మహబూబ్‌నగర్: పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్ట్‌లో భాగంగా కాంగ్రెస్ శనివారం చేపట్టిన రిజర్వాయర్ల సందర్శన ఉత్కంఠకు దారితీసింది. శనివారం రాత్రే సమాచారం అందుకున్న పోలీసులు కొల్లాపూర్‌తో పాటు ఉమ్మడి జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఆ పార్టీకి చెందిన వారిని ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో నార్లాపూర్ రిజర్వాయర్ నుంచి సందర్శనకు శ్రీకారం చుట్టిన మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు హైదరాబాద్ నుంచి అక్కడకు వెళ్లకుండా.. కల్వకుర్తి మీదుగా మహబూబ్‌నగర్‌కు చేరుకున్నారు.
షాద్‌నగర్‌కు చెందిన కాంగ్రెస్ నాయకుడు వీర్లపల్లి శంకర్, పెద్దమందడి ఎంపీపీ మేఘారెడ్డితో కలిసి నేరుగా కాంగ్రెస్ కార్యాలయంలోకి ఉదయం 8 గంటలకు వెళ్లారు. సమాచారం అందుకున్న పోలీసులు పెద్దఎత్తున అక్కడికి చేరుకోగా.. హడావుడి చోటుచేసుకుంది. లోపల విలేకరుల సమావేశంలో మాట్లాడిన అనంతరం మధ్యాహ్నం 12.35 గంటలకు జూపల్లి తదితరులు బయటకు రాగా.. పోలీసులు అరెస్ట్ చేయడానికి ప్రయత్నించడంతో కొంతసేపు గందరగోళం నెలకొంది. తమను ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు.. ఏమైనా ధర్నా చేస్తున్నామా అని జూపల్లి, నాయకులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. దీంతో కాసేపు ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. జూపల్లి, ఇతర నాయకులను పోలీసులు అరెస్ట్ చేసి వాహనంలోకి తీసుకెళుతుండగా.. కార్యకర్తలు అడ్డుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
జూపల్లి, ఇతర నాయకులను పోలీసులు మహమ్మదాబాద్ పోలీస్‌స్టేషన్‌కు తరలిస్తుండగా.. అదే దారిలో వస్తున్న నాగర్‌కర్నూల్ డీసీసీ అధ్యక్షుడు డాక్టర్ వంశీకృష్ణ, కూచుకుళ్ల రాజేష్‌రెడ్డి తదితరులు అక్కడే రోడ్డుపై బైఠాయించారు. పోలీసులు వారిని సైతం అరెస్ట్ చేసి మహబూబ్‌నగర్ టూటౌన్ పోలీస్‌స్టేషన్‌కు, జూపల్లి తదితరులను మహమ్మదాబాద్ పీఎస్‌కు తరలించారు. ఇలా సుమారు మధ్యాహ్నం ఒంటిగంట వరకు నాటకీయ పరిణామాలు చోటుచేసుకోగా.. ఉత్కంఠ నెలకొంది.
సంజీవ్ ముదిరాజ్, కొత్వాల్ అరెస్ట్..
జూపల్లి కృష్ణారావును కలవడానికి కాంగ్రెస్ కార్యాలయానికి వస్తున్న టీపీసీసీ ఉపాధ్యక్షుడు ఒబేదుల్లా కొత్వాల్, ప్రధాన కార్యదర్శి సంజీవ్ ముదిరాజ్, బెక్కరి మధుసూదన్‌రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అదేవిధంగా పట్టణంలో నాయకులు సిరాజ్‌ఖాద్రీ, రాములు యాదవ్, సాయిబాబా, తాహెర్ తదితరులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వీరందరినీ సొంత పూచికత్తుపై విడుదల చేసినట్లు పోలీసులు వెల్లడించారు.
ఓట్ల కోసమే హడావుడిగా ప్రారంభిస్తున్నారు: జూపల్లి
స్టేషన్ మహబూబ్‌నగర్: ‘పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్ట్ కాల్వలకు సంబంధించి భూసేకరణ పూర్తికాలేదు.. టెండర్లు పిలవనే లేదు.. మరి ఏ విధంగా ప్రాజెక్ట్ పూర్తయింది.’అని జూపల్లి ప్రశ్నించారు. ఈ ప్రాజెక్ట్ పూర్తయిందని కేసీఆర్, మంత్రి నిరంజన్‌రెడ్డి చెప్పడం పూర్తి అవాస్తమన్నారు. రానున్న ఎన్నికల్లో ఓట్ల కోసమే పూర్తికాని ప్రాజెక్ట్‌ను ప్రారంభిస్తున్నారని విమర్శించారు.
శనివారం మహబూబ్‌నగర్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ నార్లాపూర్ రిజర్వాయర్ రెండో లిఫ్ట్ ద్వారా నుంచి ఏదుల వరకు కెనాల్ ద్వారా నీళ్లు పంపాలని.. ఈ కెనాళ్లు పూర్తికానప్పుడు ఏ విధంగా నీళ్లు తీసుకుపోతారని ప్రశ్నించారు. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్ట్ పూర్తయినప్పుడు ప్రతిపక్ష నాయకులకు ఎందుకు చూపించరు.. ప్రాజెక్ట్‌లో అవినీతి జరగనప్పుడు ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నించారు. ప్రాజెక్ట్ పూర్తయినట్లు గూగుల్ మ్యాప్‌లోనే మీ పనితనం చూపిస్తున్నారని.. హైదరాబాద్‌లో సీడబ్ల్యూసీ, సోనియాగాంధీ సభల ప్రాధాన్యతను తగ్గించేందుకే ఈ ప్రాజెక్ట్‌ను ప్రారంభిస్తున్నారని విమర్శించారు.
ప్రభుత్వ లెక్కల ప్రకారం కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్‌కు రూ.5,570 కోట్లలో ఇంకా రూ.500 కోట్లు ఖర్చు చేయాల్సి ఉందన్నారు. 1,44,450 ఎకరాల ఆయకట్టుకు ఇప్పటికీ నీళ్లు రాలేదన్నారు. తొమ్మిదేళ్లవుతున్నా.. కల్వకుర్తి ప్రాజెక్ట్ ఇంకా పూర్తికాలేదన్నారు. కల్వకుర్తి ప్రాజెక్ట్‌ట్ లెక్కను బట్టి పాలమూరు–రంగారెడ్డి పూర్తిచేయడానికి 20 ఏళ్లు పడుతుందన్నారు.
ముందస్తు అదుపులోకి..
జిల్లాకేంద్రంలోని వన్‌టౌన్, టూటౌన్, రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం ముందస్తుగా 35 మంది కాంగ్రెస్ నేతలను అదుపులోకి తీసుకున్నారు. వన్‌టౌన్ పరిధిలో 10 మంది, టూటౌన్‌లో 20, రూరల్ పరిధిలో ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment