బంగ్లాదేశ్‌లో కొనసాగుతున్న రిజర్వేషన్ల నిరసనల మధ్య ఆ దేశ ప్రధాని షేక్ హసీనా చిక్కుల్లో పడబోతున్నారా? అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. షేక్ హసీనా రాజీనామా చేయాలనే డిమాండ్ నుంచి నిరసనకారులు ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు.
ఇటువంటి పరిస్థితుల నేపధ్యంలో బంగ్లాదేశ్ ఆర్మీ అధికారులు.. నిరసనకారులకు మద్దతు పలుకుతున్నట్లు కనిపిస్తోంది. తాజాగా ఆందోళనకారులకు, పాలక ప్రభుత్వానికి మధ్య జరిగిన ఘర్షణలో వంద మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో నిరసనకారులపై ఇకపై కాల్పులు జరపబోమని సైన్యం స్పష్టం చేసింది. మరోవైపు చర్చల కోసం ప్రధాని హసీనా చేసిన ప్రతిపాదనను విద్యార్థి నాయకులు తిరస్కరించారు.
మీడియాకు అందిన సమాచారం ప్రకారం బంగ్లాదేశ్ ఆర్మీ చీఫ్ (సీఏఎస్) ఆర్మీ హెడ్‌క్వార్టర్స్‌లో అధికారులతో సమావేశమైన దరిమిలా ఇకపై నిరసనకారులపై ఒక్క బుల్లెట్ కూడా కాల్చబోమని ప్రకటించారు. అలాగే అధికార మార్పిడి అప్రజాస్వామికంగా జరిగితే బంగ్లాదేశ్ కూడా కెన్యాలా మారుతుందని వ్యాఖ్యానించారు. 1971 తర్వాత దేశంలో ఇదే అత్యంత హింసాత్మక నిరసన అని ఆయన పేర్కొన్నారు.
కాగా నిరసనకారులు దేశవ్యాప్తంగా సహాయ నిరాకరణ ఉద్యమాన్ని ప్రారంభించాలని బంగ్లాదేశ్‌కు చెందిన ప్రొఫెసర్ నజ్ముల్ అహ్సాన్ కలీముల్లా పిలుపునిచ్చారు. బంగ్లాదేశ్ రాజకీయ నిపుణుల విశ్లేషణ ప్రకారం ఈ ఉద్యమం తీవ్రతరమైతే, ప్రభుత్వం అత్యవసర పరిస్థితిని ప్రకటించాల్సిన పరిస్థితి ఏర్పడనుంది.
Comments
Please login to add a commentAdd a comment