు త్వరితగతిన అందేలా చూడాలన్నారు. సైబర్ నేరాల బారిన పడకుండా ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని కోరారు. జిల్లావ్యాప్తంగా సైబర్ నేరాల్లో నగదును కోల్పోయి, బాధితులు వెంటనే స్పందించి ఫిర్యాదు చేసినప్పుడు తక్షణమే స్పందించి వారికి అండగా ఉండాలని సూచించారు. ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు జరిగే ప్రదేశాలను గుర్తించి(బ్లాక్ స్పాట్స్) వాటి నివారణకోసం సంబంధిత అధికారులతో సమన్వయం పాటిస్తూ ప్రమాద నివారణ చర్యలు చేపట్టాలని సూచించారు. పెండింగ్‌లో ఉన్న కేసుల సత్వర పరిష్కారానికి న్యాయాధికారులతో సమన్వయం పాటిస్తూ బాధితులకు న్యాయం చేకూరేలా పనిచేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ బోనాల కిషన్, డీఎస్పీలు సంపత్‌రావు, రామ్మోహన్‌రెడ్డి, వర్టికల్ డీఎస్పీ నారాయణనాయక్, జిల్లా పరిధిలోని సీఐలు, ఎస్‌ఐలు పాల్గొన్నారు.
ఎస్పీ కిరణ్ ఖరే
Comments
Please login to add a commentAdd a comment