2021 Roundup: Most Popular Youtube Channels and Web Series- Sakshi
Sakshi News home page

2021 Roundup: ఈ ఏడాది యూట్యూబ్‌ టాపర్లు వీరే..

Published Thu, Dec 30 2021 12:22 PM | Last Updated on Thu, Dec 30 2021 1:19 PM

2021 Roundup: Most Popular Youtube Channels and Web Series - Sakshi

►నిన్న మొన్నటివరకూ ఇంటర్నెట్‌ సామ్రాజ్యంలో యూట్యూబ్‌ అంటే కేవలం కాలక్షేపం కోసం నెటిజన్లు వీక్షించే ఓ వినోద సాధనమే.

► మరి నేడు... వీక్షకులకు వినోదం, విజ్ఞానాన్ని అందిస్తూనే యూట్యూబర్లకు కోట్లాది మంది సబ్‌స్క్రైబర్లను, అంతకన్నా మించి భారీగా ఆదాయాన్ని సంపాదించిపెట్టే కల్పతరువు! ప్రతి నిమిషం ఈ ప్రసార మాధ్యమంలో ఏకంగా 30 లక్షల వీడియోలు అప్‌లోడ్‌ అవుతున్నాయంటే యూట్యూబ్‌ స్థాయి ఎంతలా పెరిగిందో అర్థం చేసుకోవచ్చు. మరి... 

►ఈ ఏడాది యూట్యూబ్‌లో టాప్‌ ట్రెండింగ్‌ ఏమిటి?

►భారత్‌లో నాలుగు రాళ్లు వెనకేసుకున్నదెవరు? చార్ట్‌లు బద్దలు కొట్టిన పాటలేమిటి?

►వినోదం పంచిన వెబ్‌సిరీస్, గేమ్‌లు ఏవి? ఓసారి పరిశీలిద్దాం..

సాక్షి, హైదరాబాద్‌: ఈ ఏడాది యూట్యూబ్‌లో వినూత్నమైన ఆలోచనలతో సృష్టించిన వీడియోలు మంచి ఆదరణ పొందాయి. ‘ఏ2మోటివేషన్స్‌’, ‘మిస్టర్‌ గ్యానీ ఫ్యాక్ట్స్‌’ వంటి చానళ్లు.. అద్భుతం, వినూత్నం, విచిత్రం అనిపించే విషయాలను నిమిషం, రెండు నిమిషాల వీడియోలైన ‘షార్ట్స్‌’లో బంధించాయి. అలాగే ‘క్రేజీ ఎక్స్‌వైజెడ్‌’, ‘మిస్టర్‌ ఇండియన్‌హ్యాకర్‌’ వంటి చానళ్ల నిర్వాహకులు విచిత్రమైన పనులు చేసి పాపులారిటీ, సబ్‌స్క్రైబర్లను సంపాదించుకున్నారు. తెలుగు యూట్యూబ్‌ చానళ్లు ఫిల్మీమోజీ, ఫన్‌మోజీలు అనిమోజీ పేరుతో అవతార్‌ ఆధారిత కంటెంట్‌ సృష్టించి ట్రెండింగ్‌ చార్టుల్లో పైకి చేరితే.. భువన్‌ బామ్‌ (బీబీ కి వైన్స్‌) తన కామెడీ వీడియోలను ‘ధిండోరా’ పేరుతో వెబ్‌ సిరీస్‌గా మార్చి 2.49 కోట్ల అభిమానులను సంపాదించుకున్నాడు.

