బేకరీ నిర్వాహకుని హత్య అనంతరం స్థానికులతోపాటు ఇతర దుకాణదారులు ఆగ్రహంతో రోడ్లపైకి వచ్చారు. పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ, మార్కెట్ మధ్యలో ఆందోళన చేపట్టారు. వాహన రాకపోకలను అడ్డుకున్నారు. నిందితులను వెంటనే అరెస్టు చేయాలని ఆందోళన కారులు కోరారు.
బీహార్‌లోని ఆరా ప్రాంతంలో శనివారం అర్థరాత్రి ఆయుధాలు ధరించిన కొందరు దుండగులు ఒక బేకరీ దుకాణదారుడిని తుపాకీతో కాల్చి హత్యచేశారు. కేకు కొనుగోలు చేసేందుకు వచ్చిన దుండగులు ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. ఘటన జరిగిన వెంటనే అక్కడి నుంచి పరారయ్యారు. సమాచారం అందుకోగానే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించి, కేసు దర్యాప్తు చేస్తున్నారు. కాగా ఈ ఘటన జరిగిన వెంటనే మృతుని కుటుంబసభ్యులతో పాటు స్థానికులు రోడ్లపైకి చేరి ఆందోళనకు దిగారు. నిందితులను వెంటనే అరెస్టు చేయాలని నినాదాలు చేశారు. బిహియా పోలీస్ స్టేషన్ పరిధిలోని రాజా బాజార్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రాంతంలో ఉంటున్న అశుతోష్ సింగ్ కుమారుడు మనోహర్ కుమార్ ఉరఫ్ మిన్చీ(35) తన ఇంటిలో బేకర్స్ కింగ్ అనే దుకాణాన్ని నడుపుతున్నాడు.
మృతుని తండ్రి అశుతోష్ సింగ్ తెలిపిన వివరాల ప్రకారం శనివారం రాత్రి సుమారు 11.30 గంటల సమయంలో దుకాణానికి ముగ్గురు వినియోగదారుల వచ్చి కేకు అడిగారు. దీంతో మనోహర్ వారికి కేకు అందించి, డబ్బులు అడిగాడు. వెంటనే వారు తుపాకీతో తన కుమారునిపై కాల్పులు జరిపారన్నారు. కాల్పుల శబ్ధం వినగానే ఇంటిలోనివారంతా దుకాణంలోనికి వచ్చి చూశారు. అయితే ఇంతలోనే నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు.
తీవ్రంగా గాయపడిన మనోహర్‌ను కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. అక్కడి వైద్యులు బాధితుడని పరిశీలించి మృతి చెందాడని నిర్థారించారు. కాగా మృతునికి గానీ, కుటుంబ సభ్యులకు గానీ శతృవులెవరూ లేరని అశుతోష్ తెలిపారు. ఈ సందర్భంగా భోజ్‌పుర్ ఎస్పీ ప్రమోద్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ ఈ ఘటనకు గల కారణాలు ఇంకా తెలియలేదని, ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నామని, నిందితులను త్వరలోనే పట్టుకుంటమన్నారు.
Comments
Please login to add a commentAdd a comment