న్యూఢిల్లీ: ఇంజనీరింగ్, వైద్యవిద్యల్లో ప్రవేశానికి నిర్వహించే జేఈఈ, నీట్ పరీక్షలను కరోనా వైరస్ తీవ్రత నేపథ్యంలో వాయిదా వేయాలని విపక్షాలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. అయితే పరీక్షలను వాయిదా వేసేది లేదని ఇదివరకే సుప్రీం స్పష్టం చేసిన నేపథ్యంలో మరోమారు సమీక్షించాలని కోరాయి. ఈ మేరకు బీజేపేతర ప్రభుత్వాలు పశ్చిమబెంగాల్, జార్ఖండ్, రాజస్థాన్, చత్తీస్‌గడ్, పంజాబ్, మహారాష్ర్ట రాష్ర్టాలు శుక్రవారం సంయుక్తంగా పిటిషన్ దాఖలు చేశారు. ఈ విషయంపై ఇది వరకే కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ బుధవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ముఖ్యమంత్రులు అమరీందర్ సింగ్, అశోక్ గహ్లోత్, భూపేష్ బాగేల్, హేమంత్ సోరేన్, మమతా బెనర్జీ, ఉద్ధవ్ ఠాక్రేలు ఈ మేరకు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ అంశంపై అవసరమైతే కోర్టును ఆశ్రయించాలని కాంగ్రెస్ పాలిత సీఎంలు పేర్కొన్న సంగతి తెలిసిందే. (నీట్, జేఈఈల వాయిదా ఉండదు!)
అయితే పరీక్షల వాయిదాని కోరుతూ 11 మంది విద్యార్థులు దాఖలుచేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ముందుగా నిర్ణయించిన సెప్టెంబర్ నెలలో జేఈఈ, నీట్ పరీక్షలు జరుగుతాయని కోర్టు స్పష్టం చేసింది. పరీక్షలను వాయిదా వేయడం వల్ల విద్యార్థులు నష్టపోతారని తెలిపింది. ఏడాదిపాటు అకడమిక్ ఇయర్‌ను విద్యార్థులు కోల్పోతారని, అది వారి భవిష్యత్తుపై ప్రభావం చూపిస్తుందని వ్యాఖ్యానించింది. కోవిడ్ జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు పోవాల్సిందేనని పేర్కొంది. సెప్టెంబర్ 1 నుంచి 6వ తేదీ వరకు జేఈఈ మెయిన్స్, సెప్టెంబర్ 13న నీట్‌ను దేశవ్యాప్తంగా ఉన్న 161 కేంద్రాల్లో నిర్వహించేందుకు ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం చేశారు. (నీట్, జేఈఈ : రియల్ హీరో రంగంలోకి)
Comments
Please login to add a commentAdd a comment