మహబూబ్‌నగర్: బీజేపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి సస్పెన్స్.. ఆ తర్వాత ఆయన ఘాటు స్పందన ఉమ్మడి పాలమూరులో హాట్‌టాపిక్‌గా మారింది. ఆయన మాట లు పార్టీలో కాకరేపుతుండగా.. ఈ పరిస్థితులు ఎటు దారితీస్తాయోననే ఆందోళన కమలం శ్రేణు ల్లో నెలకొంది. మరోవైపు తన దారెటు అనేది యెన్నం స్పష్టం చేయనప్పటికీ.. ఆయన వ్యవహరిస్తున్న తీరును బట్టి కాంగ్రెస్‌లో చేరుతారనే ఊహాగానాలు విన్పిస్తున్నాయి. ఈ అంశం మహబూబ్‌నగర్ నియోజకవర్గం నుంచి టికెట్ ఆశిస్తున్న ‘హస్తం’ నేతలను కలవరపెడుతోంది.
‘మునుగోడు’ తర్వాత అంటీముట్టనట్టు..
బీజేపీలో కొద్దికాలంగా మారుతున్న పరిణామాలతో యెన్నం శ్రీనివాస్‌రెడ్డి అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రధానంగా నల్లగొండ జిల్లా మునుగోడు ఉపఎన్నికలు.. ఆ తర్వాత పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి మార్పు తదితర అంశాలుపై కొన్నాళ్లుగా ఆయన కినుక వహించారు. ఈ క్రమంలో మహబూబ్‌నగర్ నియోజకవర్గంలో నిర్వహించిన పార్టీ కార్యక్రమాలకు సైతం ఆయన కొంత దూరంగానే ఉన్నారు.
బీజేపీ జాతీయ, రాష్ట్రస్థాయి నేతల పర్యటనలకు కూడా రాకపోవడం అప్పట్లోనే చర్చనీయాంశంగా మారింది. మరోవైపు పార్టీకి చెందిన తన ముఖ్య అనుచరులు, కార్యకర్తలతో బీజేపీ అధిష్టానం స్టాండ్ మార్చిందంటూ సంకేతాలు ఇవ్వడమే కాకుండా పార్టీ మారితే ఎలా ఉంటుందనే అభిప్రాయాలను సేకరించినట్లు సమాచారం. ఈ క్రమంలో ఆదివారం ఆయన మహబూబ్‌నగర్‌తో పాటు హన్వాడకు చెందిన పార్టీ నాయకులు, కార్యకర్తలతో హన్వాడలో సమావేశమయ్యారు. త్వరలో కాంగ్రెస్ పార్టీలో చేరతానని, అందరూ తనకు మద్దతుగా నిలవాలని కోరినట్లు తెలిసింది. రహస్య భేటీపై సమాచారం తెలుసుకున్న పార్టీ పెద్దలు అదే రోజు రాత్రి యెన్నంను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు.
అటు ఆందోళన.. ఇటు గుబులు..
మహబూబ్‌నగర్ నియోజకవర్గంలో బీసీ వర్గానికి చెందిన నాయకుడు ఎన్‌పీ వెంకటేష్ ఏడాది క్రితం కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. ఇటీవల మళ్లీ ఆయన తిరిగి కాంగ్రెస్ గూటికి చేరారు. యెన్నం సైతం త్వరలో కాంగ్రెస్‌లో చేరనున్నట్లు సమాచారం. ఈ క్రమంలో బీజేపీ శ్రేణులు ఆందోళన చెందుతుండగా.. ఇదే సమయంలో స్థానిక కాంగ్రెస్ నేతల్లో గుబులు మొదలైంది.
యెన్నం అసెంబ్లీ టికెట్ ఆశించి కాంగ్రెస్‌లోకి వస్తుండడమే ఇందుకు కారణం. కాంగ్రెస్‌లో ఇప్పటికే ఈ సీటు కోసం సంజీవ్ ముదిరాజ్, ఒబేదుల్లా కొత్వాల్ తదితర నాయకుల మధ్య పోటాపోటీ నెలకొంది. తాజాగా మారుతున్న పరిణామాలు వారిని కలవరానికి గురిచేస్తున్నాయి. కాగా.. బీజేపీ నుంచి మాజీ ఎంపీ ఏపీ జితేందర్‌రెడ్డికి మహబూబ్‌నగర్ అసెంబ్లీ టికెట్ ఖరారు కావడంతోనే యెన్నం రూట్ మార్చినట్లు సైతం రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment