ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను జైలులో హతమార్చేందుకు కుట్ర పన్నారన్న ఆమ్ ఆద్మీ నేతల ఆరోపణలను బీజేపీ తీవ్రంగా ఖండించింది. ఆప్ వ్యాఖ్యలు పచ్చి అబద్ధమని కొట్టిపారేసింది. ఇలాంటి సంచలన ప్రకటనలు చేయడం మానుకోవాలని బీజేపీ హితువు పలికింది.
బీజేపీ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పార్టీ అధికార ప్రతినిధి షాజియా ఇల్మీ మాట్లాడారు. సీఎం కేజ్రీవాల్ ఆరోగ్యంగా ఉండాలని మేమంతా కోరుకుంటున్నాం. మా కంటే జైలు నిర్వాహణ అధికారులు తమ రోగులను (ఖైదీలు) జాగ్రత్తగా చూసుకుంటారు.
ప్రభుత్వం, జైలు నిర్వహణ అధికారులు కేజ్రీవాల్ (క్షీణిస్తున్న) ఆరోగ్య పరిస్థితులకు ఎందుకు బాధ్యత వహించాలని కోరుకుంటారు. ఆయన ప్రాణాలను ప్రమాదంలో పడేసేందుకు ఎందుకు ప్రయత్నిస్తారు? ఎవరైనా అలాంటి పనులు ఎందుకు చేస్తారా? అని ప్రశ్నించారు. జైల్లో కేజ్రీవాల్‌కి ఇన్సులిన్ ఇవ్వలేదన్న అతిషి ఆరోపణను తోసిపుచ్చారు. భారతదేశంలో ఏ జైలు ఇలా చేయదు. మనది చాలా బాధ్యతాయుతమైన ప్రజాస్వామ్యం అని స్పష్టం చేశారు.
ఆప్ నేతలు వ్యాఖ్యలు
కేజ్రీవాల్‌కు వ్యతిరేకంగా జైల్లో కుట్ర జరుగుతోందని, జైలులో ఆయనకు ఏదైనా జరగవచ్చని ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ సంజయ్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. మరోవైపు అదే పార్టీకి చెందిన ఢిల్లీ క్యాబినెట్ మంత్రి అతిషి సైతం జైల్లో ఉన్న కేజ్రీవాల్‌కు ఇంటి భోజనం, మధుమేహానికి ఇన్సులిన్ ఇచ్చేలా నిరాకరించడం ద్వారా కేజ్రీవాల్‌ను చంపడానికి కుట్ర జరుగుతుందని ఆరోపించగా.. ఆమె చేసిన వ్యాఖ్యల్ని జైలు అధికారులు ఖండించారు.
Comments
Please login to add a commentAdd a comment