ఇంకా ఎదురుచూపులే!
కర్నూలు సిటీ: డీఎస్సీకి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు నిరీక్షణ తప్పడం లేదు. అదిగో ఇదిగో నోటిఫికేషన్ అంటూ కూటమి సర్కారు తీవ్ర జాప్యం చేస్తోంది. వివిధ కారణాలు చూపి వాయిదాలా మీద వాయిదాలు వేస్తోంది. టెట్ ఫలితాలు వెలువడిన వెంటనే నోటిఫికేషన్ ఇస్తామని గతంలో విద్యాశాఖ ప్రకటించింది. ఈనెల 4వ తేది ఫలితాలు రావడంతో నోటిఫికేషన్ ప్రకటన ఎప్పుడు వస్తుందా అని నిరుద్యోగులు ఎదురు చూస్తున్నారు. ఏడాదికిపైగా వారు అన్ని పనులు మానుకొని పరీక్షలకు సన్నద్ధమవుతున్నారు. కొందరు అప్పులు చేసి కోచింగ్ తీసుకున్నారు. మరోవైపు పాఠశాల విద్యాశాఖ అధికారులు ఉమ్మడి జిల్లాలో ఎన్ని పోస్టులు భర్తీ చేస్తున్నారు, ఏఏ కేటగిరిలో భర్తీ చేస్తున్నారో తెలియజేసేందుకు వెబ్‌సైట్‌ను సైతం సిద్ధం చేశారు. అయితే, ప్రభుత్వం నుంచి నోటిఫికేషన్ జారీకి ఎలాంటి ఆదేశాలు రాకపోవడం.. ఎస్సీ వర్గీకరణ విషయంలో సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ఉద్యోగ నియామకాల్లో ఎస్సీ రిజర్వేషన్ల అమలు అంశం కొలిక్కి రాకపోవడం, స్పోర్ట్స్ కోటా పెంపు తదితర కారణాలతో ఇప్పట్లో డీఎస్సీ నిర్వహణపై అనుమానాలు తలెత్తుతున్నాయి.
స్పెషల్ ఎడ్యుకేషన్
అభ్యర్థులకు అన్యాయం
ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు బోధన చేసేందుకు స్పెషల్ ఎడ్యుకేషన్ కోర్సు పూర్తి చేయాలి. ఈ కోర్సు చేసిన అభ్యర్థులకు గత నెలలో టెట్ నిర్వహించారు. అయితే, మెగా డీఎస్సీలో ఈ కోర్సుకు సంబంధించి ఒక్క పోస్టు కూడా భర్తీ చేయడం లేదు. విద్యాశాఖ నోటిఫై చేసిన పోస్టులను చూస్తే ఈ విషయం అర్థమవుతుంది. పోస్టులే లేనప్పుడు తమకు ఎందుకు టెట్ నిర్వహించారని ఆ కోర్సు చేసిన అభ్యర్థులు ప్రశ్నిస్తున్నారు.
డీఎస్పీ నోటిఫికేషన్ తాత్కాలిక వాయిదాతో ఆందోళనలో అభ్యర్థులు
ఉమ్మడి జిల్లాలో మొత్తం 2,645 పోస్టులు
ఎస్‌జీటీ 1731, స్కూల్ అసిస్టెంట్లు 816
మున్సిపల్ స్కూళ్లలో 98 పోస్టుల భర్తీకి నోటిఫై
స్పెషల్ ఎడ్యుకేషన్ అభ్యర్థులకు డీఎస్సీలో పోస్టులు చూపించని ప్రభుత్వం
సబ్జెక్టుల వారీగా పోస్టుల వివరాలు
నూతన డీఎస్సీ ద్వారా ఉమ్మడి జిల్లాలో ఎస్‌జీటీ 1731 (తెలుగు మీడియం 1611,కన్నడ 28, ఉర్దూ 92), స్కూల్ అసిసెంట్లు తెలుగు ఉర్దూ 06, కన్నడ 03, తెలుగు 70, హిందీ 113, ఇంగ్లిషు 78, గణితం ఉర్దూ 08, కన్నడ మీడియం 16, తెలుగు 66, ఫిజికల్ సైన్స్ కన్నడ 12, తెలుగు 54, బయోలాజికల్ సైన్స్ తెలుగు 56, ఉర్దూ 03, కన్నడ 13, సోషల్ స్టడీస్ తెలుగు మీడియం 99, ఉర్దూ 11, కన్నడ 02, ఫిజికల్ ఎడ్యుకేషన్ 206, మున్సిపల్ స్కూళ్ల యాజమాన్యంలో ఎస్‌జీటీ 38, స్కూల్ అసిస్టెంట్లు తెలుగు 11, ిహిందీ 2, ఇంగ్లిషు 4, గణితం 3, ఫిజికల్ సైన్స్ 4, బయోలాజికల్ సైన్స్ 4, సోషల్ స్టడీస్ 4, ఫిజికల్ ఎడ్యుకేషన్ 6 పోస్టుల భర్తీ చేయనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment