నామినేషన్ల ప్రక్రియలో నిబంధనలు పాటించాలి | Sakshi
Sakshi News home page

నామినేషన్ల ప్రక్రియలో నిబంధనలు పాటించాలి

Published Wed, Apr 17 2024 1:30 AM

- - Sakshi

నంద్యాల: సార్వత్రిక ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థులు నామినేషన్ల ప్రక్రియలో ఎన్నికల నిబంధనలను తు.చా తప్పక పాటించాలని జిల్లా కలెక్టర్‌ మరియు జిల్లా ఎన్నికల అధికారి శ్రీనివాసులు పేర్కొన్నారు. కలెక్టరేట్‌ లోని కలెక్టర్‌ చాంబర్‌లో జిల్లా ఎన్నికల అధికారి డా.కె. శ్రీనివాసులు నామినేషన్ల ప్రక్రియ, ఎన్నికల సంసిద్ధతపై విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈనెల 18వ తేదీన ఎన్నికల గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసి నామినేషన్లను స్వీకరించడం జరుగుతుందన్నారు. నామినేషన్లు వేసే అభ్యర్థులు అఫిడవిట్‌ 26 ఏలో వున్న వర్తించే, వర్తించని కాలమ్‌లలో వివరాలన్నింటిని తప్పక పూరించాలన్నారు. అభ్యర్థులు నామినేషన్ల దాఖలకు 13 రకాల డాక్యుమెంట్లను తీసుకురావాలని, అన్ని సక్రమంగా ఉంటే నామినేషన్లను అనుమతిస్తామన్నారు. ఈనెల 18వ తేదీ నుంచి 25వ తేదీ వరకు ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లను స్వీకరించడం జరుగుతుందన్నారు. ప్రభుత్వ సెలవు దినాలలో నామినేషన్‌ స్వీకరించబడదన్నారు. పార్లమెంటరీ నియోజకవర్గం కోసం ఫారం–2ఏ, అసెంబ్లీ నియోజకవర్గం కోసం ఫారం–2బి సమర్పించాలన్నారు. నామినేషన్ల స్వీకరణకు సంబంధించి ప్రతి నియోజకవర్గంలో ఒక హెల్ప్‌ డెస్క్‌ ఏర్పాటు చేసామన్నారు. నామినేషన్‌ వేసే ముందు రోజు నుండే అభ్యర్థి ప్రత్యేక బ్యాంక్‌ అకౌంట్‌ ఖాతాను ప్రారంభించాల్సి ఉంటుందన్నారు. ఆ అకౌంట్‌ నుండే బ్యాంకు లావాదేవీలు జరపాలన్నారు. జిల్లా వ్యాప్తంగా రూ.3,01,99,221 నగదు, రూ. 8,42,637 విలు వైన 40,064.72 లీటర్ల సారా, రూ.9,822 విలువైన 2,186 గ్రాముల మాదకద్రవ్యాలు, రూ.4,12,631 విలువైన 6,177.57 గ్రాముల ఆభరణాలు, రూ.8,51, 406 విలువైన ఇతర వస్తువులను వెరసి మొత్తం రూ. 4,54,06,518లను సీజ్‌ చేయడం జరిగిందన్నారు.

చిత్తశుద్ధితో ఎన్నికల విధులు నిర్వహించాలి

నందికొట్కూరు: సార్వత్రిక ఎన్నికల్లో పీఓలు, ఏపీఓలు, సిబ్బంది చిత్తశుద్ధితో వ్యవహరించాలని నంద్యాల జిల్లా ఎన్నికల అధికారి శ్రీనివాసులు ఆదేశించారు. మంగళవారం పట్టణంలోని బాలికల జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో పీఓలకు, ఏపీఓలకు నిర్వహించిన రెండోవ రోజు శిక్షణ కార్యక్రమాన్ని ఆయన పరిశీలించారు. మే నెల13వ తేదీన జరిగే సార్వత్రిక ఎన్నికల్లో పీఓల బాధ్యత అత్యంత కీలకమన్నారు. ఎన్నికల్లో అందరూ అప్రమత్తంగా ఉండాలని రీ పోలింగ్‌కు అవకాశం లేకుండా చిత్తశుద్ధితో విధులు నిర్వర్థించాలని సూచించారు. పోలింగ్‌ రోజు ఉదయం 5 గంటలకు పోలింగ్‌ బూత్‌లో పూర్తి ఏర్పాట్లు చేసుకుని 5. 30 గంటలకే మాక్‌ పోలింగ్‌ నిర్వహించాలన్నారు. పీఓలు ఎన్నికల కమిషన్‌ ఆదేశాలను తూచా తప్పకుండా పాటించాలని చెప్పారు. ఉదయం 7 గంటలకే పోలింగ్‌ ప్రారంభించాలన్నారు. పోలింగ్‌ ఏజెంట్లుగా వలంటీర్లు ఉండకూడదని తెలిపారు. వలంటీర్లు రాజీనామా చేసిన వలంటీర్లకు సబంధించి బీఎల్‌ఓ, ఎంపీడీఓ ధ్రువీకరించిన తరువాత ఏజెంట్లుగా పెట్టుకోవచ్చన్నారు. సర్పంచులు, కౌన్సిలర్లు, ఎంపీటీసీలు, వార్డు మెంబర్లు కూడా పోలింగ్‌ ఏజెంట్లుగా ఉండవచ్చని స్పష్టం చేశారు. వీవీ ప్యాట్‌లను ఖాళీ చేసి, ఈవీఎంలను రీసెట్‌ చేయాలన్నారు. ఈయన వెంట ఆర్వో దాసు, తహసీల్దార్లు, తదితరులు ఉన్నారు.

ఈనెల 18వ తేదీ నుంచి 25 వరకు నామినేషన్ల స్వీకరణ

జిల్లా కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి శ్రీనివాసులు

Advertisement
 
Advertisement
 
Advertisement