ఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ నేత అరవింద్ కేజ్రీవాల్ రౌస్ అవెన్యూ కోర్టును ఆశ్రయించారు. గురువారం కేజ్రీవాల్ రెగ్యులర్ బెయిల్, మధ్యంతర బెయిల్ పొడిగింపుపై రౌస్ అవెన్యూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్ విచారణ పరిగణనలోకి తీసుకునే అంశంపై మధ్యాహ్నం 2 గంటలకు రౌస్ అవెన్యూ కోర్టు జడ్జి కావేరి భవేజా విచారణ జరపనున్నారు.
మధ్యంతర బెయిల్‌ను మరో వారం రోజులు పొడిగించాలని కోరుతూ కేజ్రీవాల్ వేసిన పిటిషన్‌ను విచారించే అవకాశం లేదని సుప్రీంకోర్టు బుధవారం తెలిపింది. కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్ లిస్టింగ్‌కు సుప్రీం రిజిస్ట్రీ నిరాకరించింది. రెగ్యులర్ బెయిల్ కోసం ట్రయల్ కోర్టుకు వెళ్లేందుకు ఆయనకు స్వేచ్ఛ ఉందని తెలిపింది. అందుకే ఈ పిటిషన్ విచారణార్హమైనది కాదని పేర్కొంది.
ఈ నెల మొదట్లో లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో పాల్గొనటం కోసం షరతులతో కూడిన 21 రోజుల మధ్యంతర బెయిల్‌ను సుప్రీం కోర్టు మంజూరు చేసింది. జూన్ 2న మళ్లీ తిరిగి తిహార్ జైలులో లొంగిపోవాలని పేర్కొన్న విషయం తెలిసిందే. గడవు దగ్గర పడుతున్న సమయంలో అనారోగ్యానికి సంబంధించి మరో ఏడు రోజులు బెయిల్ పొడిగించాలని కేజ్రీవాల్ కోరుతూ.. సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్ విచారణార్హమైనది కాదని సుప్రీం కోర్టు బుధవారం కొట్టివేసిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment