పల్లె పోరుకు సన్నద్ధత
పంచాయతీ ఎన్నికలకు సిద్ధమవుతున్న యంత్రాంగం
పోలింగ్ బాక్సులూ వచ్చేశాయ్..
పంచాయతీ ఎన్నికలు మూడు విడతల్లో నిర్వహించాలని యంత్రాంగం నిర్ణయించింది. జిల్లాలో పాతవి 844 గ్రామ పంచాయతీలు ఉండగా అదనంగా 24 పెరిగాయి. దీంతో పంచాయతీల సంఖ్య 868కి చేరింది. వీటి పరిధిలో మూడు విడతల్లో నిర్వహించే ఎన్నికలకు 5,876 పోలింగ్ బాక్స్‌లు అవసరము ఉండగా జిల్లాలో 3,676 పోలింగ్ బాక్సులు సిద్ధంగా ఉన్నాయి. మిగతా 2.200 బాక్సులను ఏపీ నుంచి తెప్పించారు. ఎప్పుడు ఎన్నికలు ప్రకటించినా నిర్వహణకు సిద్ధంగా ఉన్నామని అధికారులు అంటున్నారు.
ఫ 25 లక్షల బ్యాలెట్ పేపర్ల ముద్రణ పూర్తి
ఫ ఏపీ నుంచి జిల్లాకు చేరిన పోలింగ్ బాక్సులు
ఫ కొనసాగుతున్న బ్యాలెట్ పేపర్ల పరిశీలన
నల్లగొండ: పంచాయతీ ఎన్నికలకు జిల్లా అధికార యంత్రాంగం సర్వం సిద్ధం చేస్తోంది. గ్రామ పంచాయతీల కాల పరిమితి గతేడాది ఫిబ్రవరిలో పూర్తయింది. అయితే మార్చిలో ఎంపీ ఎన్నికలు రావడంతో పంచాయతీ ఎన్నికల నిర్వహణలో జాప్యం జరిగింది. ఆ తర్వాత ఎన్నికలు నిర్వహిస్తామని ప్రభుత్వం ప్రకటించడంతో అధికారులు ముసాయిదా ఓటర్ల జాబితాను ప్రకటించారు. అనంతరం గ్రామాల్లో వార్డుల వారీగా ఓటర్ల జాబితాను కూడా సిద్ధం చేసి ఉంచారు.
సర్పంచ్ అభ్యర్థులకు బ్యాలెట్ గుర్తులు
జిల్లాలోని గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీచేసే సర్పంచ్ అభ్యర్థులు, వార్డు మెంబర్లకు గుర్తులను అధికారులు ఖరారు చేశారు. సర్పంచ్ అభ్యర్థులకు బ్యాలెట్ గుర్తులు బ్యాట్, బ్యాట్స్‌మెన్, స్టంప్స్, ఉంగరం, కత్తెర, ఫుట్‌బాల్, లేడీ పర్సు, టీవీ రిమోట్, టూత్‌పేస్ట్, పాన, చెత్తడబ్బా, బ్లాక్‌బోర్డు, బెండకాయ, కొబ్బరితోట, డైమండ్, బకెట్, డోర్ హ్యాండిల్, టీజల్లెడ, చేతికర్ర, మంచం, పలక, టేబుల్, బ్యాటరీ లైటు, బ్రష్, పడవ, బిస్కెట్, వేణువు, చైన్, చెప్పులు, గాలిబుడగ గుర్తులను కేటాయించారు.
వార్డు సభ్యులకు..
గౌన్, గ్యాస్‌స్టవ్, స్టూల్, సిలిండర్, బీరువా, ఈల, కుండ, డిష్‌యాంటీనా, గరాట, మూకుడు, ఐస్‌క్రీమ్, గాజుగ్లాస్, పోస్టుడబ్బా, కవర్, హాకీకర్ర, బంతి, నెట్, కటింగ్‌ప్లేయర్, బాక్సు, విద్యుత్ స్తంభం, కేతిరి గుర్తులను కేటాయించారు. అలాగే ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఎవరూ నచ్చకుంటే ఓటర్లు నోటాకు ఓటు వేసేలా ఏర్పాట్లు చేశారు. పోటీలో ఇద్దరు వ్యక్తులు ఉంటే మూడోదిగా నోటా గుర్తును ముద్రించి ఉంచారు.
వేర్వేరుగా బ్యాలెట్ పేపర్లు
పంచాయతీ ఎన్నికలు బ్యాలెట్ పద్ధతిన నిర్వహిస్తున్నందున జిల్లాలో 25 లక్షల బ్యాలెట్ పేపర్లు అవసరమని భావించిన అధికారులు ఇప్పటికే పేపర్లను ముద్రించారు. సర్పంచ్ అభ్యుర్థులకు గులాబీ రంగు(పింక్), వార్డు మెంబర్లకు తెలుపు రంగు(వైట్) బ్యాలెట్ పేపర్లను ముద్రించి ఉంచారు. ఇప్పటికే హైదరాబాద్‌లో ముద్రించిన బ్యాలెట్ పేపర్లన్నీ జిల్లాకు చేరుకున్నాయి. బ్యాలెట్ పేపర్లతో పాటు ఎన్నికల సామగ్రిని కూడా నల్లగొండ ప్రభుత్వ ఆసుపత్రిలోని ఒక హాలులో భద్రపరిచారు. ప్రస్తుతం బ్యాలెట్ పేపర్ల పరిశీలన ప్రక్రియ కొనసాగుతోంది. అన్ని సరిగానే ఉన్నాయా లేదా పరిశీలిస్తూ బండిల్స్‌గా కడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment