
నల్గొండ: ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కొందరు నాయకులు ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా విజయం సాధించి పదవులకు వన్నె తెచ్చారు. ఏ పదవిలో ఉన్నా తమను ఎన్నుకున్న ప్రజలకు సేవే లక్ష్యంగా ముందుకు సాగారు. కొందరు నాయకులు ముందు ఎమ్మెల్యేగా, ఆ తర్వాత ఎంపీలుగా గెలిచారు. మరికొందరు ముందు ఎంపీగా, ఆ తర్వాత ఎమ్మెల్యేలుగా, ఎమ్మెల్సీలుగా విజయం సాధించారు. రావి నారాయణరెడ్డి మాత్రం తొలి ఎన్నికల్లోనే ఎంపీగా, ఎమ్మెల్యేగా విజయం సాధించి రికార్డు సృష్టించారు
రావి నారాయణరెడ్డి : 1952 ఎన్నికల్లో పీడీఎఫ్ తరఫున భువనగిరి ఆసెంబ్లీ, నల్లగొండ పార్లమెంట్ స్థానం నుంచి రావి నారాయణరెడ్డి రెండు చోట్ల విజయం సాధించారు. ఆ వెంటనే భువనగిరి ఆసెంబ్లీ స్థానానికి రాజీనామా చేసి ఎంపీగా కొనసాగారు. అనంతరం 1957లో భువనగిరి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 1962లో మరోసారి నల్లగొండ ఎంపీగా గెలుపొందారు. మొదటిసారి ఎంపీగా గెలిచినప్పుడు దేశంలో అత్యధిక మెజార్టీ సాధించడంతో అప్పటి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ రావి నారాయణరెడ్డికి ప్రత్యేకంగా స్వాగతం పలికారు. పార్లమెంట్ నూతన భవనాన్ని రావినారాయణరెడ్డి చేత ప్రారంభించారు.
బొమ్మగాని ధర్మభిక్షం : సూర్యాపేట అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 1952లో ఎమ్మెల్యేగా గెలిచిన ధర్మభిక్షం, 1962లో నల్లగొండ నుంచి, 1967లో నకిరేకల్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అనంతరం 1991, 1996లో నల్లగొండ పార్లమెంట్ స్థానం నుంచి రెండు సార్లు ఎంపీగా గెలుపొందారు. పేదవర్గాల సంక్షేమం కోసం నిరంతరం పాటు పడే నాయకునిగా ఆయనకు జనం మదిలో నిలిచిపోయారు.
భీంరెడ్డి నర్సింహారెడ్డి : 1957లో సూర్యాపేట, 1967లో తుంగతుర్తి అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి గెలుపొందిన భీంరెడ్డి నర్సింహారెడ్డి.. 1984, 1991లో రెండు సార్లు మిర్యాలగూడ ఎంపీగా ఎన్నికయ్యారు. పీడిత ప్రజల సమస్యలు, భూపోరాటలతో ఆయన జీవితం ప్రజాసేవకే అంకితమైంది.
చకిలం శ్రీనివాసరావు : నల్లగొండ జిల్లా రాజకీయాల్లో మకుటం లేని మహారాజుగా వెలుగొందిన చకిలం శ్రీనివాసరావు 1967, 1972 నల్లగొండ నుంచి రెండు సార్లు, 1983లో మిర్యాలగూడెం నుంచి ఒకసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1989లో నల్లగొండ ఎంపీగా గెలుపొందారు.
ఎం.రఘుమారెడ్డి : టీడీపీ ఆవిర్భావంతో రాజకీయాల్లోకి వచ్చిన మల్‌రెడ్డి రఘుమారెడ్డి 1984లో నల్లగొండ ఎంపీగా గెలుపొందారు. అనంతరం 1989లో నల్లగొండ ఎమ్మెల్యేగా గెలిచారు. తెలుగుదేశం ప్రభంజనంలో గెలిచిన ఆయన ప్రజలకు చేరువయ్యారు.
రవీంద్రనాయక్ : గిరిజన నాయకుడు రవీంద్రనాయక్ 1978, 1983లో దేవరకొండ ఎమ్మెల్యేగా గెలిచారు. భవనం వెంకట్‌రామ్ మంత్రివర్గంలో మంత్రిగా పనిచేశారు. ఈయన కొంతకాలం క్రియాశీలక రాజకీయలకు దూరంగా ఉన్నారు. 2004లో వరంగల్ ఎంపీగా టీఆర్‌ఎస్ పార్టీ నుంచి గెలుపొందారు.
కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి : నల్లగొండ ఎమ్మెల్యేగా నాలుగు సార్లు విజయం సాధించిన కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయారు. దీంతో ఆ వెంటనే 2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో భువనగిరి పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేసి విజయం సా«ధించారు.
ఉత్తమ్‌కుమార్‌రెడ్డి : కోదాడ, హూజూర్‌నగర్‌ల నుంచి ఎమ్మెల్యేగా గెలుపొంది మంత్రిగా పనిచేసిన కెప్టెన్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి 2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో నల్లగొండ నుంచి ఎంపీగా విజయం సాధించారు.
పాల్వాయి గోవర్దన్‌రెడ్డి : మునుగోడు నియోజకవర్గం నుంచి ఐదు సార్లు 1967, 1972, 1978, 1983, 1999లో ఎమ్మెల్యేగా గెలిచిన పాల్వాయి గోవర్దన్‌రెడ్డి రాజ్యసభ సభ్యునిగా కూడా పనిచేశారు. 2009 ఎన్నికల్లో ఆయన మునుగోడు ఎమ్మెల్యేగా పోటీచేసి ఓడిపోయారు.
Comments
Please login to add a commentAdd a comment