గుజ్జర్, బకర్వాల్, పహాడీ వర్గాలకు ఎస్టీ హోదా | Amit Shah Promises ST Reservation For Gujjar, Bakarwal And Bakarwal | Sakshi
Sakshi News home page

గుజ్జర్, బకర్వాల్, పహాడీ వర్గాలకు ఎస్టీ హోదా

Published Wed, Oct 5 2022 6:27 AM | Last Updated on Wed, Oct 5 2022 6:27 AM

Amit Shah Promises ST Reservation For Gujjar, Bakarwal And Bakarwal - Sakshi

రాజౌరీ(జమ్మూకశ్మీర్‌): జమ్మూకశ్మీర్‌లో వెనక బడిన వర్గాలైన గుజ్జర్, బకర్వాల్, పహాడీలకు ఎస్టీ హోదా కల్పిస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా హామీ ఇచ్చారు. జమ్మూకశ్మీర్‌ పర్యటనలో ఉన్న అమిత్‌ మంగళవారం రాజౌరీలో ఏర్పాటుచేసిన ఒక ర్యాలీలో ప్రసంగించారు. ‘ జస్టిస్‌ వర్మ కమిషన్‌ సిఫార్సుల మేరకు ఈ మూడు వర్గాల ప్రజలకు ఎస్టీ రిజర్వేషన్‌ ఫలాలు దక్కుతాయి. వీరికి కొత్తగా రిజర్వేషన్‌ ఇవ్వడం వల్ల ఇప్పటికే ఎస్టీ కోటా లబ్ధి పొందుతున్న వర్గాలకు ఎలాంటి నష్టం జరగబోదు. మూడేళ్ల క్రితం ఆర్టికల్‌ 370, ఆర్టికల్‌ 35–ఏ రద్దుచేశాక నేడు ఈ వర్గాలకు రిజర్వేషన్‌ కల్పించే అవకాశం వచ్చింది’ అని షా అన్నారు.

‘ఒక్క పహాడీలకే ఎస్టీ హోదా దక్కుతుందని కొందరు విష ప్రచారం చేసి గుజ్జర్, బకర్వాల్‌లను నిరసనలకు రెచ్చగొట్టారు. కానీ ఆ పాచికలు పారలేదు. గతంలో కేవలం మూడు కుటుంబాలే కశ్మీర్‌ను దశాబ్దాలపాటు ఏలాయి. ఇప్పుడు పంచాయతీ, జిల్లా మండళ్లకు జరిగిన పారదర్శకమైన ఎన్నికల ద్వారా 30 వేల మందికి తమ రాష్ట్రాన్ని ముందుకు నడిపించే అధికారమొచ్చింది’ అని రాష్ట్ర ప్రతిపక్ష పార్టీలను అమిత్‌ దుయ్యబట్టారు. ‘పునర్‌వ్యవస్థీకరణ తర్వాత రాజౌరీ, పూంచ్, దోడా, కిష్ట్‌వార్‌లలో సీట్లు పెరుగుతాయి. తర్వాతే రాష్ట్ర ఎన్నికలు ఉంటాయి.

గతంలో రాష్ట్రానికొచ్చే కేంద్ర నిధులతో కొన్ని వర్గాలే లబ్ధి పొందేవి. ఇప్పుడా పరిస్థితి లేదు. శాంతి భద్రతల పరిస్థితి మెరుగుపడింది’ అని షా అన్నారు. సరిహద్దు జిల్లాలైన రాజౌరీ, పూంచ్‌లలో జనాభాలో 40 శాతం మంది బకర్వాల్, గుజ్జర్‌లే. పహాడీల జనాభా అతి స్వల్పం. 1991 ఏప్రిల్‌ నుంచి కశ్మీరీలు, డోగ్రాలకు 10 శాతం ఎస్టీ రిజర్వేషన్‌ ఫలాలు దక్కుతున్నాయి. తమకు రిజర్వేషన్‌ కల్పించాలని చాన్నాళ్లుగా పహాడీలు డిమాండ్‌ చేస్తుండగా గుజ్జర్, బకర్వాల్‌లు వ్యతిరేకిస్తున్నారు. 2020 జనవరి నుంచి ఉద్యోగాలు, విద్యా సంస్థల్లో పహాడీలకు 4 శాతం కోటా కల్పించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement