భానుడి భగభగ
పలు ప్రాంతాల్లో ఆరెంజ్ అలర్ట్ జారీ
అత్యవసరమైతే తప్ప మధ్యాహ్నం బయటకు రావొద్దు
భానుడు భగభగా మండుతున్నాడు. నిప్పులు కక్కుతూ.. ప్రతాపం చూపిస్తున్నాడు. జనం ఉక్కపోతతో అల్లాడిపోతున్నారు. వడగాలులు వీస్తున్నాయి. ఎండలు మండుతుండడంతో వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్‌ను ప్రకటించింది. పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 41 నుంచి 44 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదయ్యాయి. ఈనెల 9 వరకు ఇదేపరిస్థితి కొనసాగుతుందని వాతావరణ శాఖ వెల్లడించింది. ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని, అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లరాదని సూచించింది.
తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండుతున్నాయి. పగటి ఉష్ణోగ్రతలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. కొన్ని చోట్ల ఉష్ణోగ్రతలు 44 డిగ్రీల సెల్సియస్‌కు చేరింది. ఉదయం 10 గంటలకే కర్ఫ్యూ వాతావరణం నెలకొంటోంది. ఎండలకు వడగాల్పులు తోడు కావడంతో ప్రజలు అల్లాడుతున్నారు. తెలంగాణలో అత్యధిక ఉష్ణోగ్రత నల్లగొండ జిల్లాలోనే నమోదైంది. 18 మండలాల్లోని 20 గ్రామాల్లో ఉష్ణోగ్రత 43 డిగ్రీలు దాటిపోయింది. అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలో ప్రజలు వడదెబ్బకు గురయ్యే ప్రమాదం ఉందని, జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా అధికారులు సూచిస్తున్నారు.
50 డిగ్రీలకు పెరిగే ప్రమాదం
రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతోపాటు జిల్లాలోని పలు ప్రాంతాల్లో పగటిపూట ఉష్ణోగ్రతలు మరింత పెరిగే ప్రమాదం ఉంది. ఈ మేరకు వాతావరణ శాఖ అధికారులు అంచనా వేసినట్లు వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కొండల్‌రావు పేర్కొన్నారు. ఇప్పటివరకు తీవ్రమైన వేడిగాలులకు సంబంధించి ముందు జాగ్రత్త చర్యలకు తీసుకోవాల్సిన అవసరం వెల్లడించారు.
అప్రమత్తమైన యంత్రాంగం
అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలో యంత్రాంగం అప్రమత్తమైంది. ప్రజలు తీవ్రమైన వేడిగాలుల వల్ల వడదెబ్బకు గురికాకుండా అవగాహన కల్పించాలని పలు చోట్ల కలెక్టర్‌లు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. వేసవిలో వచ్చే సంబంధిత వ్యాధులపై దృష్టి సారించాలని వైద్య ఆరోగ్య శాఖకు సూచించారు. వైద్య ఆరోగ్య శాఖ వేసవిలో అప్రమత్తంగా ఉండాలని, మున్సిపాలిటీలు, పంచాయతీల్లో నీటి ఎద్దడి లేకుండా చూసుకోవాలని స్పష్టం చేశారు.
టాస్క్‌ఫోర్స్ కమిటీ ఏర్పాటు
ప్రజలు వడదెబ్బ బారిన పడకుండా ఉండేందుకు, ఎప్పటికప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకునేందుకు జిల్లా స్థాయిలో టాస్క్‌పోర్స్ కమిటీలను ఏర్పాటు చేశారు. ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్న నేపథ్యంలో ప్రజలు వడదెబ్బకు గురికాకుండా పెద్ద ఎత్తున అవగాహన కల్పించే పనిలో పడ్డారు. సంక్షేమ హాస్టళ్లు ,పాఠశాల, కళాశాల విద్యార్థులలో వడదెబ్బ పై అవగాహన కల్పించాలని, పని ప్రదేశాల్లో కూలీలకు తాగు నీరు, నీడ వంటి మౌలిక సదుపాయాలు కల్పించాలని, ఉపాధి కూలీలు, ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద పనిచేసే వారి కోసం తాగునీరు నీడ ఏర్పాటు చేయాలని, మూగ జీవాల కోసం నీటి తొట్లు ఏర్పాటు చేయాలని ఆదేశాలిచ్చారు.
వడదెబ్బ లక్షణాలు
డీహైడ్రేషన్, వాంతులు, విరేచనాలు, శరీర ఉష్ణోగ్రతలు పెరగడం, చెమట పట్టకపోవడం, వణుకు పుట్టడం, మగత నిద్ర లేదా కలవరింత, ఫిట్స్ లేదా పాక్షికంగా అపస్మార స్థితికి వెళ్లడం వడదెబ్బ లక్షణాలు. వడదెబ్బ బారిన పడకుండా ప్రజలు తగ్గిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.
వడదెబ్బ తాకితే చేపట్టాల్సిన చర్యలు
వడదెబ్బ తాకిన వారిని వెంటనే నీడ కలిగిన చల్లని ప్రదేశానికి తరలించాలి. చల్లని నీటిలో ముంచిన తడిగుడ్డతో శరీరం తుడవాలి. ఫ్యాన్ గాలి, చల్లని గాలి తగిలేలా చూడాలి. ఉప్పు కలిపిన మజ్జిగ, గ్లూకోజ్ ద్రావణం తాగించాలి. వాంతులు, విరేచనాలు వంటివి సంభవించినా వైద్యులను సంప్రదించాలి. వడదెబ్బతో అపస్మారక స్థితిలోకి వెళ్లిన రోగికి నీరు తాగించవద్దు. వీలైనంత త్వరగా దగ్గరలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించి చికిత్స చేయించాలి.
తీసుకోవాల్సిన జాగ్రత్తలివీ..
- ఉదయం సాయంత్రం సమయాల్లోనే బయటకు వెళ్లాలి.
- బయటికి వెళ్లినప్పుడు తప్పనిసరిగా ఎండ వేడిమి తగలకుండా పలుచనైన, వదులుగా ఉండే వస్త్రాలు ధరించాలి.
- రోజుకు కనీసం 15 గ్లాసుల నీటిని తాగాలి.
- నీరు, పళ్ల రసాలు, కొబ్బరి నీరు, ద్రవ పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి.
- భోజనం మితంగా తీసుకోవాలి.
- మాంసాహారం తీసుకోవద్దు.
- ఇంటిని వీలైనంత మేర వీలైనన్ని మార్గాల్లో చల్లగా ఉంచుకోవాలి.
- చల్లని రంగు పానీయాలను తాగొద్దు
- రోడ్లపై ఉండే ఆహారం పడకపోవచ్చు
- మద్యం సేవించవద్దు
Comments
Please login to add a commentAdd a comment