డ్రగ్స్ రహిత సమాజాన్ని నిర్మిద్దాం
● ర్యాగింగ్‌కు పాల్పడితే
చట్టపరంగా చర్యలు
● విద్యార్థుల అవగాహన సదస్సులో
ఎస్పీ యోగేష్ గౌతమ్
కోస్గి: కొందరు యువత డ్రగ్స్ అలవాటు చేసుకొని మత్తుకు బానిసలుగా మారి తమ విలువైన జీవితాలను నాశనం చేసుకుంటున్నారని, డ్రగ్స్‌ను సంపూర్ణంగా నిర్మూలించడం ఓ సామాజిక బాధ్యతగా భావించి ప్రతి ఒక్కరు డ్రగ్స్ నిర్మూలనలో భాగస్వాములు కావాలని, ముఖ్యంగా డ్రగ్స్ నిర్మూలనకు విద్యార్థిలోకం నడుం బిగించాలని ఎస్పీ యోగేష్ గౌతం సూచించారు. శనివారం స్థానిక ప్రభుత్వ ఇంజినీరింగ్ కళాశాలలో మాదక ద్రవ్యాల దుర్వినియోగం, సైబర్ క్రైం, ర్యాగింగ్‌లపై కళాశాల విద్యార్థులకు ప్రత్యేక అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఎస్పీ ముఖ్య అథితిగా హాజరై మాట్లాడుతూ.. ప్రభుత్వం మాదక ద్రవ్యాల నిరోధానికి ఎంతో ప్రాముఖ్యతనిస్తూ డ్రగ్స్ కట్టడికి కఠిన చర్యలు తీసుకుంటుందన్నారు. కళాశాలల విద్యార్థులే లక్ష్యంగా కొందరు ముఠా డ్రగ్స్‌ను అలవాటు చేసి తమ వ్యాపారం మొదలు చేస్తారని, విద్యార్థులను అప్రమత్తం చేసి అవగాహన కల్పించేందుకు పోలీస్ శాఖ తరపున చర్యలు తీసుకున్నామన్నారు. విద్యార్థులు ర్యాగింగ్‌కు దూరంగా ఉండి కష్టపడి చదివి ఉన్నత స్థాయికి చేరుకోవాలన్నారు. ఎవరైన ర్యాగింగ్ చేస్తే భయపడకుండా 100కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని, డ్రగ్స్‌పై సైతం అప్రమత్తంగా ఉంటూ తమను తాము కాపాడుకుంటూనే చుట్టుపక్కల ఎవరూ డ్రగ్స్‌కు అలవాటు కాకుండా చూడాల్సిన బాధ్యత తీసుకోవాలన్నారు. శిక్షణ కలెక్టర్ గరిమా నరుల మాట్లాడుతూ కష్టపడి చదివితే ఎన్నో అద్భుతాలు సృష్టించవచ్చునని, తాను కష్టపడి చదివి కలెక్టర్ స్థాయి వరకు చేరుకున్న అంశమే ఇందుకు ఉదాహరణగా తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ శ్రీనివాసులు, ఎంపీడీఓ శ్రీధర్, ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపల్ శ్రీనివాస్, ఎంఈఓ శంకర్ నాయక్, సీఐ దస్రూ నాయక్, ఎస్సై బాల్‌రాజ్, ఇంజనీరింగ్, పాలిటెక్నిక్ కళాశాలల విద్యార్థులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment