రేపు పుష్పయాగం
బిజినేపల్లి: వట్టెం శ్రీవేంకటేశ్వరస్వామి దేవస్థానంలో మంగళవారం పుష్పయాగం నిర్వహించనున్నట్లు ఆలయ వ్యవస్థాపక సభ్యుడు సందడి ప్రతాప్‌రెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10 గంటలకు పుష్పయాగం ప్రారంభమవుతుందని.. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు.
బ్రాహ్మణుల
సంక్షేమానికి కృషి
తాడూరు: బ్రాహ్మణుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేష్‌రెడ్డి అన్నారు. మండలంలోని ఐతోల్‌లో ఆదివారం నిర్వహించిన బ్రాహ్మణ ఆత్మీయ సమ్మేళనంలో ఆయన పాల్గొని మాట్లాడారు. దేవుడికి, భక్తుడికి అనుసంధానంగా బ్రాహ్మణులు ఉంటారని.. వారి ఆశీర్వాదాలే తమకు రక్ష అని అన్నారు. బ్రాహ్మణుల సంక్షేమానికి ముందుండి పనిచేస్తానని తెలిపారు. అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు కేటాయించడంతో పాటు విదేశాల్లో పిల్లల చదువు కోసం విదేశీ విద్యా పథకం అందేలా చూస్తానన్నారు. అందరి ఆశీస్సులతో ప్రజలకు సేవ చేస్తున్నట్లు తెలిపారు. ప్రతి ఒక్కరూ సేవాభావంతో ముందుకెళ్లాలని కోరారు. అనంతరం తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ బ్రాహ్మణులు ఎమ్మెల్యేకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా చిన్నారులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. ఆలయ ఫౌండర్ రాంరెడ్డి, పూజారి అక్షయ హరికృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించిన బ్రాహ్మణ ఆత్మీయ సమ్మేళనంలో రాజశేఖర్‌రావు, మురళి, బాలకిషన్‌రావు, వెంకటరమణ, శ్యాంసుందర్‌రావు, రఘునాథ్‌రావు, గ్రామస్తులు నర్సింహారెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు.
రైతు, కార్మిక వ్యతిరేక విధానాలను ఎండగడదాం
కల్వకుర్తిరూరల్: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు, కార్మిక వ్యతిరేక విధానాలను ఎండగడదామని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు ఆంజనేయులు పిలుపునిచ్చారు. ఆదివారం పట్టణంలోని సీఐటీయూ కార్యాలయంలో ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నాలుగు లేబర్ కోడ్‌లను రద్దు చేయడంతో పాటు కాంట్రాక్ట్ విధానాన్ని నిషేధించాలని డిమాండ్ చేశారు. ఉపాధి హామీ పథకాన్ని 200 రోజులు అమలుపరిచి.. కూలీలకు కనీస వేతనం రూ. 600 చెల్లించాలని, పట్టణ ప్రాంతాల్లోనూ పేదలకు ఉపాధి హామీ పనులు కల్పించాలన్నారు. భూసేకరణ చట్టం–2013ను అమలు చేయడంతో పాటు అటవీ హక్కుల చట్టం–2006ను పటిష్టంగా అమలు చేయాలని తెలిపారు. మతాల మధ్య విభజన ఆపి, రాజ్యాంగంలో ఉన్న లౌకిక సంప్రదాయాలను కాపాడాలని ఆయన డిమాండ్ చేశారు. కేంద్రం అనుసరిస్తున్న విధానాలను నిరసిస్తూ ఈ నెల 26న చేపట్టే కార్యక్రమాలకు రైతులు, కార్మికులు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు. సమావేశంలో కిషోర్, బాల్‌రెడ్డి, సి.ఆంజనేయులు, శ్రీనివాసులు, పరుశరాములు ఉన్నారు.
నేటినుంచి రాష్ట్రస్థాయి ఫుట్‌బాల్ టోర్నీ
జడ్చర్ల టౌన్: పట్టణంలోని మినీ స్టేడియం, బాదేపల్లి హైస్కూల్ మైదానాల్లో సోమవారం నుంచి ఎస్‌జీఎఫ్ అండర్–19 బాలుర, బాలికల రాష్ట్రస్థాయి ఫుట్‌బాల్ టోర్నీ నిర్వహించనున్నారు. ఇందులో రాష్ట్రంలోని ఉమ్మడి 10 జిల్లాల నుంచి బాలుర, బాలికలు 10 జట్ల చొప్పున 20 జట్లు పాల్గొననున్నాయి. బాదేపల్లి జెడ్పీ హైస్కూల్ గ్రౌండ్‌లో బాలికలకు, మినీ స్టేడియం మైదానంలో బాలుర పోటీలు జరగనున్నాయి. ఈ మేరకు ఎస్‌జీఎఫ్ ఆధ్వర్యంలో ఏర్పాట్లు పూర్తిచేశారు. టోర్నీని ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి, శాట్ చైర్మన్ శివసేనారెడ్డి ప్రారంభించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment