కమలం గూటికి మున్సిపల్‌ చైర్‌పర్సన్‌..? | Sakshi
Sakshi News home page

కమలం గూటికి మున్సిపల్‌ చైర్‌పర్సన్‌..?

Published Thu, May 9 2024 3:50 AM

కమలం గూటికి మున్సిపల్‌ చైర్‌పర్సన్‌..?

నలుగురు బీఆర్‌ఎస్‌ కౌన్సిలర్లు హస్తం గూటికి

పేట మున్సిపాలిటీలో ఖాళీ అవుతున్న కారు

నారాయణపేట: మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ గందె అనసూయ తన అనచరులతో బీఆర్‌ఎస్‌ పార్టీని వీడీ గురువారం డీకే అరుణ సమక్షంలో కమలం గూటికి చేరుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. 2017లో చైర్‌పర్సన్‌ బాధ్యతతో పార్టీని వీడి మళ్లీ 2023లో అదే బాధ్యతతో గందె అనసూయ సొంతగూడు అయిన బీజేపీలో చేరుతుండడం చర్చనీయాంశంగా మారింది. ఇదిలాఉండగా, మరి కొన్ని రోజుల్లో లోక్‌సభ ఎన్నికలు ఉండగా.. మున్సిపల్‌ పాలక వర్గంలో చైర్‌పర్సన్‌ భర్త, వైస్‌ చైర్మన్‌ మధ్య విబేధాలతో కౌన్సిలర్లు చేరో దారి పడుతుండడం పట్టణంలో చర్చనీయాంశమైంది. ఇది వరకు మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ హరినారాయణభట్టడ్‌ కాంగ్రెస్‌ గూటికి చేరారు. ఆయనతో పాటు ఇద్దరు కౌన్సిలర్లు అమీరుద్దీన్‌, సరితలు సైతం కాంగ్రెస్‌లోకి వెళ్లిపోయారు. మరో ఐదుగురు బీఆర్‌ఎస్‌ మహిళా కౌన్సిలర్లు సైతం పార్టీ మారారు. నలుగురు కాంగ్రెస్‌లోకి వెళ్లగా మరొకరు బీజేపీలోకి చేరిపోయారు. 2వ వార్డు జొన్నల అనిత, 12వ వార్డు కౌన్సిలర్‌ వరలక్ష్మి, 13వ వార్డు కౌన్సిలర్‌ బస్సపురం నారాయణమ్మ, 15వ వార్డు కౌన్సిలర్‌ బండి రాజేశ్వరితో పాటు వారి అనుచరులు ఏపీ జితేందర్‌రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌ పార్టీలోకి చేరడంతో వారికి కండువ కప్పి ఆహ్వానించారు. మరో కౌన్సిలర్‌ మెఘాశ్రీపాద్‌ పార్టీని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు, ఎంపీ అభ్యర్థి డీకే అరుణ సమక్షంలో కమలం గూటికి చేరడంతో వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

బీఆర్‌ఎస్‌కు షాక్‌..

నెల రోజుల వ్యవధిలోనే మున్సిపాటీలోని బీఆర్‌ఎస్‌ పాలకవర్గంలో మున్సిపల్‌వైస్‌ చైర్మన్‌తో పాటు ఏడుగురు కౌన్సిలర్లు కాంగ్రెస్‌ పార్టీలో చేరడంతో బీఆర్‌ఎస్‌ పార్టీకి, మాజీ ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డికి షాక్‌ తగిలినట్లయ్యింది. బీఆర్‌ఎస్‌ కౌన్సిలర్లు, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ సైతం చేరో దారిలో వెళ్లిపోతుండడంతో పార్టీకి కోలుకోని దెబ్బ అని పలువురు చర్చించుకుంటున్నారు.

Advertisement
Advertisement