గేమింగ్‌ విషయానికొస్తే ఇందులోనూ మూసపోకడలకు స్వస్తిపలికి కామెడీ, ప్రాంక్స్, సవాళ్లు వంటి అనేక అంశాల ఆధారంగా కొత్త గేమ్‌లు సిద్ధమయ్యాయి. గేమింగ్‌ అంటే ఇష్టపడే వాళ్లు ఇప్పుడు నగర ప్రాంతాలను దాటిపోవడం ఇంకో విశేషం. కోవిడ్‌ కారణంగా సినిమాలు తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో ఈ ఏడాది వీడియో పాటలు కొంచెం ఎక్కువ సంఖ్యలోనే విడుదలయ్యాయి. అంకుశ్‌ రజా, శిల్పి రాజ్‌ వంటివారు తమ భోజ్‌పురి సంగీతంతో ఈ ఏడాది టాప్‌ స్థానాల్లో నిలిచారు. మహిళల మ్యూజిక్‌ వీడియోల్లో తమిళ సింగర్లు అరివు, ఢీల వీడియో ‘ఎంజాయ్‌ ఎంజామీ’ చార్ట్‌లలో టాప్‌గా నిలిచింది. 
చదవండి: Top Apps In 2021: ఈ ఏడాది క్రేజీ యాప్స్‌ ఇవే..

‘ఈ తరం’ వెబ్‌ సిరీస్‌లు.. 
తెలుగు విషయానికి వస్తే... షణ్ముక్‌ జశ్వంత్‌ హీరోగా నటిస్తున్న యూట్యూబ్‌ సిరీస్‌ ‘సూర్యా’తోపాటు ‘గర్ల్‌ ఫార్ములా’ రూపొందించిన ‘30 వెడ్స్‌ 21’ ఆకట్టుకోగా.. దేశంలో యువతరం సమస్యలను, అనుభవాలను వినూత్నమైన పద్ధతుల్లో అందుబాటులోకి తెచ్చిన కొన్ని వెబ్‌ సిరీస్‌లు ఈ ఏడాది బాగా ప్రేక్షకాదరణ పొందాయి. ‘ద వైరల్‌ ఫీవర్‌’ నిర్మించిన కొత్త సిరీస్‌ ఆస్పిరెంట్స్‌.... యూపీఎస్సీకి సిద్ధమవుతున్న విద్యార్థుల కష్టాలు, సమస్యలు ఆశనిరాశలను ప్రతిబంబించింది. అలాగే డైస్‌ మీడియా వైద్యవిద్యార్థుల జీవితానుభవాల ఆధారంగా నిర్మించిన ‘ఆపరేషన్‌ ఎంబీబీఎస్‌’, గేమింగ్‌నే వృత్తిగా ఎంచుకున్న వారిపై రూపొందించిన ‘క్లచ్‌’ ప్రేక్షకుల మన్ననలు పొందాయి. 

బుల్లి వీడియోలు భలేభలే... 
యూట్యూబ్‌ ఇటీవలి కాలంలో ప్రవేశపెట్టిన చిన్న వీడియో విభాగం ‘షార్ట్స్‌’కూ దేశవ్యాప్తంగా ఆదరణ పెరుగుతోంది. నిమిషం కంటే తక్కువ నిడివి ఉండే ‘షార్ట్స్‌’ వీడియోలను ఇప్పుడు చాలా మాంది వివిధ రకాలుగా ఉపయోగించుకుంటున్నారు. 2021లో సృష్టించిన కొత్త, వినూత్న వీడియోల్లో స్పోకెన్‌ ఇంగ్లిష్‌ కోర్సులు మొదలుకొని కుటుంబ సంబంధాలు, స్ఫూర్తిదాయకమైనవి, పురుషుల సౌందర్య పరిరక్షణకు ఉపయోగపడేవి కూడా బోలెడు ఉన్నాయి. ‘ఏ2మోటివేషన్‌’ తొలిస్థానంలో నిలివగా ‘మిస్టర్‌ గ్యానీ ఫ్యాక్ట్స్‌’, ‘శివమ్‌ మాలిక్‌’, ‘లిటిల్‌గ్లవ్‌’, ‘ఇంగ్లిష్‌ కనెక్షన్‌’, ‘బసీర్‌ గేమింగ్‌’, ‘అజయ్‌ శర్మ’, ‘దుష్యంత్‌ కుక్రేజా’ వంటివి టాప్‌–10లో ఉన్నాయి.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement