Delhi Election 2025: ఆ మూడు పార్టీల బలాలు.. బలహీనతలు | Announcement Of Assembly Elections In Delhi 2025, Know About Strengths And Weaknesses Of AAP, BJP And Congress | Sakshi
Sakshi News home page

Delhi Election 2025: ఆ మూడు పార్టీల బలాలు.. బలహీనతలు

Published Wed, Jan 8 2025 8:01 AM | Last Updated on Wed, Jan 8 2025 8:56 AM

Announcement of Elections in Delhi and Condition of Parties

దేశరాజధాని ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల సందడి నెలకొంది. ఫిబ్రవరి ఐదున ఎన్నికలు జరగనుండగా, ఎనిమిదో తేదీన ఫలితాలు వెల్లడికానున్నాయి. ఆమ్‌ ఆద్మీ పార్టీ ఇప్పటికే అన్ని స్థానాల నుంచి పోటీచేసే తమ అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. ఈ విషయంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు  వెనుకబడి  ఉన్నాయి. ప్రస్తుతం ఈ మూడు పార్టీలకున్న బలాలు, బలహీనతలేమిటో ఇప్పుడు చూద్దాం.

ఆమ్‌ఆద్మీ పార్టీ(ఆప్‌) 
అవినీతి నిర్మూలన పేరుతో ఆవిర్భవించిన ఆమ్‌ ఆద్మీ పార్టీ(Aam Aadmi Party) ఇప్పుడు పలు అవినీతి ఆరోపణలను ఎదుర్కొంటోంది. 2013లో జరిగిన ఎన్నికల్లో ఆప్‌ 29.49 శాతం ఓట్లను సాధించి, మొత్తం 70 సీట్లలో 28 సీట్లను గెలుచుకుంది.  రెండేళ్ల తర్వాత అంటే 2015లో అఖండ విజయం సాధించింది. 54.34శాతం ఓట్లతో 67 సీట్లు గెలుచుకుంది. నాడు బీజేపీకి మూడు సీట్లు మాత్రమే వచ్చాయి. కాంగ్రెస్ ఖాతా కూడా తెరవలేదు. 2020లో ఆప్‌ మళ్లీ అద్భుతం చేసింది. సీట్ల సంఖ్య స్వల్పంగా 62కి పడిపోయినా, 53.57శాతం ఓట్ల వాటాను కొనసాగించింది.

ఒకప్పుడు తమ పార్టీ మార్పునకు నాందిగా అభివర్ణించిన ఆ పార్టీ ఇప్పుడు అవినీతి ఆరోపణలను ఎదుర్కొంటోంది. మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ దాదాపు ఆరు నెలల పాటు జైల్లోనే ఉన్నారు. మరోనేత మనీష్ సిసోడియా 17 నెలల పాటు జైలు జీవితం గడిపారు. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్, రాజ్యసభ సభ్యుడు సంజయ్ సింగ్ కూడా జైలుకు వెళ్లారు. వీరంతా ప్రస్తుతం బెయిల్‌పై ఉన్నారు. ఇవన్నీ పార్టీకి మైనస్‌ పాయింట్లుగా నిలిచాయని విశ్లేషకులు అంటున్నారు.

భారతీయ జనతా పార్టీ (బీజేపీ)
బీజేపీ దేశ రాజధానిలో గెలుపు రుచి చూడాలని ఉవ్విళ్లూరుతోంది. పంజాబ్‌ మినహా ఉత్తర భారతదేశంలో గత రెండు దశాబ్దాలుగా బీజేపీ అధికారం ఎరుగని ఏకైక ప్రాంతం ఢిల్లీ. అయితే బీజేపీ(BJP) తన ఓటు బ్యాంకును కాపాడుకోవడంలో విజయం సాధించింది.  1998 నుంచి ఢిల్లీలో ఓటమిపాలవుతున్నప్పటికీ, గత ఆరు అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్ల శాతం ఎప్పుడూ 32శాతం కంటే తగ్గలేదు. 2015లో మూడు సీట్లు మాత్రమే వచ్చినప్పటికీ, ఓట్లు 32.19శాతం వచ్చాయి. ఐదేళ్ల తర్వాత ఎనిమిది సీట్లు గెలుచుకున్నప్పుడు ఓట్ల శాతం 38.51 శాతానికి పెరిగింది.

1998, 2003, 2008లో వరుసగా మూడు ఎన్నికల్లో కాంగ్రెస్‌ చేతిలో బీజేపీ ఓడిపోయింది. ఆ తర్వాత 2013, 2015, 2020లో ఆప్ కాంగ్రెస్‌ను ఓడించింది. కాంగ్రెస్‌కు షీలా దీక్షిత్, ఆప్‌కు అరవింద్ కేజ్రీవాల్‌ల మాదిరిగానే బీజేపీకి ఢిల్లీలో ప్రజాభిమానం పొందిన నేత లేకపోవడం బీజేపీ ఓటమికి ప్రధాన కారణంగా నిలిచింది. బీజేపీ 2015లో కిరణ్ బేడీని పార్టీలోకి తీసుకొచ్చినప్పటికీ, ఎటువంటి అద్భుతం జరగలేదు.

కాంగ్రెస్ 
కాంగ్రెస్‌పార్టీ ఇటీవలి కాలంలో అనేక ఒడిదుడుకులను ఎదుర్కొంటోంది. గత ఎన్నికల్లో కేవలం 4.26శాతం ఓట్లు మాత్రమే దక్కించుకుంది. ఢిల్లీలో కాంగ్రెస్‌కు సుదీర్ఘ చరిత్ర ఉంది. 1998లో ఢిల్లీలో అధికారంలోకి వచ్చిన ఆ పార్టీ లోక్‌సభ ఎన్నికల్లో ఏడింటిలో ఒక్క సీటును మాత్రమే గెలుచుకోగలిగింది. 1998 నవంబర్‌లో జరిగిన ఎన్నికల్లో 47.76శాతం ఓట్లతో 52 సీట్లను కాంగ్రెస్‌ గెలుచుకుంది. ఆ దిరిమిలా  షీలా దీక్షిత్(Sheila Dikshit) 15 ఏళ్ల పాటు ఢిల్లీ సీఎంగా కొనసాగారు.

2013లో కాంగ్రెస్‌కు ఘోర పరాభవం ఎదురయ్యింది. షీలా దీక్షిత్.. కేజ్రీవాల్ చేతిలో ఓడిపోయారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 4.26 శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి. 66 మంది అభ్యర్థుల్లో 63 మంది డిపాజిట్లు కోల్పోయారు. ఢిల్లీలో కాంగ్రెస్‌కు ప్రజాభిమానం కలిగిన నేత కరువయ్యారు. ఓటు బ్యాంకును కూడా  కోల్పోయింది. ఈ నేపధ్యంలో ముస్లింలు తమ పార్టీకి మద్దతునిస్తారని ఆప్‌ నేతలు భావిస్తున్నారు. ఏదిఏమైనా ఢిల్లీ ఎన్నికల విషయంలో కాంగ్రెస్  గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది. బీజేపీతో పొత్తును తిరస్కరించింది. అయితే కేజ్రీవాల్‌ను లక్ష్యంగా చేసుకోవాలనే ఉద్దేశంలో కాంగ్రెస్‌ హైకమాండ్  లేదని సమాచారం.

ఇది కూడా చదవండి: Mahakumbh Mela: ‘ధాన్యం బాబా’ తలపై పంటలు.. చూసేందుకు జనం క్యూ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement