ముంబై: రాజ్యసభ ఎన్నికల తమ అభ్యర్థిని గెలిపించుకోవడం కోసం చిన్న పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలను బీజేపీ ప్రలోభాలకు గురిచేయాలనుకుంటోందని, ఈ క్రమంలో వారిపై ఒత్తిడి తెస్తోందని శివసేన నేత సంజయ్‌రౌత్ ఆరోపించారు. ఈనెల 10న జరగనున్న రాజ్యసభ ఎన్నికల్లో మహావికాస్ ఆఘాడీ సంకీర్ణ కూటమి (ఎంవీఏ) నాలుగు సీట్లను గెలుచుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. అయితే తమ ప్రభుత్వం తరఫున ఏ పార్టీలనూ, ఎమ్మెల్యేలను ఒత్తిడి చేయడం లేదని తెలిపారు.
శివసేన –ఎన్‌సీపీ–కాంగ్రెస్ కూటమి ఇప్పటికీ ఆరు సీట్లలో నాలుగు సీట్లను కైవసం చేసుకుంటుందని విశ్వాసం వ్యక్తం చేసిన ఆయన, కాషాయ పార్టీకి ‘డబ్బులు వృధా చేసుకోవద్దని’ సూచించారు. ‘మూడో అభ్యర్థిని నిలబెట్టడం ద్వారా బీజేపీ రాజ్యసభ ఎన్నికలలో అనైతికంగా పోటీ చేయాలని నిర్ణయించుకుంది. వారికి మూడో అభ్యర్థిని గెలిపించుకునే బలం లేదన్న సంగతి అందరికీ తెలిసిందే. దానికోసం ఆ పార్టీ స్వతంత్ర ఎమ్మెల్యేలు, చిన్న పార్టీలపై ఆధారపడుతోంది. ఓట్లకోసం వారిపై ఒత్తిడి తెస్తోందని మాకు మొత్తం సమాచారం అందుతోంది’ అని రౌత్ విమర్శించారు. ‘మహావికాస్ ఆఘాడీ కూడా ఎన్నికలను సీరియస్‌గా తీసుకునే పోరాడుతోంది. అయితే మా వద్ద లేనిది ఈడీ మాత్రమే’ అని రౌత్ కేంద్రంలోని బీజేపీకి చురకలు అంటించారు.
ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలను ప్రలోభపరచడం, వారిని డబ్బులతో కొనడం ద్వారా ఎన్నికలలో లాభపడాలని కాషాయ పార్టీ ఆలోచన.. అయితే వారికి ఒకటే సలహా ఇస్తున్నాను..వారు డబ్బును వృధా చేయకూడదు (ఎన్నికల కోసం), బదులుగా దానిని సమాజ సేవకోసం ఉపయోగించాలని కోరుతున్నానని వ్యాఖ్యానించారు. అయితే శనివారం లాతూర్‌లో బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ను రౌత్ వ్యాఖ్యలపై స్పందించాలని విలేకరులు కోరగా ఆయన నిరాకరించారు. అసలు ‘సంజయ్ రౌత్ ఎవరు? ఆయన ఇష్టంవచ్చినట్టు వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు. నేను వారికి ఎందుకు సమాధానం చెప్పాలి?’అని మాజీ ముఖ్యమంత్రి ఫడ్నవీస్ ప్రశ్నించారు. బీజేపీ కేంద్ర మంత్రి పీయూష్ గోయల్, అనిల్ బోండే, మాజీ ఎంపీ ధనంజయ్ మహదిక్‌లను తమ అభ్యర్థులుగా నిలబెట్టిన విషయం తెలిసిందే.
చదవండి: బెడిసికొట్టిన ఏకగ్రీవం.. రాష్ట్రంలో 24 ఏళ్ల తరువాత రాజ్యసభ ఎన్నికలు
► శివసేన సంజయ్ రౌత్, సంజయ్ పవార్‌లను తమ అభ్యర్థులుగా నిలబెట్టింది.
►ఎన్‌సీపీ ప్రఫుల్ పటేల్ పేరును మళ్లీ ప్రతిపాదించగా, కాంగ్రెస్ ఇమ్రాన్ ప్రతాప్‌గఢ్‌ని బరిలోకి దింపింది.
►ఆరో సీటు కోసం బీజేపీకి చెందిన మహాదిక్, సేనకు చెందిన పవార్ మధ్య పోరు సాగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment