ఫ ప్రభుత్వ జూనియర్ కాలేజీలకు కొత్త లెక్చరర్లు ఫ తీరనున్న బోధన కష్టాలు
నల్లగొండ : ప్రభుత్వ జూనియర్ కళాశాలకు కొత్త అధ్యాపకులు రానున్నారు. 13 సంవత్సరాలుగా పూర్తి స్థాయి అధ్యాపకులు లేక కళాశాలల్లో బోధన అంతంత మాత్రంగా సాగుతోంది. కొత్త అధ్యాపకుల నియామకం చేపట్టిన ప్రభుత్వం వారికి బుధవారం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా నియామక పత్రాలను అందించింది. త్వరలోనే విధుల్లో చేరనున్నారు.
పదోన్నతులతోనే సరి..
సంవత్సరాల తరబడి ప్రభుత్వం లెక్చరర్ల నియామకాలను చేపట్టలేదు. అయితే 2014, 2016, 2019, 2021లో పదోన్నతులు కల్పించారు. అయితే గత ప్రభుత్వం కాంట్రాక్టు లెక్చరర్లను రెగ్యులర్ చేసింది. వీరితోపాటు కొందరు కాంట్రాక్ట్, గెస్ట్ లెక్చరర్లతో బోధన సాగుతోంది. దీంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ప్రస్తుతం కొత్త నియామకాలు చేపట్టడంతో జిల్లాకు దాదాపు 40 నుంచి 50 మంది వరకు కొత్త అధ్యాపకులు రానున్నారు. దీంతో అధ్యాపకుల కొరత తీరనుంది.
ప్రస్తుతం ఉన్న లెక్చరర్ల వివరాలు
ప్రభుత్వ జూనియర్ కాలేజీలు 13
ప్రస్తుతం రెగ్యులర్ లెక్చరర్లు 35
రెగ్యులరైజ్‌డ్ కాంట్రాక్టు లెక్చరర్లు 112
కాంట్రాక్టు లెక్చరర్లు 27
గెస్టు లెక్చరర్లు 54